Udaipur దర్జీ కన్నయ్యలాల్ హంతకులను 30 కిలోమీటర్లు వెంటాడిన హీరోలు వీరే!

ABN , First Publish Date - 2022-07-05T21:29:15+05:30 IST

ఉదయ్‌పూర్ దర్జీ కన్నయ్యలాల్ సాహు హత్య కేసు నిందితులను 30 కిలోమీటర్ల మేర భయం

Udaipur దర్జీ కన్నయ్యలాల్ హంతకులను 30 కిలోమీటర్లు వెంటాడిన హీరోలు వీరే!

జైపూర్: ఉదయ్‌పూర్ దర్జీ కన్నయ్యలాల్ సాహు హత్య  కేసు నిందితులను 30 కిలోమీటర్ల మేర భయం లేకుండా వెంబడించిన శక్తిసింగ్, ప్రహ్లాద్ సింగ్‌లు రాత్రికి రాత్రే హీరోలుగా మారిపోయారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా వీరిని పిలిపించుకుని మాట్లాడారు. రాజ్‌సమంద్ జిల్లాకు చెందిన వీరు జూన్ 28న వైరల్ అయిన కన్నయ్యలాల్ హత్య వీడియోను చూసిన కాసేపటికే పోలీసైన వారి స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చింది. కన్నయ్యలాల్‌ను హత్య చేసిన నిందితులు గౌస్ మహ్మద్, మహ్మద్ రియాజ్‌లు RJ27 AS2611 నంబరున్న బైక్‌పై పారిపోతున్నారని, వారిప్పుడు దియోగఢ్-భీమ్ మధ్య ఉండొచ్చని పేర్కొన్న ఆయన.. మీరు అక్కడే ఉంటారు కాబట్టి వారిని పట్టుకోవడంలో మీ సాయం కావాలని కోరాడు.


ఆయన ఫోన్ పెట్టేసిన సరిగ్గా 20 నిమిషాలకు వారు నిల్చున్న బస్టాండ్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న నిందితులను శక్తి, ప్రహ్లాద్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వారిని వెంబడించాలని, తప్పించుకునే అవకాశం ఇవ్వొద్దన్న పోలీసుల అభ్యర్థనతో వెంటనే బైక్ తీసుకుని నిందితులను అనుసరిస్తూ బయలుదేరారు. అరావళి పర్వతాల సమీపంలోని కుగ్రామ వెంట కన్నార్పకుండా నిందితులను చేజ్ చేస్తూనే ఉన్నారు. వారిని అనుసరిస్తూనే పోలీసులతో మాట్లాడుతూ డైరెక్షన్స్ ఇచ్చారు. 


తమను అనుసరిస్తున్న శక్తి, ప్రహ్లాద్‌లను గుర్తించిన నిందితులు గౌస్, రియాజ్‌లు వారిని భయటపెట్టే ప్రయత్నం చేశారు. కన్నయ్యలాల్‌ను హత్యచేసేందుకు ఉపయోగించిన ఆయుధాలను చూపిస్తూ బెదిరించారు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని శక్తిసింగ్, ప్రహ్లాద్ సింగ్ దాదాపు 30 కిలోమీటర్ల పాటు వారిని వెంబడించి, పోలీసులు వారిని అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. నిందితులను భయం లేకుండా వారు వెంబడించిన వార్త బయటకు రావడంతో వారిద్దరూ హీరోలుగా మారిపోయారు.


భీమ్ ఎమ్మెల్యే సుదర్శన్ సింగ్ రావత్, రాజ్‌పుట్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు మహిపాల్ సింగ్ మక్రానాతో కలిసి సోమవారం సాయంత్రం వారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కలిశారు. ఈ సందర్భంగా శక్తిసింగ్, ప్రహ్లాద్‌లకు ప్రభుత్వ ఉద్యోగాలు, ముఖ్యంగా పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినట్టు మక్రానా తెలిపారు.


నిందితులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారని, అలాంటి వారిని అరెస్ట్ చేయడం తప్పనిసరని శక్తిసింగ్ పేర్కొన్నాడు. ఈ పనికి దేవుడు తమను ఎంచుకున్నాడని పేర్కొన్నాడు. వారిని చాలా దూరం నుంచే అనుసరిస్తుండడంతో భయపడలేదన్నాడు. వారు చాలా తెలివిగా చిన్నచిన్న గ్రామాల్లోంచి వెళ్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారని, కానీ తాము స్థానికులమన్న విషయం వారికి తెలియదని ప్రహ్లాద్ అన్నాడు. కాగా, కన్నయ్యలాల్ హత్య సమయంలో గాయపడిన ఆయన అసిస్టెంట్ ఈశ్వర్ గౌర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన ఇంటి వద్ద పోలీసులు కాపలాగా ఉన్నారు.

Updated Date - 2022-07-05T21:29:15+05:30 IST