ఎయిర్‌పోర్ట్‌కు డంపింగ్‌ యార్డు ముప్పు

ABN , First Publish Date - 2020-10-01T09:22:28+05:30 IST

శంషాబాద్‌ మండలం జెల్‌పల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయిం చిన డంపింగ్‌ యార్డుతో అంతర్జాతీయ విమానాశ్రయానికి ముప్పు పొంచి

ఎయిర్‌పోర్ట్‌కు డంపింగ్‌ యార్డు ముప్పు

రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఏర్పాటుకు సన్నాహాలు

పక్షుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం


శంషాబాద్‌ : శంషాబాద్‌ మండలం జెల్‌పల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయిం చిన డంపింగ్‌ యార్డుతో అంతర్జాతీయ విమానాశ్రయానికి ముప్పు పొంచి ఉంది. డంపింగ్‌ యార్డుకు వచ్చే పక్షుల వల్ల విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.  ఎయిర్‌పోర్ట్‌ను దాదాపుగా రెండింతలు విస్తరించే పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎయిర్‌ పోర్టు విస్తరించి ఉన్న 5650 ఎకరాల భూమి చుట్టూ ప్రహరీపై విద్యుత్తు వైర్లతో కంచె ఏర్పాటు చేశారు. ప్రహరీ చుట్టూ ఎవరూ చెత్తాచెదారం వేయకుండా హెచ్చరిక బోర్డులు పెట్టారు. ప్రస్తుతం శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలోని జెల్‌పల్లి ప్రాంతంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం భూమి కేటాయించింది. ఆ ప్రదేశాన్ని చదును చేసే పనులు మొదలుపెట్టింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు దగ్గరుండి వీటిని పర్యవేక్షిస్తున్నారు. అయితే, డంపింగ్‌యార్డు వల్ల పక్షుల సంఖ్య ఎక్కవైతే.. విమానం ముందు భాగంలోని ఇంజనుతోపాటు బ్లోయరులో ఇరుక్కొని ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంది.


విదేశాల్లోని ఓ ఎయిర్‌పోర్టు నుంచి బయలు దేరిన విమానం ముందు భాగంలోని రెక్కల్లో పక్షి ఇరుక్కొని విమానం కిందపడి పేలిపోయిన ఘటన గతంలో విదేశాల్లో జరిగింది. అందుకే రన్‌వే ప్రాంతంలో పక్షులు విహరించకుండా విమానాశ్రయ సిబ్బంది బాణాసంచా పేలుస్తూ ఉంటారు. అంతేకాకుండా డంపింగ్‌ యార్డు వల్ల తమ ప్రాంతం దుర్గంధభరితంగా మారి వాతావరణం కలుషితమవుతుందని జెల్‌పల్లి గ్రామం లోని యువజన సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గ్రామంలో ఆందోళన కూడా చేపట్టారు. ప్రభుత్వం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని డంపింగ్‌యార్డు ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ మేరకు జెల్‌పల్లి  నేతాజీ యువజన సంఘం సభ్యులు ఇటీవల కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. 


ప్రతిపాదనను విరమించుకోవాలి

డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం వాతావరణం కలుషితమయ్యే అవకాశం ఉంది. పక్షులు విమానాలకు తగిలి ప్రమాదం చోటు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్రాంతానికి సమీపంలో ఎర్రకుంట తదితర ప్రాంతాల్లో జంతువుల ఎముకలకు సంబంధించిన గోదాములున్నాయి.  ఈ ప్రాంతంలో డంపింగ్‌ యార్డు ఏర్పాటు ప్రతిపాధన మానుకోవాలి.  

- దూడల అరవింద్‌గౌడ్‌, జెల్‌పల్లి 

Updated Date - 2020-10-01T09:22:28+05:30 IST