చెత్తను వేయించేది.. తీయించేది వారే.. మంత్రి KTR ఆదేశాలు బేఖాతర్

ABN , First Publish Date - 2022-03-02T18:50:14+05:30 IST

జీహెచ్‌ఎంసీ అధికారులకు, అక్రమ చెత్త డంపింగ్‌ చేసే వారికి విడదీయరాని బంధం ఉంది. చెత్త తొలగించాలని స్థానికులు ఫిర్యాదు చేస్తే...

చెత్తను వేయించేది.. తీయించేది వారే.. మంత్రి KTR ఆదేశాలు బేఖాతర్

  • అధికారుల కనుసన్నల్లోనే..
  • మూడింతలు అధికంగా బిల్లులు 
  • ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టు కాలనీవాసులు
  • మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : జీహెచ్‌ఎంసీ అధికారులకు, అక్రమ చెత్త డంపింగ్‌ చేసే వారికి విడదీయరాని బంధం ఉంది. చెత్త తొలగించాలని స్థానికులు ఫిర్యాదు చేస్తే అధికారులు తొలగిస్తారు. మరుసటి రోజు నుంచి మళ్లీ అదే ప్రాంతంలో చెత్త డంప్‌ చేస్తున్నా ఎటువంటి వ చర్యలు తీసుకోరు. ఇదీ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-20 శానిటేష్‌ అధికారుల తీరు. 


గౌలిదొడ్డిలోని జర్నలిస్టుకాలనీ వద్ద అక్రమ చెత్త డంపింగ్‌తో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-20 అధికారులకు కాలనీవాసులు అనేకసార్లు ఫిర్యాదు చేసినా స్పందించ లేదు. దీంతో వారు ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తీసుకురాగా కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు అక్కడ ఉన్న చెత్త కుప్పలను తొలగించి చేతులు దులుపుకొన్నారు.  సర్కి ల్‌-20 అధికారుల నిర్లక్ష్యంపై గతంలో కాలనీవాసులు మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.  అక్రమ చెత్త డంపింగ్‌తో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన   సమస్యను పరిష్కరించాలని సర్కిల్‌-20 అధికారులను ఆదేశించారు. చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి హామీ ఇచ్చినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. దీంతో అక్రమంగా చెత్త డంపింగ్‌ చేసే వారు చెత్తను డంప్‌ చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకొని ఈ ప్రాంతాన్ని చెత్త రహిత ప్రాంతంగా మార్చాలని కాలనీవాసులు కోరుతున్నారు. 


మూడింతలు ఎక్కువ రాసుకునేందుకేనా.. 

చెత్త కుప్పలు పేరుకుపోయేంత వరకు జీహెచ్‌ఎంసీ అధికారులు వేచి చూస్తారు. స్థానికుల ఫిర్యాదులతో ఆ చెత్తను తరలించేందుకు ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఆర్డరిస్తారు. అక్కడ పేరుకుపోయిన చెత్త కుప్పలను తరలించేందుకు ఉన్నదానికంటే మూడింతలు ఎక్కువ ట్రిప్పులు తరలించినట్లుగా లెక్కలు రాసి జీహెచ్‌ఎంసీకి బిల్లులు సమర్పించి కాంట్రాక్టర్‌ ద్వారా ప్రజల సొమ్మును అధికారులు కాజేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి అక్రమ చెత్త డంప్‌ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని చెత్త కుప్పలను తొలగించాలని, మళ్లీ ఆ ప్రాంతంలో చెత్తను వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


మంత్రి ఆదేశాలు బేఖాతర్‌..

రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ను క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా, చెత్త రహిత నగరంగా మారుస్తామని ఉపన్యాసాలు ఇస్తుంటే... అవేవీ తమకు సంబంధించినవి కావు అన్నట్లుగా జీహెచ్‌ఎంసీ  సర్కిల్‌-20 శానిటేషన్‌ విభాగం అధికారుల తీరు ఉంది. మంత్రి ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.

Updated Date - 2022-03-02T18:50:14+05:30 IST