బొమ్మ తుపాకులతో బెదిరింపులు

ABN , First Publish Date - 2022-05-27T06:36:08+05:30 IST

గత నెల ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద అర్ధరాత్రి బైక్‌పై వెళుతున్న దంపతులను ఒక యువకుడు అటకాయించాడు.

బొమ్మ తుపాకులతో బెదిరింపులు

ఆన్‌లైన్‌లో కొనుగోలు వాటితో బెదిరింపులు, దోపిడీలు

బెడిసికొడితే కత్తులతో దాడులు

నగరంలో కొద్దిరోజులుగా పెరుగుతున్న కేసులు

ప్రజల్లో ఆందోళన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


గత నెల ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద అర్ధరాత్రి బైక్‌పై వెళుతున్న దంపతులను ఒక యువకుడు అటకాయించాడు. తుపాకీ చూపించి ఒంటిపై వున్న బంగారం ఇవ్వాలని బెదిరించాడు. బైక్‌పై వున్న వ్యక్తి ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేసి పరారయ్యాడు.

ఈనెల 22న అరకులోయ నుంచి గంజాయి తీసుకువస్తున్న ఇద్దరు రౌడీషీటర్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెంటాడి ఆనందపురం వద్ద పట్టుకున్నారు. వారిద్దరినీ తనిఖీ చేయగా రెండు డమ్మీ తుపాకులు లభ్యమయ్యాయి.

ఈనెల 23న ఉక్కునగరంలో ఒక వ్యక్తి బొమ్మ తుపాకీతో ఒక మహిళను బెదిరించి ఆమె మెడలోని ఆభరణాలను ఎత్తుకుపోయే ప్రయత్నంలో స్టీల్‌ప్లాంట్‌ అధికారిపై కత్తితో దాడి చేశాడు.

బొమ్మ తుపాకులు, కత్తులతో బెదిరించడం, దోపిడీలకు పాల్పడడం...నగరంలో ఇటీవల కాలంలో బాగా పెరిగింది.  రాష్ట్ర ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన నగరంలో కొంతకాలంగా నేరాలు పెరుగుతున్నాయి. గత ఏడాది పరిశీలిస్తే 38 హత్యలు, మూడు దారిదోపిడీలు, 15 దోపిడీలు, 765   చోరీలు సహా నేర పరిశోధన విభాగానికి సంబంధించి దాదాపు 11,500 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో రూ.6.5 కోట్ల విలువైన సొత్తు అపహరణకు గురైంది. ఈ గణాంకాలు చూస్తే నగరంలో క్రైమ్‌ రేట్‌ ఏ స్థాయిలో పెరుగుతోందనేది అర్థమవుతోంది. నేరాలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నామని ఒక వైపు పోలీసులు చెబుతుంటే...మరో వైపు నేరస్థులు  కొత్త కొత్త ఎత్తులు వేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.   దొంగతనాలు, దోపిడీలు ఎలా చేయాలో కొంతమంది ఇంటర్‌నెట్‌లో చూసి నేర్చుకుంటున్నారు. అందుకోసం బొమ్మ తుపాకీ, కత్తి సమకూర్చుకుంటున్నారు. వాటిని పట్టుకుని దందాలు, చోరీలు చేస్తున్నారు. గత నెల ఆరంభంలో ద్వారకానగర్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డులో అర్ధరాత్రి వేళ బైక్‌పై వెళుతున్న దంపతులను ఒక వ్యక్తి అడ్డుకున్నాడు. తుపాకీ, కత్తిచూపించి మహిళ మెడలోని ఆభరణాలను ఇవ్వాలని, లేకపోతే కాల్చేస్తానని బెదిరించాడు. బైక్‌పై వున్న వ్యక్తి ప్రతిఘటించడంతో నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో దాడి చేసి పరారైపోయాడు. అలాగే వారం కిందట ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రూపేష్‌ అనే రౌడీషీటర్‌ కత్తితో హల్‌చల్‌ చేశాడు. ఆ ప్రాంతానికి చెందిన కొంతమందిపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో పోలీసులు అతని వద్ద నుంచి బొమ్మ తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అలాగే వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన దండుపాళ్యం గ్యాంగ్‌లోని కీలక సభ్యుడు దోని సతీష్‌ అలియాస్‌ గసగసాలు, పెదజాలరిపేటకు చెందిన గుర్రాల సాయి మరో ముగ్గురితో కలిసి ఈనెల 22న అరకులోయ నుంచి గంజాయి తీసుకువస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందడంతో పెందుర్తి వద్ద కాపుకాశారు. పోలీసులను గమనించి నిందితులు ఆనందపురం వైపు పరారవ్వడంతో వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేస్తే రెండు బొమ్మ తుపాకీలు లభ్యమయ్యాయి. ఆ తరువాత రెండు రోజులకే స్టీల్‌ప్లాంట్‌లోని సెక్టార్‌-5లో ఒక యువకుడు బొమ్మతుపాకీ, కత్తితో బెదిరించి ఓ మహిళ మెడలోని ఆభరణాలను తెంచుకుని పారిపోబోయాడు. స్టీల్‌ప్లాంట్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ అడ్డుకోగా...కత్తితో దాడి చేశాడు. అతడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  బొమ్మ తుపాకీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్టు వెల్లడించాడు. నగరంలో ఇలాంటి వారు మరెంతో మంది ఉండే అవకాశం ఉందని, పోలీసులు వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.


బొమ్మ తుపాకీల కొనుగోలుపై నిఘా పెడతాం

గంగాధర్‌, క్రైమ్‌ ఏడీసీపీ

నగరంలో ఇటీవల కాలంలో బొమ్మ తుపాకీలతో బెదిరించి నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వీరంతా బొమ్మ తుపాకీలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించాం. దీనికి అడ్డుకట్ట వేయడంపై నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌తో చర్చించి, ఆయన ఆదేశాలు మేరకు చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2022-05-27T06:36:08+05:30 IST