ఆరోగ్య ఉపకేంద్రాలకు మంగళం?

ABN , First Publish Date - 2022-05-21T06:29:51+05:30 IST

మన్యంలో ఆరోగ్య ఉప కేంద్రాలను ఎత్తివేసి, గ్రామసచివాలయాల్లో వైద్య సేవలు అందించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం వుంది.

ఆరోగ్య ఉపకేంద్రాలకు మంగళం?
పాడేరు మండలం ఇరడాపల్లి ఆరోగ్య ఉప కేంద్రం

మన్యంలో సబ్‌ సెంటర్లు ఎత్తివేత

ఇకపై గ్రామ సచివాలయాల్లో వైద్య సేవలు

ప్రస్తుతం ఒక్కో ఆరోగ్య ఉపకేంద్రంలో ఇద్దరు ఏఎన్‌ఎంలు

సచివాలయాల్లో మాత్రం ఒక్కొక్కరే

మన్యంలో 199 సబ్‌సెంటర్లలో 398 మంది ఏఎన్‌ఎంలు

గ్రామసచివాలయాలు 212

మిగిలిన 186 మంది ఏఎన్‌ఎంలు ఉమ్మడి విశాఖ జిల్లాలో సర్దుబాటు

గిరిజనులకు మరింత దూరం కానున్న వైద్య సేవలు


(పాడేరు-ఆంధ్రజ్యోతి) 

మన్యంలో ఆరోగ్య ఉప కేంద్రాలను ఎత్తివేసి, గ్రామసచివాలయాల్లో వైద్య సేవలు అందించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం వుంది. సబ్‌సెంటర్లలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు ఇక నుంచి సచివాలయాల్లో సేవలు అందిస్తారు. ప్రస్తుతం ప్రతి ఆరోగ్య ఉప కేంద్రంలో ఇద్దరు ఏఎన్‌ఎంలు వుండగా, సచివాలయాల్లో మాత్రం ఒక్కొక్కరే వుంటారు. దీంతో ఏజెన్సీలోని శివారు గ్రామాల గిరిజనులకు ఇంతవరకు అందుతున్న అరకొర వైద్య సేవలు రానున్న రోజుల్లో మరింత దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

అల్లూరి సీతారామారాజు జిల్లా పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలో 199 ఆరోగ్య ఉప కేంద్రాలు వున్నాయి. ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో కనిష్ఠంగా 12, గరిష్ఠంగా 34 గ్రామాలు వున్నాయి. ప్రతి ఆరోగ్య ఉపకేంద్రంలో ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక హెల్త్‌ అసిస్టెంట్‌ వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య ఉప కేంద్రాలను ఎత్తివేసి, గ్రామ సచివాలయాల్లో (విలేజ్‌ క్లినిక్‌లు) వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఇద్దరు చొప్పున ఏఎన్‌ఎంలు ఉండగా, గ్రామ సచివాలయాల్లో ఒక్కో ఏఎన్‌ఎం మాత్రమే వుంటారు. ఇందులో  భాగంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఏజెన్సీలో ప్రస్తుతం 212 సచివాలయాలు వున్నాయి. వీటిల్లో ఒక్కొక్కరు చొప్పున ఏఎన్‌ఎం ఉండాలని, మిగిలిన ఏఎన్‌ఎంలను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అవసరమైన సచివాలయాల్లో వినియోగించుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏజెన్సీలోని సబ్‌సెంటర్లలో 398 ఏఎన్‌ఎంలు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరిలో 186 మంది ఏఎన్‌ఎంలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వుంటుంది. 

గిరిజనులకు వైద్య సేవలు మరింత దూరం

మన్యంలో 199 ఆరోగ్య ఉప కేంద్రాల్లో 398 మంది ఏఎన్‌ఎంలు పని చేస్తున్నప్పటికీ, శివారు గ్రామాల గిరిజనులకు సరైన వైద్య సేవలు అందడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో సచివాలయాల్లో ఏర్పాటు చేసే విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు మరింత దూరం అయ్యే ప్రమాదం వుందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వ నిర్ణయంతో పలు ఇబ్బందులు

శెట్టి నాగరాజు, కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు 

ఏజెన్సీలోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లోకి సర్దుబాటు చేయడం సరికాదు. గతంలో సాధారణ బదిలీల సమయంలో ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి బదిలీ చేయాలని ఏఎన్‌ఎంలు కోరితే... జీవో 68 ప్రకారం సాధ్యకాదన్న అధికారులు, ఇప్పుడు గిరిజన ఏఎన్‌ఎంలను ఇతర ప్రాంతాల్లోని సచివాలయాలకు ఎలా బదిలీ చేస్తారు? ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త విధానం కారణంగా గిరిజన ప్రాంతంలో వైద్య సేవలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. గిరిజన ప్రాంత ఏఎన్‌ఎంలను ఇక్కడే కొనసాగించాలి. ప్రతి సచివాలయంలో (విలేజ్‌ క్లినిక్‌) ఇద్దరు ఏఎన్‌ఎంలను నియమించాలి.


Updated Date - 2022-05-21T06:29:51+05:30 IST