Oct 24 2021 @ 11:00AM

దుల్కర్ పాన్ ఇండియా సినిమా రిలీజ్ ఎప్పుడంటే!

మాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ దుల్కర్ సల్మాన్.. గతేడాది ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొల్లయడిత్తాల్, వరణే ఆవశ్యముండు’ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ రెండూ సూపర్ హిట్టయ్యాయి. ఈ రెండింటినీ తెలుగులో కూడా విడుదల చేశారు. ఇక ఈ ఏడాది దుల్కర్ ఓ పాన్ ఇండియా మూవీతో థియేటర్స్ లోకి రానున్నారు. సినిమా పేరు ‘కురుప్పు’.  మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం అదే పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. దుల్కర్ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ కథానాయికగా సటిస్తోంది. ఈ సినిమాను నవంబర్ 12న థియేటర్స్ లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. 



కేరళ పోలీస్ డిపార్ట్ మెంట్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించిన నొటోరియస్ క్రిమినల్ ‘సుకుమార కురుప్పు’ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.  1984లో కేరళలో  ఇన్సూరెన్స్ డబ్బులకోసం చాకో అనే యువకుడ్ని కారులో బంధించి పెట్రోలు పోసి తగలబెట్టి.. తానే చనిపోయినట్టు పోలీసుల్ని నమ్మించాడు సుకుమార కురుప్పు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో చనిపోయింది కురుప్పు కాదని, చాకో అనే అమాయకుడని తేలింది. ఇప్పటికీ ఆ హంతకుడు పోలీసులకు దొరకలేదు. ఇంకా వెతుకునే ఉన్నారు. ఇందులో సుకుమార కురుప్పుగా దుల్కర్ నటిస్తున్నారు. ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. నిజానికి ఈ ఏడాది మేలో ఈ సినిమా విడుదల కావాల్సింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.