మందకొడిగా కొనుగోళ్లు

ABN , First Publish Date - 2022-05-06T05:30:00+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. రాష్ట్రంలో పండిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలో ఈసారి కేంద్రాల ఏర్పాటుపై ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో ధాన్యం సేకరణ కొంత ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

మందకొడిగా కొనుగోళ్లు

75 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అంచనా

ఇప్పటి వరకు చేసింది కేవలం 150 మెట్రిక్‌ టన్నులే

అకాల వర్షాలతో అన్నదాతల్లో గుబులు


సంగారెడ్డి టౌన్‌, మే 6: సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. రాష్ట్రంలో పండిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలో ఈసారి  కేంద్రాల ఏర్పాటుపై ముందస్తు  ప్రణాళికలు లేకపోవడంతో ధాన్యం సేకరణ కొంత ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. యాసంగి సీజన్‌ ప్రారంభంలో వరిపంట వేయొద్దంటూ సర్కారు రైతులకు సూచించడం వల్ల అయోమయ పరిస్థితుల వల్ల పంట వేయడం ఆలస్యమైంది. ఫలితంగా కోతలు కూడా లేటయ్యాయి. 


150 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

సంగారెడ్డి జిల్లాలో గత నెల 20న ధాన్యం కొనుగోలు  కేంద్రాలను ప్రారంభించినా ఇప్పటి వరకు కేవలం 150 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా 155 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉండగా ఇప్పటి వరకు కేవలం 44 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. ఆ 44 కేంద్రాల్లో 42 మంది రైతుల నుంచి   150 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 50 మెట్రిక్‌ టన్నులకు సంబంధించిన 15 మంది రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చే శారు. 150 మెట్రిక్‌ టన్నులకు సంబంధించి 42 మంది రైతులకు రూ.29లక్షలు చెల్లించాల్సి ఉండగా ఆన్‌లైన్‌లో నమోదు చేసింది మాత్రం కేవలం 15 మంది రైతులు రూ.10లక్షలు మాత్రమే. ఇంకా 27 మంది రైతులకు సంబంధించి వంద మెట్రిక్‌ టన్నుల వివరాలను నమోదు చేయాల్సి ఉంది. అయితే ఆన్‌లైన్‌లో నమోదైన 72 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరగాల్సి ఉన్నప్పటికీ ఒక్క పైగా కూడా అందకపోవడం గమనార్హం.


75 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రావచ్చని అంచనా

జిల్లాలో ఈ యాసంగిలో 35,262 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సారి మొత్తం 84,600 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చింది.  అయితే 9,600 మెట్రిక్‌ టన్నుల విత్తనాలు కేటాయించగా 75వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రావొచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం పీఏసీఎ్‌సల ద్వారా 63, డీసీఎంఎస్‌ ద్వారా 15 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ఇప్పటి వరకు కేవలం 44 కేంద్రాలనే ప్రారంభించారు. ఏ గ్రేడ్‌ వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.1,960, సాధారణ రకం క్వింటాలుకు రూ.1,940గా సర్కారు మద్దతు ధరను ప్రకటించింది. 


కొన్ని ప్రాంతాల్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

పటాన్‌చెరు, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లో మాత్రమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా కొనుగోళ్లు పుంజుకోలేదు. సంగారెడ్డి, జహీరాబాద్‌, అందోల్‌ నియోజకవర్గాల్లో ఇంకా ప్రారంభం కాలేదు. సింగూరు ప్రాజెక్టు పరిధిలోని మంజీరా పరివాహక ప్రాంతంలో అత్యధికంగా వరి సాగు చేసినా కోతకు ఇంకా 15 రోజులు పట్టొచ్చని అంచనా. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని నల్లవాగు ప్రాజెక్టు కింద కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాల్లో అధికంగా వరిసాగు చేసినప్పటికీ అక్కడ కూడా కోతలు ఆలస్యంగా ప్రారంభం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. 


=====================================================================================================================================================

Read more