Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ముస్లింలకు మొండిచేయి

twitter-iconwatsapp-iconfb-icon
ముస్లింలకు మొండిచేయికలెక్టరేట్‌లో ఉన్న మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయం

‘దుల్హన్‌’ పథకాన్ని రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం

కోర్టుకు నివేదించిన ఏజీపీ

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పథకం ప్రారంభం

పెళ్లి సమయంలో యువతులకు రూ.50 వేలు ఇచ్చేందుకు జీవో 

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 1,400 నుంచి 1,600 మందికి సాయం

తాను అధికారంలోకి వస్తే రూ.లక్ష ఇస్తానని జగన్‌ హామీ

అసలుకు ఎసరు

2019 నుంచి నిలిచిపోయిన పథకం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


ముస్లింలకు వైసీపీ ప్రభుత్వం మొండిచేయి చూపింది. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను పూర్తిగా నిలిపివేసింది. జగన్మోహన్‌రెడ్డి గుప్పించిన హామీలు చూసి గత ఎన్నికలలో ముస్లింలలో అత్యధికులు వైసీపీకి అండగా నిలిచారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడంతో హామీలన్నీ నెరవేరుతాయని ఆశించారు. అయితే గడచిన మూడేళ్లలో  కొత్త పథకాలు ప్రకటించకపోగా...ఉన్నవి కూడా నిలిపివేశారని ముస్లింలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎక్కువగా వున్న జిల్లాల్లో ఉమ్మడి విశాఖపట్నం ఒకటి. అల్ప సంఖ్యాకుల సంక్షేమ కార్యాలయ రికార్డుల మేరకు విశాఖ జిల్లాలో 1.7 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. అయితే రెండున్నర లక్షల వరకు వుంటారని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. ఇక వైసీపీ ఈ మూడేళ్లలో కోత వేసిన పథకాల్లో ‘దుల్హన్‌’ ముఖ్యమైనది. రాష్ట్ర విభజన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు హయాంలో ముస్లిం యువతుల కోసం ‘దుల్హన్‌’ పథకం ప్రారంభించారు. దీనికి సంబంధించి 2015 ఏప్రిల్‌ 29న జీవో (నంబరు 67) జారీచేశారు. దీని ప్రకారం పేద ముస్లిం యువతులకు వివాహ సమయంలో రూ.50 వేలు ఆర్థిక సాయంగా అందించేవారు. నిఖా (పెళ్లి)కు పదిహేను రోజుల ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం...పెళ్లికి ముందు, పెళ్లి సమయంలో, ఆ తరువాత...మూడు విడతలుగా రూ.50 వేలు పెళ్లి కుమార్తె బ్యాంకు ఖాతాకు జమ చేసేవారు. 

ఉమ్మడి విశాఖ జిల్లాలో 2015 నుంచి 2019 వరకు 1,500 నుంచి 1,600 మంది యువతులు ఈ దుల్హన్‌ పథకం కింద సాయం పొందారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకాన్ని వైఎస్సార్‌ దుల్హన్‌గా పేరు మార్చుతూ 2019 సెప్టెంబరు తొమ్మిదో తేదీన జీవో 105 జారీచేశారు. సాయం రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచబోతున్నట్టు ప్రకటిస్తూ...వైఎస్సార్‌ పెళ్లికానుక వెబ్‌సైట్‌ ఏర్పాటుచేశారు. వెబ్‌సైట్‌ ఏర్పాటుచేశారుగానీ దరఖాస్తులు అప్‌లోడ్‌కు ఆప్షన్‌ ఇవ్వలేదు సరికదా తరువాత దానిని మూసివేశారు. ఈ నేపథ్యంలో ‘దుల్హన్‌’ పథకం కింద సాయం పొందదలచని ముస్లింలు జిల్లా కలెక్టరేట్‌లో గల అల్ప సంఖ్యాక వర్గాల కార్యాలయానికి వచ్చేవారు. కొన్ని నెలలపాటు ఆ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం కనిపించకపోవడంతో చివరకు విసిగిపోయి రావడం మానేశారు. గడచిన మూడేళ్లలో ఒక్కరికి కూడా దుల్హన్‌ పథకం కింద సాయం చేయలేదు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో మాదిరిగా రూ.50 వేలైనా ఇవ్వాలని చాలాకాలం క్రితం కొందరు యువతులు స్పందనలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అయితే ఇప్పటివరకూ దుల్హన్‌ పథకం ఉందా?, రద్దు చేశారా? అనే విషయమై అధికారులు ఎవరూ నోరువిప్పలేదు. చివరకు గురువారం దుల్హన్‌ పథకం అమలును నిలిపివేశామని కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఆర్థిక ఇబ్బందులే దీనికి కారణమని సహాయ ప్రభుత్వ న్యాయవాది వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ...పథకం నిలిపివేసినట్టు ఎవరు చెప్పారని ఏజీపీని ప్రశ్నించింది. అధికారులు ఇచ్చిన సమాచారాన్నే తాను కోర్టు ముందుంచానని ఏజీపీ బదులిచ్చారు. అయితే ఆ వివరాలను అఫిడవిట్‌ రూపంలో కోర్టు ముందు వుంచాలని ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అలంకార ప్రాయంగా మైనారిటీ కార్పొరేషన్‌

విశాఖ వన్‌టౌన్‌లోని షాదీఖానాలో ఏపీ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఉంది. ముస్లింలకు సబ్సిడీ కింద రుణాలు అందజేసేందుకు ఈ కార్యాలయం ఏర్పాటుచేశారు. ఇదే కార్యాలయంలో క్రిస్టియన్‌ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫీస్‌ కూడా ఉంది. ఈ రెండు కార్యాలయాలకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, క్లర్క్‌, ఫీల్డు అసిస్టెంటు, అటెండరు ఉన్నారు. తెలుగుదేశం హయాంలో 50 శాతం సబ్సిడీతో ముస్లిం కుటుంబాలకు రూ.2 కోట్లు మేర రుణాలుగా అందించారు. కుటుంబానికి రూ.రెండు లక్షలు రుణం మంజూరుచేస్తే ప్రభుత్వం రూ.లక్ష ఇస్తుంది. రూ.80 వేలు బ్యాంకు రుణంగా, లబ్ధిదారుడు రూ.20 వేలు చెల్లించేలా అప్పట్లో పథకాన్ని అమలుచేశారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత కార్పొరేషన్‌ నుంచి రుణాల కోసం విశాఖ నుంచి రమారమి మూడు వేల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏమైందోగానీ వెబ్‌సైట్‌ మూసివేయడంతో రుణాలు ఊసేలేదు. ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసే మొబైల్‌ వాహనాల నిమిత్తం 28 మందికి రూ.162.73 లక్షలు విడుదల చేశారు. ఆ తరువాత సబ్సిడీ రుణాల సంగతి ప్రభుత్వం మరిచిపోయింది. ఈ నేపథ్యంలో మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నామమాత్రంగానే మిగిలిపోయింది. కార్పొరేషన్‌ ఈడీ భాస్కరరావును కలెక్టరేట్‌లో అల్ప సంఖ్యాకుల సంక్షేమ కార్యాలయం అఽధికారి బాధ్యతలు అప్పగించారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.