Abn logo
Sep 26 2021 @ 00:19AM

రెండోరోజూ.. సీన రిపీట్‌!

ఎంపీపీ ఎన్నికల ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌ఓ కె. రామ్‌ప్రసన్న

దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక బంతి ఎలక్షన్‌ కమిషన్‌ కోర్టులో

రెండో ప్రత్యేక సమావేం కూడా కోరం లేక వాయిదా

ఇక ఎన్నికల సంఘం ఇచ్చిన తేదీనే చివరి అవకాశం

సాయంత్రం వరకు ఎమ్మెల్యే ఆర్కే దుగ్గిరాలలోనే ...

తెనాలి(ఆంధ్రజ్యోతి), దుగ్గిరాల, సెప్టెంబర్‌ 25: దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక బంతి ఎన్నికల సంఘం కోర్టుకు చేరింది. శనివారం జరిగిన రెండో ప్రత్యేక సమావేశం కూడా కోరం లేక వాయిదా పడటంతో చివరి అవకాశాన్ని ఇకపై ఎన్నికల సంఘం ఇవ్వనుంది. దుగ్గిరాల మండల పరిషత్‌ పరిధిలో 18 ఎంపీటీసీ స్థానాలుంటే, వాటిలో తొమ్మిదిటిని తెలుగుదేశం, ఎనిమిది వైసీపీ, ఒక స్థానాన్ని జనసేన అభ్యర్థులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. 

రెండు సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరైనా కోరం సరిపోలేదు. తెలుగుదేశం సభ్యులకు పూర్తి మద్దతు ఉన్నా, సమావేశానికి మాత్రం హాజరు కాలేదు. వీరి సభ్యుల్లో ఒక మహిళ మాత్రమే బీసీ జాబితాలో ఉండటంతో ఆమెకు కులధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా అధికారపార్టీ కుట్రలు పన్నుతోందని తెలుగుదేశం ఆరోపిస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శనివారం కూడా ఉదయ్యానే వచ్చి సాయంత్రం 4 గంటల వరకు కదలకుండా అక్కడే వేచిఉన్నారు. చివరకు సమావేశం వాయిదా పడిందన్న విషయాన్ని ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ రాంప్రసన్న వెల్లడించాక అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


రోజుకో కొత్త నాటకం... 


దుగ్గిరాలలో తెలుగుదేశం సభ్యులకు పూర్తి మెజారిటీ అవకాశం, మద్దతు ఉన్నా, వారికి అవకాశం దక్కనివ్వకుండా అధికార పార్టీ అడ్డు పడుతోంది. నిన్నటివరకు ఎంపీటీసీ సభ్యురాలికి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా పావులు కదిపిన నేతలు ఇప్పుడు కొత్తదారులు వెతికే పనిలో ఉన్నారు. బీ-ఫారం విషయంలో కొత్త నిబంధనలు వల్లెవేసిన నేతలు, అధికారులు ఇప్పుడు అదికూడా పనిచేయదని తెలుసుకుని తమపై బేరసారాల కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దుగ్గిరాల-2 ఎంపీటీసీ సభ్యురాలు పద్మావతిని వైసీపీ వదిలి తెలుగుదేశంలో చేరితే ఎంపీపీ పదవి, డబ్బు అందుతుందంటూ ఓ వ్యక్తి ఆమె కుమారుడితో ఫోన్‌లో మంతనాలు నడిపినట్టు ఒక ఆడియోను బయటపెట్టి దీని వెనుక తెలుగుదేశం నేతలను ఇరికించేందుకు కుట్ర మొదలుపెట్టారని వారు చెబుతున్నారు. అయితే ఈ అంశంపై కేసు పెట్టిన ఆమె కుమారుడు యోగేందర్‌కు బేరమాడినట్టు ఆరోపిస్తున్న వ్యక్తి ఉమామమేశ్వరరావు స్వయానా బంధువే కావటం, అంతా ఒకే కుటుంబం అయినా ఫోన్‌లో సంభాషించినట్టు ఆడియో తీసుకురావటం, నేరుగా కలసి నచ్చచెప్పే అవకాశం ఉన్నా, బయటి వ్యక్తిలాగా ఫోన్‌ సంభాషణ చేయటం వెనుక అనేక అనుమానాలు కలిగించక మానవు. ఫోన్‌లో ఉమామహేశ్వరరావే పదేపదే మాట్లాడటం, అతని మనవడు మాత్రం అవసరం అనుకున్నచోట, అదికూడా వెంటనే బదులివ్వకుండా, పక్కనుంచి ఎవరో చెప్పిస్తున్న తరహాలో పట్టిపట్టి మాట్లాడటంకూడా దీని వెనుక కుట్ర దాగిఉందనే అనుమానాన్ని స్పష్టంగానే వెల్లడిస్తుండటం విశేషం. మరోపక్క ఉమామహేశ్వరరావుకు పార్టీతో సంబందాలు లేవని, పార్టీలో ఏ క్రియాశీలక బాధ్యతలులేని వ్యక్తితో మాట్లాడించి, అతని ద్వారానే తమ ఎంపీటీసీ సభ్యుల్లో ఎవరో ఒకరిని ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు.  శుక్రవారం రాత్రి సమయంలో మాట్లాడినట్లు, మాట్లాడిన వెంటనే కేసు పెడుతున్నట్టు చెప్పుకొచ్చిన నాయకులు చిన్న లాజిక్‌ మర్చిపోయారని, రాత్రి సమయంలో ఎవరికీ కనిపించకుండా చాటుగానయినా మాట్లాడి ఒప్పించే అవకాశం ఉన్నా, ఫోన్‌లోనే ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో! దానిని ముందస్తు పతకం ప్రకారం రికార్డు చెయ్యటం వెనుక ఆంతర్యం ఏమిటనేది జనానికి అర్ధమవుతుందని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇటువంటి చౌకబారు కుట్రలకు దిగితే ఎవరూ ఉపేక్షించరని పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు వెంకట్రావు విమర్శించారు. 


 ఆ ధీమా వెనుక?


పూర్తి మెజారిటీ కాదుకదా! కనీసం కోరం అయ్యేందుకు సరిపడా సభ్యులను కూడా గెలుచుకోలేని అధికార పార్టీ దుగ్గిరాల పీఠం తమదేనంటూ రాగం పాడటం వెనుక ఆంతర్యం మాత్రం అంతుబట్టని విషయమే. ఎంపీపీ పీఠం తమదేనని శనివారం సమావేశం వాయిదా పడిన తర్వాత కూడా ఎమ్మెల్యే ఆళ్ల ధీమా వ్యక్తం చేశారు. అయితే తెలుగుదేశం నాయకులు మాత్రం దీనిపై మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నామని చెబుతున్న అధికార పార్టీ తమ ఎంపీటీసీ కుల ధ్రువీకరణ పత్రాన్ని ఎందుకు ఇవ్వనివ్వకుండా ఆపుతున్నారని, గతంలో ఆమె కుటుంబ సభ్యులకు బీసీ ధ్రువపత్రాన్ని ఇచ్చిన ఇదే తహసీల్దారు ఈమెకు ఇవ్వకపోవటం కేవలం అడ్డదారులు తొక్కటానికి నిదర్శనమే అవుతుందని ఆరోపిస్తున్నారు. ధ్రువీకరణ పత్రం రాకుండా చెయ్యాలని, ఒకవేళ వచ్చినా తెలుగేశాన్ని గద్దెనెక్కనివ్వకుండా అడ్డుకునేందుకు మరిన్ని కుట్రలకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు. పూర్తి మద్దతు ఉన్నా మేము దాక్కుంటున్నామనే తరహాలో హేళన మాటలు ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని, మమ్ముల్ని రెచ్చగొట్టి, మేము బయటకు వస్తే వెంటనే ఎత్తుకెళ్లే కుట్రతో ఉన్నారనే అనుమానాలు కూడా మాకున్నాయని, మూడో సమావేశానికి మమ్ముల్ని రానివ్వకుండా అడ్డుకుంటే వారే ఉన్న సభ్యులతో అధికారాన్ని అడ్డగోలుగా దక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని వారంటున్నారు. అయితే ఎన్నికల సంఘం తేదీ ఖరారు చేశాక తమకు పూర్తి భద్రత ఇస్తే సమావేశానికి రావటానికి సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ రేపటి సమావేశానికి కూడా మమ్ముల్ని రానివ్వలేదంటే వారు అడ్డుకున్నారనే విషయం జనం గ్రహించాలని, ఇప్పటికైనా కుట్రలు, అడ్డదారులు మాని, ప్రజాస్వామ్య పద్ధతిలో పదవిని దక్కించుకోవాలంటూ తెలుగుదేశం తరఫునన గెలిచిన 9 మంది ఎంపీటీసీలు అధికార పార్టీ నేతలకు హితవు పలికారు.  

 ఎంపీపీ ఎన్నిక రెండో రోజు వాయిదా

పెదకూరపాడు, సెప్టెంబరు 25: పెదకూరపాడు ఎంపీపీ ఎన్నిక రెండవ రోజు కూడా వాయిదా పడినట్టు మండల ఎన్నికల అధికారి వై.సుధాకరరావు శనివారం తెలిపారు. రెండు రోజులు ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ ఎన్నికకు గైర్హాజరవ్వటంతో ఎన్నికల కమిషనకు తెలియపరిచామని, ఎన్నికల కమిషన తదుపరి తేదీని ప్రకటించిన తరువాత ఎంపీపీ ఎన్నికకు నోటీసు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.