దుగ్గిరాలలో బందోబస్తుకు వచ్చిన పోలీసులు
ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ!
దుగ్గిరాలలో రాజకీయ కాక
టీడీపీ అభ్యర్థికి ఇంకా ఇవ్వని కుల ధ్రువీకరణ పత్రం
కోరం హాజరుపైనే పావులు
భారీగా పోలీసుల మోహరింపు
మంగళగిరి: దుగ్గిరాల మండల రాజకీయం కాక పుట్టిస్తోంది. ఎంపీపీ పదవిని వశం చేసుకోవడాన్ని టీడీపీ, వైసీసీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. మెజారిటీ సభ్యులను కలిగిఉన్న తమకు ఎంపీపీ పదవి దక్కడం ప్రజాస్వామ్యయుతమే కదా! అని టీడీపీ వాదిస్తుండగా.. ఎలాగైనా సరే ఆ పదవిని తామే చేజిక్కించుకుంటామని వైసీపీ పట్టుదలకు పోతోంది. దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక శుక్రవారం జరుగనున్న నేపథ్యంలో ముందురోజు గురువారం ఇక్కడ పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేయడం అనుమానాలకు తావిస్తోంది.
దుగ్గిరాల మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో తొమ్మిది స్థానాలను టీడీపీ, వివాదాస్పదమైన పెదకొండూరుతో కలిపి వైసీపీ ఎనిమిది స్థానాలను గెలుచుకున్నాయి. జనసేన ఒక్క స్థానంలో గెలుపొంది టీడీపీకి మద్దతు ప్రకటించింది. పెదకొండూరు ఎన్నికపై జనసేన గురువారం కోర్టును కూడా ఆశ్రయించింది. వాస్తవానికి పోలింగ్‌కు ముందునుంచి ఉన్న పొత్తులో భాగంగానే టీడీపీ పెదకొండూరు, ఈమని-1 స్థానాలలో జనసేన అభ్యర్థులకు మద్దతునిచ్చింది. ఈ నేపథ్యంలో జనసేన అధికారికంగా గెలిచిన ఒక్కస్థానం (ఈమని-1) సభ్యురాలు టీడీపీకి బహిరంగంగానే మద్ధతును ప్రకటించింది. అయినప్పటికీ వైసీపీ ఎంపీపీ పదవికోసం పోరాడుతోంది. వైసీపీ భావిస్తున్నట్టుగా ఎంపీపీ స్థానం వారికి దక్కాలంటే టీడీపీ -జనసేన కూటమి పదిమందిలో కనీసం ఇద్దరు అనైతికంగా ఆపార్టీకి మద్దతునివ్వాల్సి వుంటుంది. ఎలాగైనా సరే! ఆ ఇద్దరి మద్దతును కూడగట్టుగలుగుతామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భరోసాగా వున్నారు.
రెండంచెల వ్యూహం
ఎంపీపీ పదవిని తమ ఖాతాలో వేసుకునేందుకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎంపీపీ స్థానం బీసీ మహిళలకు రిజర్వు అయింది. టీడీపీ -జనసేన కూటమి పదిమంది సభ్యులలో చిలువూరు-1 నుంచి గెలుపొందిన టీడీపీ అభ్యర్థిని షేక్ జమీనా ఒక్కరే బీసీ మహిళ. సరిగ్గా ఈ పాయింట్‌ను క్యాచ్ చేసిన వైసీపీ తన అధికార బలాన్ని ఇక్కడ వినియోగించుకుంటోంది. జమీనాకు బీసీ కుల ధ్రువీకరణపత్రం సకాలంలో మంజూరు కాకుండా తహసీల్దారుపై ఒత్తిడి తెస్తూ గేమ్ ఆడిస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ఫలితం రాకపోయింది. శుక్రవారం ఉదయానికి కులధ్రువీకరణ పత్రం రాకుంటే జమీనాకు ఎంపీపీ స్థానానికి పోటీచేసే అవకాశం దూరమవుతుంది. వైసీపీకి చింతలపూడి ఎంపీటీసీ సభ్యురాలు దానబోయిన సంతోషరూపవాణి బీసీ కోటాలో సిద్ధంగా ఉంది.
కోరం హాజరవుతుందా..?
18 మంది సభ్యులు వున్న దుగ్గిరాల మండల పరిషత్‌లో యాభైశాతం మంది సభ్యులు హాజరైతే కోరం సరిపోతుందని అంటున్నారు. అంటే తొమ్మిదిమంది హాజరై వుండాలి. వైసీపీకి ఎనిమిది మంది మాత్రమే వున్నారు. ఈ పరిస్థితుల్లో జమీనాకు కుల ధ్రువీకరణ పత్రం మంజూరుకాకుంటే కోరం లేకుండా చూసుకోవల్సిన బాధ్యత టీడీపీ-జనసేన కూటమిపై వుంది. అలాంటప్పుడు పదిమంది సభ్యులు ఎన్నికకు గైర్హాజరు కావాలి. ఒకవేళ ఎమ్మెల్యే ఆళ్ల మంత్రాంగం ఫలించి టీడీపీ -జనసేన కూటమినుంచి కనీసం ఒక్కరైనా సమావేశానికి హాజరైతే కోరం సరిపోతుంది. అప్పుడు వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎంపీపీ అయ్యే అవకాశం వుంటుంది.
టీడీపీ తమ సభ్యులకు విప్ జారీ చేసినప్పటికీ.. తమ కూటమినుంచి ఏ ఒక్కరైనా ఎన్నిక తాలూకు సమావేశానికి హాజరైతే ఎమ్మెల్యే ఆళ్ల ఎత్తుగడ పారినట్టే. దీన్ని ఎదుర్కోవాలంటే... తమ అభ్యర్థి జమీనాకు సంబంధిత కులధ్రువీకరణ పత్రం మంజూరయ్యేంత వరకు తమ కూటమి సభ్యులు ఎవరూ సమావేశాలకు హాజరుకాకుండా చూచుకోవాలి. తమ సభ్యులు ప్రలోభాలకు గురికాకుండా కట్టుదిట్టం చేసుకోవాలి. ఇదిలా ఉంటే.. దుగ్గిరాల మండలం చిలువూరు ఎంపీటీసీ షేక్ జబీన్‌కు తక్షణమే కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలంటూ గురువారం టీడీపీ నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
భారీగా పోలీసులు మోహరింపు
దుగ్గిరాలలో ఎటువైపు చూసినా పోలీసులతో అష్టదిగ్బంధనం చేసినట్లుగా కనిపిస్తోంది. గురువారం ఉదయాన్నే పెద్దఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. 144వ సెక్షన్ అమలులో ఉంటుందని మైకు ద్వారా ప్రచారం నిర్వహించారు. తెనాలి డీఎస్పీ స్రవంతిరాయ్, దిశ డీఎస్పీ రవిచంద్ర, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ కమలాకరరావు, 100 మందికి పైగా స్పెషల్‌పార్టీ పోలీసులు, పదిమంది ఎస్ఐలు, డివిజన్లోని సీఐలు మొత్తం 150 మంది వరకూ బందోబస్తు నిర్వహిస్తున్నారు.