నష్టాలతోనే విజయ డెయిరీ మూసివేత

ABN , First Publish Date - 2020-12-06T05:16:58+05:30 IST

విజయ డెయిరీ మూతపడడంపై సీఎం జగన్‌ విమర్శలు తగవని ఎమ్మెల్సీ దొరబాబు పేర్కొన్నారు.

నష్టాలతోనే విజయ డెయిరీ మూసివేత
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దొరబాబు

ఎమ్మెల్సీ దొరబాబు 


చిత్తూరు సిటీ, డిసెంబరు 5: విజయ డెయిరీ మూతకు నష్టాలే కారణమని ఎమ్మెల్సీ దొరబాబు స్పష్టం చేశారు. శనివారం స్థానిక జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... విజయ డెయిరీ మూతపడడం వెనుక తాను కారణమని సీఎం జగన్‌ ఆరోపించడం సబబుకాదనీ, ఆయన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 1988లో జిల్లా మిల్క్‌సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికై, విజయ డెయిరీ పాల సేకరణ కేంద్రాలను మూడు నుంచి 70కి పెంచినట్లు చెప్పారు. దేశంలోనే 110 మహిళా కో-ఆపరేటివ్‌ సొసైటీలను ఏర్పాటు చేసిన ఘనత తమదే అన్నారు. ప్రైవేట్‌ డెయిరీల పోటీ నుంచి తట్టుకోలేకే విజయ డెయిరీ నష్టాల్లో పడిందనీ, రూ.10 కోట్ల నిధులుంటే పునఃప్రారంభించవచ్చని పేర్కొన్నారు. తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు మనోహర్‌ నాయుడు మాట్లాడుతూ 2003లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి డెయిరీని పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చినా నెరవేర్చలేదన్నారు. సీఎం జగన్‌ పాదయాత్ర సందర్భంగా విజయ డెయిరీ, గాజులమండ్యం, చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీలను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు అమూల్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం దారుణమని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కఠారి ప్రవీణ్‌, షణ్ముగం, సుబ్రి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-06T05:16:58+05:30 IST