ఏపీకి రైల్వేజోన్‌ హుష్‌!

ABN , First Publish Date - 2021-02-24T07:09:06+05:30 IST

రాష్ట్రానికి రైల్వే జోన్‌, తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్‌ ఏర్పాటు ఇప్పట్లో లేనట్టేనని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా పేర్కొన్నారు.

ఏపీకి రైల్వేజోన్‌ హుష్‌!
చంద్రగిరి రైల్వేస్టేషన్‌ అధికారులతో మాట్లాడుతున్న గజానన్‌ మాల్యా

తిరుపతి(ఆటోనగర్‌), ఫిబ్రవరి 23: ‘రాష్ట్రానికి రైల్వే జోన్‌తోపాటు తిరుపతి బాలాజీ డివిజన్‌ ఏర్పాటుకు ఆర్థిక భారంతో ముడిపడి ఉంది. అందువల్ల ఇప్పట్లో ఇవి మంజూరయ్యే అవకాశం లేదు’ అని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (జీఎం) గజానన్‌ మాల్యా పేర్కొన్నారు. గుంతకల్లు డివిజన్‌లో వార్షిక పర్యటనలో భాగంగా మంగళవారం చంద్రగిరి రైల్వేస్టేషన్‌ను సందర్శించార. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్‌ ప్రాజెక్టు (ఎనర్జీ న్యూట్రల్‌ స్టేషన్‌)ను ప్రారంభించారు. ప్రయాణికులకు కల్పించిన మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో ఆయన్ను కలిసిన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా గూడూరు-బొమ్మసముద్రం సెక్షన్‌లో పర్యటించడానికి కొంత జాప్యమేర్పడిందని చెప్పారు. ఈ సెక్షన్‌లో రైలు మార్గాల సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. అలాగే అండర్‌బ్రిడ్జి నిర్మాణాలు, ఎలక్ర్టానిక్‌, ఎలక్ర్టికల్‌ సిస్టమ్‌ ద్వారా జరుగుతున్న రైళ్ల నిర్వహణను గమనించానన్నారు. ఖర్చులు తగ్గించుకోవడం, ఆదాయాలు పెంచుకోవడం పైనే రైల్వేబోర్డు దృష్టి సారించిందని వెల్లడించారు. కాగా.. చంద్రగిరి స్టేషన్‌లో మాత్రమే మహిళా ఉద్యోగులతో రైళ్ల రాకపోకలు నిర్వహిస్తున్నామన్నారు. గూడూరు-వెంకటగిరి మధ్య ఉన్న పలు రైల్వేబ్రిడ్జిల నాణ్యత ప్రమాణాలు, రైలు మార్గాల పటిష్ఠతను పరిశీలించామన్నారు. జీఎంతోపాటు గుంతకల్లు డివిజన్‌ మేనేజర్‌ అలోక్‌తివారి, ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషన్‌ జీఎం ఈశ్వర్‌రావు, ఏడీఆర్‌ఎం సూర్యనారాయణ, సీనియర్‌ డీసీఎం ప్రశాంత్‌కుమార్‌, తిరుపతి స్టేషన్‌ డైరెక్టర్‌ నారాయణశర్మ, చంద్రగిరి స్టేషన్‌ మేనేజర్‌ ఉషారాణి, నాగిరెడ్డి, రామ్మోహన్‌లతోపాటు జోనల్‌, డివిజన్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-24T07:09:06+05:30 IST