విధులెట్టా చేసేదయ్యా

ABN , First Publish Date - 2021-05-06T06:11:18+05:30 IST

కర్ఫ్యూ నిబంధనలు శ్రీకాళహస్తి, ఏర్పేడు మండల ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు తిప్పలు తెస్తున్నాయి.

విధులెట్టా చేసేదయ్యా

ఏర్పేడు, మే 5: కర్ఫ్యూ నిబంధనలు ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు తిప్పలు తెస్తున్నాయి. ఏర్పేడు సమీపంలో స్పాంజ్‌ ఐరన్‌, శ్రీకాళహస్తి పైప్స్‌తోపాటు పాగాలి, వికృతమాల వద్ద పలు కర్మాగారాలున్నాయి. ఏర్పేడు, శ్రీకాళహస్తి, వెంకటగిరి, తిరుపతి, రేణిగుంట, పుత్తూరు తదితరప్రాంతాలకు చెందిన కార్మికులు వీటిలో పనిచేస్తున్నారు. బుధవారం నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమలవడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత విధులకు వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇప్పటికే బస్సులు అంతంతమాత్రంగా తిరగడంతో ద్విచక్రవాహనాల్లో వెళుతూ అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఆయా కంపెనీల యాజమాన్యాలు కార్మికుల రాకపోకలకు సంబంధించి జిల్లా పోలీసు అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నాయి. దీంతో కర్ఫ్యూ నిబంధనల పేరిట పోలీసులు అడ్డుకుని జరిమానాలు విధించడంపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పైప్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు కె.అమరనాథ్‌ మాట్లాడుతూ.. తమ సంస్థలో పనిచేస్తున్న 16 వందల మంది కార్మికులు ద్విచక్రవాహనాల్లో విధులకు వస్తున్నట్లు చెప్పారు. అనంతరం స్వగ్రామాలకు వెళ్తున్న కార్మికులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. కొవిడ్‌ సమయంలో సజావుగా కార్మికులు విధులకు హాజరయ్యేలా సహకరించాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి జిల్లా పోలీసు యంత్రాంగం ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.

Updated Date - 2021-05-06T06:11:18+05:30 IST