బాదుడు పక్కా

ABN , First Publish Date - 2022-01-29T05:43:06+05:30 IST

మహబూబ్‌నగర్‌ పట్టణ ప్రధాన రహదారి వెంట గజం మార్కెట్‌ విలువ రూ.13 వేలు ఉంది. ప్రస్తుతం అక్కడ 200 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే రూ.1.95 లక్షల ఫీజు చెల్లించాలి.

బాదుడు పక్కా
మహబూబ్‌నగర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద రద్దీ

మహబూబ్‌నగర్‌, జనవరి 28: మహబూబ్‌నగర్‌ పట్టణ ప్రధాన రహదారి వెంట గజం మార్కెట్‌ విలువ రూ.13 వేలు ఉంది. ప్రస్తుతం అక్కడ 200 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే రూ.1.95 లక్షల ఫీజు చెల్లించాలి. ఇప్పుడు 35 శాతం మార్కెట్‌ విలువ పెరిగడంతో గజం మార్కెట్‌ విలువ రూ.17,600కు చేరింది. దీనికి రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.2.65 లక్షలు అవుతుంది. అంటే రూ.70 వేలు అదనపు భారం పడుతుంది.. అదే జడ్చర్ల ప్రధాన రహదారి వెంట ఇదివరకు గజం విలువ 9000 ఉండగా 200 గజాల స్థలం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే రూ.1.35 లక్షలు అయ్యేది. ఇప్పుడు గజం విలువ రూ.12500కు పెరిగింది. ఈ లెక్కన రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే రూ.1,87,500 అవుతుంది అంటే రూ.52,500 అదనపు భారం పడుతుంది. 

అనుకున్నట్లే అయ్యింది..

భూముల మార్కెట్‌ విలువ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఈ ధరలు ఫిబ్రవరి 1 నుంచే అమలులోకి రానున్నాయి. ఇప్పటికే  అధికారులు కొత్త ధరలను నిర్ణయించారు. దీనివల్ల రిజిస్ట్రేషన్‌ రూపంలో ప్రభుత్వానికి 40 శాతం ఆదాయం పెరగనుంది. వ్యవసాయ భూములకు 50 శాతం, ఓపెన్‌ప్లాట్లకు 35 శాతం, అపార్ట్‌మెంట్‌లకు 25శాతం మార్కెట్‌ విలువను పెంచారు. కొద్దిరోజులుగా భూముల విలువలు పెంచుతున్నారన్న సమాచారంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద భారీగా రద్దీ పెరిగింది. శుక్రవారం ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయడంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు, తహిసీల్దార్‌ కార్యాలయాలకు జనం క్యూకట్టారు. శనివారం, సోమవారం మరో రెండ్రోజుల గడువు మాత్రమే ఉండటంతో మరింత భారీగా రిజిస్ట్రేషన్‌లు పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. 

 పెరుగనున్న ధరలు  

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న కాలనీలు న్యూటౌన్‌, సుభాష్‌నగర్‌, గడియారం చౌరస్తా, మెట్టుగడ్డ, పాల్సబ్‌గుట్టలో ప్రస్తుతం గజం రూ.13 వేలు ఉండగా ఇప్పుడు రూ.17600కు పెరిగింది. లక్ష్మీనగర్‌ కాలనీ, వెంకటేశ్వరకాలనీలో రూ.8 వేలు ఉండగా రూ.10800కు పెరిగింది. పద్మావతికాలనీ, షాషాబ్‌గుట్టలో రూ.7 వేలు ఉండగా రూ.9500కు పెరిగింది. శ్రీనివాసకాలనీలో రూ.3 వేల నుంచి రూ.4100, భగీరథకాలనీ, బాలాజీనగర్‌, మైత్రినగర్‌ కాలనీ, ఎంవీఎస్‌ కళాశాల పరిధిలో రూ.1500 నుంచి రూ.2100కు పెరిగింది. అదే జడ్చర్లలో రూ.800 గజం ఉన్న చోటరూ.1100కు, రూ.9000 ఉన్నచోట రూ.12500కు పెరిగింది.

  వ్యవసాయ భూముల ధరలు ఇలా..

జిల్లాలో వ్యవసాయ భూముల విలువలు 50 శాతం పెరిగాయి. బాలానగర్‌లో ఎకరం రూ.8.40 లక్షలు ఉన్నచోట రూ.12.60 లక్షలకు, భూత్పూర్‌లో రూ.4.50 ఉన్నచోట రూ.7.88 లక్షలు, రూ.11.20 లక్షలు ఉన్నచోట రూ.19.60 లక్షలు, సీసీకుంటలో రూ1.50లక్షల నుంచి రూ.2.25 లక్షలు, రూ. 4.50 లక్షల నుంచి రూ.6.75 లక్షలకు, జడ్చర్లలో రూ.1.50 లక్షల నుంచి రూ.2.25 లక్షలు, రూ.3 లక్షల నుంచి రూ.4.50 లక్షలు, రూ.94.38 లక్షల నుంచి రూ.1.65 కోట్లు పెరిగింది. మిడ్జిల్‌లో రూ.1.50 లక్షల నుంచి 2.25 లక్షలు, రూ.3 లక్షల నుంచి రూ.5.28 లక్షలు, మూసాపేటలో రూ.1.50 లక్షల నుంచి రూ.2.25 లక్షలు, రూ.6 లక్షల నుంచి రూ.10.50 లక్షలు, రాజాపూర్‌లో రూ.రూ.1.50 లక్షలనుంచి రూ.2.63 లక్షలు, రూ.27.15 లక్షలనుంచి రూ.47.43 లక్షలకు, రూ.40.60 లక్షలనుంచి రూ.60.99 లక్షలకు పెరిగింది. మహబూబ్‌నగర్‌ అర్బన్‌లో రూ.3 ల క్షల నుంచి రూ.4.50 లక్షలు, రూ.3.14 కోట్ల నుంచి రూ.4.60 కోట్లు, రూరల్‌లో రూ.2.25 నుంచి రూ3.50 లక్షలు, రూ.33.80 లక్షల నుంచి రూ.50 లక్షలు, దేవరకద్రలో రూ1.50 లక్షల నుంచి రూ.2.25 లక్షలు, రూ96.80 లక్షల నుంచి రూ.1.60 కోట్లు, మహ్మదాబాద్‌లో రూ.1.50 లక్షల నుంచి రూ.2.25 లక్షలు, రూ.16.94 లక్షల నుంచి రూ.25 లక్షలు, గండీడ్‌లో రూ.1.50 లక్షల నుంచి రూ.2.25 లక్షలు, నవాబ్‌పేటలో రూ.1.25 లక్షల నుంచి రూ.1.90 ల క్షలు, రూ.20.33 లక్షల నుంచి రూ.30.15 లక్షలు, కోయిలకొండలో రూ. 1.50 లక్షల నుంచి రూ.2.25 లక్షలు, రూ.33 వేల నుంచి రూ.3.15 లక్షలు, హన్వాడలో రూ. 1.25 లక్షల నుంచి రూ.1.90 లక్షలు, రూ.13.55 లక్షలనుంచి రూ.20.15 లక్షలకు మార్కెట్‌ విలువలు పెరిగాయి.

 


Updated Date - 2022-01-29T05:43:06+05:30 IST