‘డబుల్‌’ నిరాశ !

ABN , First Publish Date - 2020-11-29T05:02:30+05:30 IST

పేద, మధ్యతరగతి వర్గాలు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్‌బెడ్‌రూం పథకం ఖమ్మం జిల్లాలో నత్తనడకన సాగుతోంది.

‘డబుల్‌’ నిరాశ !
చింతకాని మండలం లచ్చగూడెంలో పిల్లర్ల దశలో నిలిపోయిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం

నత్తనడకన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం 

వివిధ దశల్లో నిలిచిపోయిన అనేక ఇళ్లు

నిధుల కొరతతో ముందుకు సాగని పనులు

ఆశావహులు లక్షల్లో.. మంజూరైన ఇళ్లు వేలల్లో

ఖమ్మం, నవంబరు 28(ప్రతినిధి): పేద, మధ్యతరగతి వర్గాలు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్‌బెడ్‌రూం పథకం ఖమ్మం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఐదేళ్లుగా అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో లబ్ధిదారులకు సొంతింటి కల కలగానే మిగులుతోంది. జిల్లాలో పేద, మధ్యతరగతి ఇల్లులేనివారు అధిక సంఖ్యలో ఉన్నా తక్కువ సంఖ్యలోనే ఇళ్ల  నిర్మాణం జరుగుతోంది. అవి కూడా సకాలంలో పూర్తిచేయలేకపోతున్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరిస్థలంలో వారికే సొంత ఇల్లు మంజూరుచేయగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం చేపట్టింది. జిల్లాలో ఇళ్లులేని పేద కుటుంబాలు లక్షకు పైగా ఉన్నా అందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు 14,555 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 8,685 ఇళ్లకు పరిపాలనా మంజూరు లభించింది. మరో 5,870ఇళ్లకు మంజూరు రావాల్సి ఉంది. టెండర్లు పూర్తయిన ఇళ్లు జిల్లాలో పలు దశల్లో ఉన్నాయి. ఇప్పటికే 3,170 ఇళ్లు నిర్మాణం పూర్తిచేసుకోగా 2,392 ఇళ్లను లబ్దిదారులకు అప్పగించారు. నిర్మాణం పూర్తయిన మరో 1,350ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. కొన్ని ఇళ్ల  పనులు ప్రారంభం కాలేదు. మరికొన్ని ఇళ్లు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 


నిధుల కొరతతో ముందుకు సాగని పనులు


జిల్లాలో డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల పథకానికి నిధుల కొరత అధికంగా ఉంది. జిల్లాలో రూ.28కోట్ల వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే రూ.13.30కోట్లు పెండింగ్‌లో ఉండగా మరో రూ.15కోట్లకు ప్రతిపాదనలు వెళ్లాయి. నిధులు లేకపోవడంంతో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను ముందుకు సాగించలేకపోతున్నారు. నిధుల కొరతతో మరికొంతమంది నాసీరకంగా ఇళ్లు నిర్మిస్తున్నారు. నాణ్యతలేని ఫ్లయాష్‌ ఇటుకులు ఉపయోగించడం, సిమెంట్‌ తక్కువగా కలపడంతో లోపబూయిష్టంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ డబుల్‌ ఇళ్ల నిర్మాణం నత్తనడకనే సాగుతోంది. కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌ ఉండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షించలేక పోతున్నారు. పట్టణాల్లో రూ.6లక్షలు, గ్రామాల్లో రూ.5.80లక్షలు ఒక్కో ఇంటికి మంజూరుచేస్తున్నారు. కొన్నిచోట్ల ఇళ్లు నిర్మించి ప్రారంభించినా లబ్దిదారులు ఉండకుండా వారి బంధువులకు అప్పగించారు. మరికొన్ని అనధికారికంగా విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో డబుల్‌ ఇళ్ల డిమాండ్‌ భారీగా ఉన్నప్పటికీ ఆశించిన మేర ఈ పథకం ముందుకు సాగడం లేదు. ప్రతి మండలంలోనూ శంకుస్థాపనలు చేసి పునాదులతో ఆగిపోయిన డబుల్‌ ఇళ్లు కనిపిస్తున్నాయి. చింతకాని మండలంలచ్చగూడెంలో శంకుస్థాపన జరిగి రెండేళ్లయినా పనులు పునాదులనుంచి కదల్లేదు. కొన్ని పిల్లర్ల దశలో నిలిచిపోగా మరికొన్ని స్లాబు వేసి వదిలేశారు. దీంతో కొన్ని చోట్ల డబుల్‌ ఇళ్లను పశువుల కొట్టాలకు వినియోగిస్తున్నారు. ఖమ్మంతో పాటు మధిర, సత్తుపల్లి, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో అన్నిచోట్ల డబుల్‌బెడ్‌ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వం నిధులు కేటాయించి ఎక్కువ సంఖ్యలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించి సకాలంలో అందిస్తేనే పేదవారికి సొంతింటి కల నెరవేరే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Updated Date - 2020-11-29T05:02:30+05:30 IST