హరీష్ రావు ఎంట్రీ... సీన్ మారేనా..?

ABN , First Publish Date - 2020-09-20T16:14:42+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపు గుర్రాలను బరిలోకి దింపి పాగావేసేందుకు ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి.

హరీష్ రావు ఎంట్రీ... సీన్ మారేనా..?

దుబ్బాక ఉప ఎన్నికను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపు గుర్రాలను బరిలోకి దింపి పాగావేసేందుకు ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు గులాబీ దళపతి వ్యూహరచన చేస్తున్నారు. దుబ్బాక టీఆర్‌ఎస్‌లో ఎగసిపడుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు టీఆర్‌ఎస్‌ చీఫ్‌ మరో ట్రబుల్‌ షూటర్‌ను రంగంలోకి దింపారు. మంత్రి హరీశ్‌రావు ఎంట్రీతో దుబ్బాకలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


దుబ్బాకలో ఉపఎన్నిక రాజకీయం వేడెక్కుతోంది. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. గులాబీ బాస్, సీఎం కేసీఆర్.. దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపు బాధ్యతలను ట్రబుల్‌ షూటర్ హరీశ్‌రావుకు అప్పగించడంతో ఇప్పడు అందరి దృష్టి ఆయనపై పడింది. సొంత పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో దుబ్బాకలో మంత్రి హరీశ్‌రావు ఎలాంటి వ్యూహాన్ని అమలుచేయబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.


ఆమే అయితే ఓకే..

వాస్తవానికి దుబ్బాక ఉప ఎన్నిక మాట ఎత్తినప్పటి నుంచి నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు అధికార టీఆర్‌ఎస్ పార్టీని కలవరపెట్టాయి. అప్పటివరకు రామలింగారెడ్డి నాయకత్వంలో పనిచేసిన మండలస్థాయి నాయకులు ఎక్కడికక్కడ ధిక్కార స్వరం వినిపించారు. సోలిపేట కుటుంబానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. ప్రధానంగా రామలింగారెడ్డి కుమారుడు సతీష్‌రెడ్డికి టిక్కెట్ ఇవ్వొద్దని నినదించారు. మంత్రి హరీశ్‌రావుతోపాటు మరికొందరు పార్టీ పెద్దలు అసంతృప్తులతో చర్చించి వారిని బుజ్జగించినట్లు తెలుస్తోంది.  దాంతో రామలింగారెడ్డి భార్య సుజాత అభ్యర్థి అయితే నాయకులంతా కలిసి పనిచేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు పార్టీ నేతలు ఇంటర్నల్‌గా నిర్వహించిన సర్వేలో సతీష్‌రెడ్డికి వ్యతిరేకత ఉన్నట్లు తెలుసుకున్నారట. అందుకే రామలింగారెడ్డి భార్యకు టిక్కెట్‌ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.


ఈసారి తనకే ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని...

జర్నలిస్టుగా పనిచేసిన రామలింగారెడ్డి 2004, 2008లో దొమ్మాట నుంచి, 2009, 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాక నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. 2009 మినహా అన్ని ఎన్నికల్లోనూ రామలింగారెడ్డి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ముత్యంరెడ్డితోపాటు ఆయన కుమారుడు శ్రీనివాసరెడ్డి, మరో సీనియర్ నేత మామిడి మోహన్ రెడ్డి దుబ్బాక టిక్కెట్ ఆశించారు. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డికే పార్టీ హైకమాండ్ టిక్కెట్ ఇవ్వడంతో ఆయన గెలిచారు. ఇప్పుడు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి తనకు టిక్కెట్‌ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ దఫా సోలిపేట రామలింగారెడ్డి భార్యకే టిక్కెట్టు ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకత్వం దాదాపు నిర్ణయించింది. ముత్యం రెడ్డి తనయుడికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. శ్రీనివాస్‌రెడ్డితోపాటు అసంతృప్త నాయకులతో మంత్రి హరీష్‌రావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సొంత పార్టీ నాయకులు కావడంతో వారికి రాబోయే రోజుల్లో తగిన అవకాశాలు కల్పిస్తామని మంత్రి వారిని బుజ్జగిస్తున్నారు. రామలింగారెడ్డి భార్య సుజాత విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.


ఏ మేరకు సక్సెస్ అవుతారో..

మంత్రి హరీశ్ రావు ఎంట్రీతో దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు సులభమేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. హరీష్‌రావు నియోజకవర్గం సిద్దిపేట, దుబ్బాక పక్కపక్కనే ఉంటాయి. దుబ్బాకపై హరీష్‌కు మంచిపట్టు ఉంది. గ్రామాల వారీగా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన ఆయన.. దుబ్బాకలో వరుస పర్యటనలతో నియోజకవర్గ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. మండలాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలను ఇంచార్జ్‌లుగా నియమించారు. గ్రామాలవారీగా వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, కౌన్సిలర్లను ఇంచార్జ్‌లుగా నియమించి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కేసీఆర్ ఆశించినట్లుగా లక్ష మెజారిటీ లక్ష్యంగా మంత్రి హరీశ్ రావు వ్యూహరచన చేస్తున్నారు. మరి ట్రబుల్‌ షూటర్‌ తనకు అప్పగించిన టాస్క్‌లో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Updated Date - 2020-09-20T16:14:42+05:30 IST