దుబ్బాక పిలుస్తున్నది, వింటున్నరా?!

ABN , First Publish Date - 2020-11-19T06:05:51+05:30 IST

దుబ్బాక నియోజకవర్గం మల్లన్నసాగర్ లో గత ఆరేండ్లుగా యుద్ధవాతావరణం ఉన్నది. అన్యాయమైన భూసేకరణను అడ్డుకున్న మల్లన్నసాగర్ ముంపు...

దుబ్బాక పిలుస్తున్నది, వింటున్నరా?!

దుబ్బాక నియోజకవర్గం మల్లన్నసాగర్ లో గత ఆరేండ్లుగా యుద్ధవాతావరణం ఉన్నది. అన్యాయమైన భూసేకరణను అడ్డుకున్న మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాల ఉద్యమకారులను వెంటబడి వేటాడి మరీ నోరు మూయించిన్రు. ఆ ప్రాంత పోలీస్ అధికారి ఒకరు ఉద్యమకారుడి తలకు గురిపెట్టి బెదిరించడానికీ, ‘మీ మీడియాకు ఇక్కడ ఏమి పనయ్యా’ అంటూ ఒక మంత్రి తరిమేయడానికీ వెనుక ఉన్న దన్ను కేసీఆర్. ఇపుడు దుబ్బాక ప్రజలు కసిదీరా ఆయన పార్టీని ఓడిస్తే దోషం ఎవరిది? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలూ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు దుబ్బాక ప్రజలు స్పష్టమైన అజెండా సెట్ చేసిన్రు. అది తెలంగాణ విముక్తి! బీజేపీకి ఓటు వేసిన ప్రజలు, తగిన ప్రత్యామ్నాయం కనబడితే తెరాసను పారదోలడానికి సిద్ధం అని విస్పష్టంగా ప్రకటించిన్రు.


‘వాండరింగ్ బిట్వీన్ టూ వరల్డ్స్

ఒన్ డెడ్

అండ్ ది అదర్ పవర్ లెస్ టు బి బార్న్’

–అంటారు పంతొమ్మిదో శతాబ్దపు బ్రిటిష్ కవి మాథ్యూ ఆర్నాల్డ్. 

‘రెండు ప్రపంచాల నడుమ పరిభ్రమణం 

ఒకటి అస్తమించినది 

ఇంకొకటి ఉదయించే శక్తి లేనిది’

– అంటూ తెనిగించిండు సౌదా!


నేడు తెలంగాణ సామాజిక, రాజకీయ ముఖచిత్రం సరిగ్గా అట్లనే ఉన్నది. ఆలోచనాపరుల రెండు ప్రపంచాల పరిభ్రమణంలా! ప్రశ్న అంటేనే తెలంగాణ. చైతన్యం అంటేనే తెలంగాణ. ధిక్కారం అంటేనే తెలంగాణ – ఈ భావాలన్నీ మృతప్రాయమైన గతంలా మిగిలిపోవడానికి ఎంతో సమయం పట్టదు అనే భయంలో ఉండింది తెలంగాణ మొన్నటివరకూ. 


దేశంలో దరిదాపు ఏ ఇతర రాష్ట్రంతోనూ పోలిక లేని దశాబ్దాల రాజకీయ చైతన్యం, ఎక్కడా కానరాని సుదీర్ఘ పోరాట చరిత్ర తెలంగాణ సొంతం. తీవ్రవాద, సాయుధపోరాటవాద, వామపక్షవాద, అభ్యుదయవాద, అస్తిత్వవాద, బహుజనవాద, పోస్ట్ మోడర్న్, సబాల్టర్న్... ఇట్లా ప్రతీ వాదాన్నీ, వాటిలోని ప్రజాస్వామిక ఆకాంక్షలనూ అందిపుచ్చుకుని సాగింది ప్రగతిశీల తెలంగాణ. ఇవే కాదు, పీర్ల పండుగలపుడు దర్గాల దగ్గరా, వినాయకచవితపుడు మండపాల దగ్గరా హిందూ ముస్లింలు కలిసి వేడుక చేసుకునే సహజీవన కాంక్ష తెలంగాణకు వన్నె. ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు అని దేవుడిని సైతం నిలదీయడం భద్రాద్రి గోపన్న అందించిన తెలంగాణ వారసత్వం! ఇట్లా, కుడీ ఎడమా పిల్లకాలువలూ, సెలయేళ్ళ ప్రేమను ఆహ్వానిస్తూ, తాను పారే మేరమేరంతా సారవంతం చేస్తూ సాగే నదిలాంటి తెలంగాణ నేడు ఒక సంధి దశలో ఉన్నది. నీరసించిన వామపక్ష ఉద్యమాలు, ఆదరణ కోల్పోయిన మధ్యేవాద రాజకీయాలు, దేశమంతా కమ్ముకున్న మతోద్వేగ రాజకీయమబ్బులు సృష్టించే గందరగోళం... నేడు తెలంగాణను ఆవరించి ఉన్నాయి. ఆరేండ్ల కిందనే కదా సకల జనులూ, సకల పార్టీలూ, సకల భావజాలాలు కలిసి కొట్లాడి ఒకే గొంతుకతో నినదించి తెలంగాణ సాధించుకున్నది? అంతలోనే యెంత పతనం?! దీనికి ప్రధాన కారణం కేసీఆర్!


తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ది ముఖ్యమైన భూమిక. కానీ... తెలంగాణ ఒచ్చినంక, ఉద్యమ ఆకాంక్షలను అణగదొక్కడంలో ఆయన పాత్ర అనన్యసామాన్యం. నాటి నినాదాలకు, ఆశలకు, ఆశయాలకు తూట్లు పొడవడంతోనే ఆగలేదు ఆయన. ప్రజలకు ఎలాంటి వేదికా లేకుండా చేసిన్రు. కాంగ్రెస్ ను చావుదెబ్బ కొట్టిన్రు. ఇతర విపక్షాలను వేధిస్తూనే ఉన్నారు. ప్రజాసంస్థలను, సంఘాలను, మీడియాను, వ్యక్తులను, వ్యవస్థలనూ ఎవరినీ ఒదిలిపెట్టలేదు. ఒకరకంగా witch-hunt చేసిన్రు. ఎవరు ఒక్క చిన్నపాటి నిరసన తెలిపినా, హక్కును కోరినా సహించలేదు. ధర్నాచౌక్ ను సహితం మూసివేసిన్రు. ఏ సమైక్య పాలకుడూ చేయ సాహసించని చర్యలవి. ప్రజాస్వామిక, ప్రగతిశీల ఆకాంక్షల వ్యక్తీకరణకు వేదిక లేని, చోటులేని పరిస్థితిలో బీజేపీ చొచ్చుకువచ్చింది. దీనికి పూర్తి బాధ్యతా, మూల్యమూ కేసీఆర్ దే. కానీ, ఆయనకే కాదు కదా జరిగే నష్టం? తెలంగాణ ఉనికే ప్రశ్నార్థకం అయ్యే సందర్భంలో అందరమూ మూల్యాంకనం చేసుకోవాల్సిందే.


ఆ సందర్భం దుబ్బాక కల్పించింది. అది కొత్త ప్రశ్నలూ సమాధానాలూ రేకెత్తిస్తున్నది. రేపు బాగుంటుందేమో అనిపిస్తున్నది. ఎన్నికల సమరాంగణ సార్వభౌముడిలా ఎప్పుడూ అప్రతిహత విజయాలు అందుకునే కేసీఆర్ పార్టీ దుబ్బాకలో ఎందుకు దెబ్బతిన్నదో అవలోకనం చేయవలసి ఉన్నది. దుబ్బాక నియోజకవర్గం మల్లన్నసాగర్‍లో గత ఆరేండ్లుగా యుద్ధవాతావరణం ఉన్నది. అన్యాయమైన భూసేకరణను అడ్డుకున్న మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాల ఉద్యమకారులను వెంటబడి వేటాడి మరీ నోరు మూయించిన్రు. ఆ ప్రాంత పోలీస్ అధికారి ఒకరు ఉద్యమకారుడి తలకు గురిపెట్టి బెదిరించడానికీ, ‘మీ మీడియాకు ఇక్కడ ఏమి పనయ్యా’ అంటూ ఒక మంత్రి తరిమేయడానికీ వెనుక ఉన్న దన్ను కేసీఆర్. ఇపుడు దుబ్బాక ప్రజలు కసిదీరా ఆయన పార్టీని ఓడిస్తే దోషం ఎవరిది? ప్రెషర్ కుకర్ కు సేఫ్టీ వాల్వ్ లేకుండా చేసిన కేసీఆర్ తనకు తెలిసో తెలియకో తెలంగాణకు ఓ సందేశమైతే ఇస్తున్నరు. ఇన్నాళ్ళ సందేహాలనైతే పటాపంచలు చేస్తున్నరు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలూ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు దుబ్బాక ప్రజలు స్పష్టమైన అజెండా సెట్ చేసిన్రు. అది తెలంగాణ విముక్తి! బీజేపీకి ఓటు వేసిన ప్రజలు, తగిన ప్రత్యామ్నాయం కనబడితే తెరాసను పారదోలడానికి సిద్ధం అని విస్పష్టంగా ప్రకటించిన్రు.


నిజానికి, మల్లన్నసాగర్ లో బీద రైతులను కేసీఆర్–బీజేపీ కలిసి ముంచివేసినాయి. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టం 2013తో అత్యంత గొప్ప పునరావాసానికి పూచీపడింది. దానికి తూట్లు పొడిచి 2016 సవరణ కేసీఆర్ తీసుకువస్తే, మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా దానికి ఆమోదముద్ర వేసింది. కానీ దుబ్బాక ఓటర్లు కండ్ల ముందు కనిపించే శత్రువు భరతం పట్టాలి అనుకున్నారు. అందులోనూ అవకాశం ఉన్నచోట వారు మరింత స్పష్టంగా ఓటు వేసిన్రు. ఉదాహరణకు 12వ రౌండ్ కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థికి మెజారిటీ యిచ్చినవి మల్లన్నసాగర్ ముంపు గ్రామాలే. వారు తెరాస-, బీజేపీ ఇద్దరినీ నమ్మలేదు. ఏమాటకామాట... నిర్వాసితుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ముందుండి కొట్లాడింది. కానీ వరుస తప్పులతో, అంతర్గత కీచులాటలతో కుదేలయిపోయింది.


రాష్ట్రమంతా నిరుద్యోగ యువకులూ, పట్టభద్రులూ, ప్రభుత్వ/ ప్రైవేట్ టీచర్లూ ప్రభుత్వంపై తీవ్ర నిరసనతో ఉన్నారు. కొవిడ్ నియంత్రణలో సంపూర్ణ వైఫల్యం, బతుకుదెరువు కోల్పోయినవారిని గాలికి ఒదిలేసిన వైనం, నియంత్రిత సాగు అనే పనికిమాలిన విధానంతో వ్యవసాయ రంగాన్ని నిలువునా ముంచడం, ఎల్.ఆర్.ఎస్. పేరిట నయా దోపిడీ ప్రజలకు ఎంత ఆగ్రహం కలిగించినాయి అంటే, ఎన్నికల్లో ప్రభుత్వం అధికారికంగానూ, అనధికారికంగానూ పంచిన తాయిలాలు వారిని ఏమాత్రమూ తమవైపు తిప్పుకోలేకపోయాయి. రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లోనూ, గ్రేటర్ ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితం పునరావృతం అవుతదేమోననే ఆందోళన అధికార శిబిరంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. అందుకే ఇపుడు ఆర్టీసీపై ప్రేమ, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే యజమానులపై ఆప్యాయత ఒలకబోస్తూ కొంతైనా నష్టనివారణ చేద్దాం అనుకుంటున్నారు. హైదరాబాద్ వరదలు గోరుచుట్టుపై రోకటి పోటు! వరద సాయం పేరుతో కోట్లాది రూపాయల గోల్ మాల్ పై నగర ఎమ్మెల్యేలు, కార్పోరేటర్ల ఇండ్లను ప్రజలు ముట్టడించడం అధికారపార్టీకి ఎప్పుడూ లేని అనుభవం. దీని తీవ్రత యెంత ఉందంటే, మజ్లిస్ ఎమ్మెల్యేలను సైతం ప్రజలు నిలదీస్తున్నరు – ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా అంటూ ముస్లింలు ఓ మజ్లిస్ ఎమ్మెల్యేను నిలదీయడం తెరాస-, మజ్లిస్కు బుర్రతిరిగిపోయేంత చెంపపెట్టు! 


ఈ పరిస్థితికి కేసీఆర్ పూర్తిగా బాధ్యత పడకతప్పదు. తన పాలనా వైఖరిని ఆయన ఇపుడు తప్పక సమీక్షించుకోవాలి. పైకి ఒప్పుకోకపోయినా, తీవ్ర స్వవిమర్శ చేసుకోవాలి. అట్లా అని కాంగ్రెస్ కానీ, వామపక్షాలు కానీ ఈ దోషాలనుంచి తప్పించుకోజాలవు. ఇతర విపక్షాలను సహించని కాంగ్రెస్ ఒంటెత్తుపోకడలు, పలు కారణాల వల్ల లెఫ్ట్ నీరసించడం, తమ వ్యక్తిగత సమస్యలు, పార్టీల సమస్యలు తీర్చుకోవడానికి కేసీఆర్ తో అంటకాగడమూ వారి పట్ల ప్రజలలో విశ్వాసం లేకుండా చేసినాయి. కాబట్టి... కాంగ్రెస్ కానీ, ఇతర విపక్షాలు కానీ, బీజేపీ–-కేసీఆర్‍లను నిందించి ఊకుంటే మాత్రం లాభం లేదు. ప్రత్యామ్నాయం యెట్లా సాధ్యమో ఆలోచించాలి. 


నేర్వదలచుకుంటే పాఠాలు తెలంగాణ ఉద్యమంలోనూ ఉన్నవి. ఉద్యమ కాలంలో అప్పటికే బలమైన, ఆర్థికంగా సంపన్నమైన పార్టీలను, వర్గాలను ఎదిరించి నిలిచే ధైర్యం తెలంగాణకు ఎక్కడినుంచి వచ్చింది? వనరుల లేమి తెరాస పుట్టిన 2001లోనూ ఉన్నది కదా? మీడియా సహా అన్ని వ్యవస్థల సహాయ నిరాకరణా ఉన్నది కదా? అయినప్పటికీ, బలమైన ప్రజా ఉద్యమ నిర్మాణం ద్వారానే కదా తెలంగాణ కల సాకారమయింది! మరి ఇపుడు ఎందుకు సాధ్యం కాదు, ఆ కలలపంట తెలంగాణను నిలుపుకోవడం? చర్చ జరగాలి!


మరొక లోతైన విషయం ఉన్నది. ఎన్నికల రాజకీయాలకు వెలుపల కూడా ఈ చర్చ జరగాలి. ఎన్నికల చైతన్యం – ఎన్నికల తర్వాత చైతన్యం అంటూ విడివిడిగా చూడగలగాలి. రకరకాల సెంటిమెంట్లు మాత్రమే ఎన్నికలూ, వాటి ఫలితాలూ అయినపుడు, అదే అసలు సమస్య అయినపుడు, పరిష్కారం అక్కడే వెతికితే ప్రయోజనం స్వల్పమే! నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు జరిగిన తప్పుల్ని మరచిపోయి, ఒక్క ఎన్నికల సమయపు ఉద్వేగాల ప్రాతిపదికనే ప్రభుత్వాలు ఏర్పడితే, ప్రజాప్రయోజనానికి చోటెక్కడ? 


అయితే, ఎవరో బూచిని చూపి, కేసీఆర్ ను క్షమించెయ్యాలనే వాదనా సరి కాదు. 1200 మంది అమరుల స్ఫూర్తికి తూట్లు పొడిచినందుకు, ప్రతి గ్రామంలో 30కి తగ్గకుండా ఉన్న నిరుద్యోగుల కండ్లలో చీకట్లకు, అప్పుల కత్తి అంచున తెలంగాణను నిలబెట్టి భారీ అవినీతి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినందుకు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు, కొవిడ్ వల్ల బతుకుదెరువు కోల్పోయిన పేదలను ఆదుకోక సెక్రటేరియట్ విలాసాలకు ఉన్న కాస్త నిధుల్ని ఖర్చు చేయ పూనుకున్నందుకు, ప్రతిపక్షాలు సహా అన్ని గొంతులనూ నొక్కేసి, చివరకు ప్రగతి భవన్‌కు కూడా ప్రజాగ్రహం చేరనంతగా ఫెన్సింగులు పేర్చుకున్నందుకు కేసీఆర్ చరిత్రలో దోషిగా మిగులుతారు, తప్పదు. ఇవన్నీ మౌనంగా భరిస్తున్న, ఆయన చుట్టూ ఉన్న ఒకప్పటి తెలంగాణ వాదులను కూడా ఈ ప్రశ్నలు వెంటాడుతునే ఉంటాయి, అదీ తప్పదు.


తెలంగాణ మేధావులు, బుద్ధిజీవులు, యువకులకు ఒక సవినయ విజ్ఞప్తి. అస్తమిస్తున్న గత వైభవాన్ని పునరుద్ధరించుకుందాం. తమలో తాము కలహించుకుంటూ, చీలికలూ పేలికలూ అవుతున్న రాజకీయ పక్షాలకు కొంత కొత్త ఊపిరి పోద్దాం. Politics is mobilisation in support of a cause. దుబ్బాక మన ముందుకు తెచ్చిన కాజ్ అదే! అంబేడ్కర్ చెప్పిన educate, organise, agitate మార్గమే ఇపుడు శరణ్యం. అట్లా మాత్రమే ప్రజలు కేంద్రంగా రాజకీయాలు సాధ్యం. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వనరులను అందరి క్షేమానికి ఉపయోగించడమే నేడు మనం చేయాల్సిన రాజకీయం. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన సమిష్టి పోరాటం ఇపుడు మరోసారి జరగాలి, తెలంగాణను రక్షించుకునేందుకు. నాటి జేయేసీ లాంటి మరొక వేదిక అవసరం నేడు ఎంతైనా ఉన్నది! క్యాన్సర్ అనే రోగానికి ప్రత్యామ్నాయంగా మరో రోగాన్ని యెట్లా కోరుకోమో, నివారణ కోరుకుంటామో, ఇపుడు తెలంగాణ సమస్యలకు పరిష్కారం కావాలి, ఒక రోగం నుంచి మరో రోగం వైపు నడక కాదు! 


కొసమెరుపు: ఎన్నికలు, ఫలితాల భాష మాత్రమే పాలకులకు అర్థమయ్యే చోట దుబ్బాక చిన్నదే అయినా ఒక పాఠం అయితే నేర్పింది. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలూ, కార్పొరేషన్ ఎన్నికలలో కూడా కీలెరిగి వాత పెట్టగలరు ప్రజలు అనే భయమయితే దుబ్బాక సప్లై చేసింది. ఇపుడు సరిచేసుకుంటారా, లేక తమను తాము బలిచేసుకుంటారా అనేది ఎవరెవరి ఇష్టం! ముఖ్యంగా చెట్టుకొకరూ పుట్టకొకరూగా ఉన్న రాజకీయపార్టీల ఇష్టం! ప్రజాక్షేత్రం తప్ప మిమ్ముల రక్షించగలవారెవరూ లేరు!!

ఇపుడు మాథ్యూ ఆర్నాల్డ్‌ను తిరగరాద్దాం... 

‘లెట్స్ నాట్ వాండర్ బిట్వీన్ టూ వరల్డ్స్

వి విల్ లెట్ ది పవర్ ఫుల్ బి బార్న్’

‘రెండు ప్రపంచాల నడుమ పరిభ్రమణం అక్కర్లేదు 

శక్తిమంతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం’

అది మన చేతుల్లో పని, మన చేతల్లో పని!

శ్రీశైల్ రెడ్డి పంజుగుల

ఛైర్మన్, ప్రొఫెసర్ జయశంకర్ 

మానవ వనరుల అభివృద్ధి కేంద్రం

Updated Date - 2020-11-19T06:05:51+05:30 IST