కార్మికుల ఆరోగ్య భ‌ద్ర‌త కోసం.. దుబాయ్ పోలీసుల‌ అవ‌గాహ‌న కేంద్రాలు

ABN , First Publish Date - 2020-04-10T17:58:08+05:30 IST

క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో దుబాయ్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ఆంక్ష‌లు విధించింది.

కార్మికుల ఆరోగ్య భ‌ద్ర‌త కోసం.. దుబాయ్ పోలీసుల‌ అవ‌గాహ‌న కేంద్రాలు

దుబాయ్‌: క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో దుబాయ్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ఆంక్ష‌లు విధించింది. దేశ ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త కోసం ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు చేయ‌ప‌డుతోంది. తాజాగా కార్మికుల ఆరోగ్య భ‌ద్ర‌త కోసం దుబాయ్ పోలీస్ అవ‌గాహ‌న చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసింది. కార్మిక శిబిరాల ద‌గ్గ‌ర ప్ర‌త్యేకంగా అవ‌గాహ‌న కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తోంది. ప‌ని చేసే చోట ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో కార్మికుల‌కు వివ‌రిస్తున్న‌ట్లు దుబాయ్ పోలీస్ చీఫ్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ అబ్దుల్లా ఖ‌లీఫా అల్ మెర్రీ వెల్ల‌డించారు.


వైర‌స్ బారిన ప‌డ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌టంలో భాగంగా కార్మిక సంఘాలు, సంబంధిత అధికారుల‌తోనూ చ‌ర్చించామ‌ని, కార్మికుల‌కు అవ‌స‌ర‌మైన మాస్క్‌లు, శానిటైజ‌ర్ల స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు వివ‌రించారు. కార్మికుల‌ను త‌ర‌లించే బ‌స్సుల‌ను కూడా ప‌రిశీలించి సామాజిక దూరాన్ని పాటించేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు దుబాయ్‌లో చేప‌ట్టిన స్టెరిలైజేష‌న్ కార్య‌క్ర‌మం స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌ను పాటించ‌కుండా రోడ్ల‌పైకి వ‌చ్చే వారిపై నిఘా పెట్టామ‌ని దుబాయ్ పోలీస్ బాస్‌ తెలియ‌జేశారు.


అలాగే నిబంధ‌న‌లు పాటించ‌ని వారిని గుర్తించేందుకు ఆర్టిఫిషియ‌ల్ ఇంటలిజెన్స్(ఏఐ)‌, రాడార్ వంటి టెక్నాల‌జీని ఉప‌యోగిస్తున్నామ‌ని చెప్పారు. క‌నుక ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం కావ‌డంతో పాటు వ్య‌క్తిగ‌త శుభ్ర‌త, సామాజిక దూరం పాటించాల‌ని సూచించారు. లేనిప‌క్షంలో క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

Updated Date - 2020-04-10T17:58:08+05:30 IST