Dubai: ఎలివేటర్‌లో ఓ బ్యాగ్.. దాని నిండా నగదు.. అది చూసిన భారత ప్రవాసుడు ఏం చేశాడంటే..!

ABN , First Publish Date - 2022-06-07T16:48:37+05:30 IST

భారత ప్రవాసుడు చేసిన పనికి దుబాయ్ పోలీసులు ప్రశంసించారు. ఒకటికాదు, రెండుకాదు ఏకంగా 1మిలియన్ దిర్హమ్స్(రూ.2.11కోట్లు) నగదుతో ఉన్న బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు మనోడు.

Dubai: ఎలివేటర్‌లో ఓ బ్యాగ్.. దాని నిండా నగదు.. అది చూసిన భారత ప్రవాసుడు ఏం చేశాడంటే..!

దుబాయ్: భారత ప్రవాసుడు చేసిన పనికి దుబాయ్ పోలీసులు ప్రశంసించారు. ఒకటికాదు, రెండుకాదు ఏకంగా 1మిలియన్ దిర్హమ్స్(రూ.2.11కోట్లు) నగదుతో ఉన్న బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు మనోడు. దాంతో భారత వ్యక్తి నిజాయితీని మెచ్చుకుని దుబాయ్ పోలీస్ అధికారులు ప్రత్యేక ప్రశంస పత్రం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. అల్ బార్షా ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌లో తారిఖ్ మహమూద్ ఖలీద్ మహమూద్ అనే భారత ప్రవాసుడు నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం బిల్డింగ్‌కి సంబంధించిన ఎలివేటర్‌లో తారిఖ్‌కు ఓ బ్యాగ్ కనిపించింది. తెరిచిచూస్తే దాని నిండా నగదు ఉంది. దాంతో వెంటనే అల్ బార్షా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. అయితే, భారత వ్యక్తి బ్యాగ్ తీసుకెళ్లి ఇవ్వడానికి కొన్ని గంటల ముందు అదే పీఎస్‌లో ఓ అరబ్ వ్యక్తి రూ.2.11కోట్ల నగదుతో ఉన్న తన బ్యాగ్ ఒకటి పోయినట్లు ఫిర్యాదు చేశాడు. అది కూడా అప్పుగా తీసుకున్న సొమ్ముగా అతడు పేర్కొన్నాడు. 


ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే తారిఖ్ ఓ బ్యాగ్ తీసుకెళ్లి ఇచ్చాడు. తాను నివాసముండే బిల్డింగ్ ఎలివేటర్‌లో అది దొరికినట్లు తెలిపాడు. దాంతో వెంటనే పోలీసులు అంతకుముందు తమకు బ్యాగ్ మిస్సింగ్ విషయమై ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఫోన్ చేశారు. ఆ వ్యక్తి వెంటనే అల్ బార్షా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆ బ్యాగ్ తనదేనని కన్‌ఫార్మ్ చేశాడు. అంతేగాక అందులో రూ.2.11కోట్లు ఉన్నట్లు తెలిపాడు. దాంతో పోలీసులు వెంటనే ఆ బ్యాగ్‌లో ఉన్న నగదును లెక్కించారు. అతను చెప్పినట్టుగానే అవి సరిగ్గా రూ. 2.11కోట్లుగా లెక్క తేలింది. పోలీసులు ఆ బ్యాగ్‌ను అరబ్ వ్యక్తి అప్పగించారు. అనంతరం నిజాయితీ చాటిన భారత ప్రవాసుడికి ప్రత్యేక ప్రశంస పత్రం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అల్ బార్షా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్ రహీమ్ బిన్ షఫీ మాట్లాడుతూ తారిఖ్ మహమూద్‌పై ప్రశంసలు కురిపించారు. భారత ప్రవాసుడు చేసిన పనికి మెచ్చుకున్నారు. దుబాయ్‌లో ఉన్న ప్రవాసులందరూ గర్వంగా చెప్పుకునే పని చేశాడంటూ ప్రశంసించారు.    

Updated Date - 2022-06-07T16:48:37+05:30 IST