దుబాయ్ ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ఔదార్యం..!

ABN , First Publish Date - 2020-08-09T17:08:41+05:30 IST

దుబాయ్‌లోని ఓ ఆస్ప‌త్రి యాజమాన్యం ఔదార్యం చాటింది. ఓ భారతీయురాలి క్యాన్స‌ర్‌ చికిత్సకు అయిన రూ. 20.41ల‌క్ష‌ల బిల్లును మాఫీ చేసింది.

దుబాయ్ ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ఔదార్యం..!

భార‌త మ‌హిళ‌కు రూ. 20.41ల‌క్ష‌ల బిల్లు మాఫీ

దుబాయ్‌: దుబాయ్‌లోని ఓ ఆస్ప‌త్రి యాజమాన్యం ఔదార్యం చాటింది. ఓ భారతీయురాలి క్యాన్స‌ర్‌ చికిత్సకు అయిన రూ. 20.41ల‌క్ష‌ల బిల్లును మాఫీ చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే... దీపా వసందాని క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న త‌న త‌ల్లి వీణ వాస్వానీని చికిత్స కోసం విజిట్ వీసాపై ఇండియా నుంచి షార్జాకు ర‌ప్పించింది. అప్ప‌టికే స్వ‌దేశంలో ఉన్న ఇళ్లు అమ్మేసి త‌ల్లిని ఢిల్లీ ఆస్ప‌త్రిలో చికిత్స చేయించింది. కానీ, ఆమెకు న‌యం కాలేదు. దాంతో వేరే మార్గంలేక షార్జాకు తీసుకువ‌చ్చింది. ఇక్క‌డ భ‌ర్త మెయింట‌నెన్స్ జాబ్ చేస్తూ నెల‌కు రూ. 85వేలు సంపాదిస్తే... అందులో 40వేల వ‌ర‌కు ఇంటి రెంట్‌కే వెళ్లిపోయేది. దాంతో దీపా కూడా స్థానికంగా టైల‌ర్ అండ్‌ లాండ్రీ షాపు న‌డిపిస్తూ భ‌ర్త‌కు చేదొడుగా నిలుస్తూ వ‌స్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో త‌ల్లికి చికిత్స చేయించ‌డం ఆమెకు త‌ల‌కు మించిన భారంగా మారింది. అయినా వెన‌కాడుగు వేయ‌కుండా గ‌త రెండేళ్లుగా చికిత్స చేయిస్తూ వ‌స్తోంది. 


ఇక‌ దీపా ప‌రిస్థితి గురించి తెలిసి ఆస్ప‌త్రిలోని చాలా మంది సిబ్బంది ఆమెకు మెడిసిన్స్ కొనుగోలు చేయ‌డానికి సాయం చేశారు. ఇలా ఇత‌రుల స‌హాయంతో నెట్టుకొస్తున్న‌ క్ర‌మంలో క‌రోనా నేప‌థ్యంలో ఆమెకు ఆర్థిక క‌ష్టాలు ఇంకా ఎక్కువ అయ్యాయి.  దాంతో త‌ల్లి చికిత్సకు అయిన ల‌క్ష దిర్హామ్స్‌(రూ. 20.41ల‌క్ష‌ల) చెల్లించ‌లేని పరిస్థితి ఏర్ప‌డింది. ఈ విష‌యం తెలుసుకున్న ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ఆమె వ‌ద్ద చిల్లిగ‌వ్వ కుడా తీసుకోకుండా డిశ్చార్జి చేసింది. త‌న ప‌రిస్థితి గురించి తెలుసుకుని మానవ‌దృక్పథంతో బిల్లు మాఫీ చేసిన‌ ఆస్ప‌త్రి యాజమాన్యానికి ఈ సంద‌ర్భంగా దీపా వసందాని ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలియ‌జేసింది. ఇదే త‌ర‌హాలో ఇటీవ‌ల తెలంగాణకు చెందిన ఓ వ్య‌క్తి క‌రోనా చికిత్స‌కు అయిన కోటిన్న‌ర బిల్లును దుబాయిలోని ర‌షీద్ ఆస్ప‌త్రి యాజ‌మాన్యం మాఫీ చేసి మాన‌వ‌త్వం చాటిన‌ విష‌యం తెలిసిందే.       ‌  

Updated Date - 2020-08-09T17:08:41+05:30 IST