భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు సడలించిన దుబాయ్

ABN , First Publish Date - 2021-06-21T12:04:17+05:30 IST

భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాలకు చెందిన ప్రవాసీయులకు దుబాయ్‌ అధికారులు ప్రయాణ ఆంక్షల్ని సడలించారు. పర్యాటక వీసాలకు మాత్రం ఇంకా అనుమతిని ఇవ్వలేదు. అయితే.. దుబాయ్‌కి వచ్చే ప్రయాణికులు కచ్చితంగా తాము అనుమతించిన కొవిడ్‌-19 టీకా తీసుకుని ఉండాలన్న షరతును అధికారులు

భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు సడలించిన దుబాయ్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి):

భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాలకు చెందిన ప్రవాసీయులకు దుబాయ్‌ అధికారులు ప్రయాణ ఆంక్షల్ని సడలించారు. పర్యాటక వీసాలకు మాత్రం ఇంకా అనుమతిని ఇవ్వలేదు. అయితే.. దుబాయ్‌కి వచ్చే ప్రయాణికులు కచ్చితంగా తాము అనుమతించిన కొవిడ్‌-19 టీకా తీసుకుని ఉండాలన్న షరతును అధికారులు విధించారు. ఈ వివరాలను ‘గల్ఫ్‌ న్యూస్‌’ పత్రిక తాజాగా వెల్లడించింది. దుబాయ్‌ విపత్తు నిర్వహణ సంస్థ అత్యున్నత కమిటీ తాజా నిబంధనల ప్రకారం.. నివాస వీసా ఉండి, యూఏఈ సర్కారు ఆమోదం ఉన్న టీకా రెండు డోసులనూ తీసుకుంటేనే దుబాయ్‌లో ప్రవేశాన్ని కల్పించనున్నారు. యూఏఈ ఇప్పటి వరకూ సైనోఫామ్‌, ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, స్ఫుత్నిక్‌-వి, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా(కొవిషీల్డ్‌) టీకాలను మాత్రమే ఆమోదించింది. ఇక.. భారత ప్రయాణికులు దుబాయ్‌కు వెళ్లే నాలుగు గంటల ముందుగా ర్యాపిడ్‌ పీసీఆర్‌ పరీక్షను, నగరంలో ప్రవేశానంతరం మరో పీసీఆర్‌ పరీక్షను చేయించుకోవాల్సి ఉంటుంది.




ప్రవేశానంతర పీసీఆర్‌ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వచ్చే వరకూ సుమారు 24 గంటల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. బుధవారం నుంచీ ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. భారత్‌లో కరోనా విజృంభణ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో తమ దేశానికి ప్రయాణ ఆంక్షలపై యూఏఈ ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. కాగా.. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ర్యాపిడ్‌ పరీక్షలు చేయించుకునే సౌలభ్యం ఉంది. ప్రయాణ ఆంక్షల కారణంగా, ప్రతి నిత్యం వందలాది మంది తెలుగు ప్రవాసీయులు మధ్య అసియాలోని సోవియట్‌ రిపబ్లిక్‌ దేశాలలో 14 రోజులు గడిపి.. అక్కడి నుంచి దుబాయ్‌కు వెళ్తున్నారు. దీంతో పలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రయాణ ఆంక్షల సడలింపుతో ఇప్పుడు వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

Updated Date - 2021-06-21T12:04:17+05:30 IST