రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారత ప్రవాసుడు.. పరిహారంగా రూ.6కోట్లు చెల్లించమన్న దుబాయ్ కోర్టు!

ABN , First Publish Date - 2021-08-01T18:12:59+05:30 IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారత ప్రవాసుడికి పరిహారంగా రూ.6.20కోట్లు చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీకి దుబాయ్ కోర్టు ఆదేశించింది.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారత ప్రవాసుడు.. పరిహారంగా రూ.6కోట్లు చెల్లించమన్న దుబాయ్ కోర్టు!

దుబాయ్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారత ప్రవాసుడికి పరిహారంగా రూ.6.20కోట్లు చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీకి దుబాయ్ కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రం అన్నామనదకు చెందిన సిజీష్ పనట్టు సుబ్రమణ్యం(41) దుబాయ్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో కారు డ్రైవర్‌గా పని చేశాడు. ఈ క్రమంలో గతేడాది మే 18న అల్ ఐన్ ఫకాలో అతడు డ్రైవ్ చేస్తున్న కారును మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సిజీష్ రషీద్ ఆస్పత్రిలో రెండు నెలలు చికిత్స పొందాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం స్వదేశానికి తిరిగొచ్చాడు. దాంతో కేరళలోని ఇండో-అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. 


ఈ క్రమంలో నోర్కా రూట్స్ లీగల్ అడ్వైజర్, దుబాయ్‌కి చెందిన న్యాయవాది ఫెమిన్ పనికస్సెరీ అక్కడి అబ్దుల్లా అల్ నక్బి అడ్వొకేట్స్, లీగల్ కన్సల్టేంట్స్ ద్వారా సిజీష్‌కు పరిహారం కోరుతూ కోర్టులో కేసు వేశారు. ఇన్సూరెన్స్ కంపెనీపై ఈ కేసు వేయడం జరిగింది. దాంతో సదరు కంపెనీ అబుధాబి కోర్టులో అప్పీల్ చేసుకుంది. కానీ, ఉన్నత న్యాయస్థానం కింది స్థాయి కోర్టు నిర్ణయాన్ని కొట్టివేసింది. సిజీష్‌ చికిత్స కోసం కావాల్సిన ఆర్థికసాయం చేయాలని కంపెనీని ఆదేశించింది. అలాగే పరిహారం రూపంలో 3.1 మిలియన్ దిర్హమ్స్(రూ.6.20కోట్లు) చెల్లించాలని తీర్పునిచ్చింది.   

Updated Date - 2021-08-01T18:12:59+05:30 IST