భార‌త యువ‌కుడికి.. భారీ పరిహారం ఇప్పించిన దుబాయ్ కోర్టు..

ABN , First Publish Date - 2020-04-07T19:14:59+05:30 IST

రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి వీల్ చైర్‌కే ప‌రిమిత‌మైన భార‌త యువ‌కుడికి... ప్రమాదానికి కార‌ణ‌మైన వారి నుంచి దుబాయ్ న్యాయ‌స్థానం భారీ ప‌రిహారం ఇప్పించింది.

భార‌త యువ‌కుడికి.. భారీ పరిహారం ఇప్పించిన దుబాయ్ కోర్టు..

దుబాయ్: రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి వీల్ చైర్‌కే ప‌రిమిత‌మైన భార‌త యువ‌కుడికి... ప్రమాదానికి కార‌ణ‌మైన వారి నుంచి దుబాయ్ న్యాయ‌స్థానం భారీ ప‌రిహారం ఇప్పించింది. ప్ర‌మాదం కార‌ణంగా కింద నుంచి లేచి న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న బాధితుడికి రూ. 4కోట్లు ఇవ్వాల‌ని తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే... కేర‌ళ రాష్ట్రం త్రిస్సూర్ వాసి ల‌తీఫ్ ఉమ్మ‌ర్ దుబాయ్‌లో గ‌తేడాది జ‌న‌వ‌రి 14న త‌న వాహ‌నంపై ఆఫీస్‌కు వెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌మాదానికి గుర‌య్యారు. వెనుక నుంచి వ‌చ్చిన‌ మ‌రో వాహ‌నం లతీఫ్ వాహ‌నాన్ని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ల‌తీఫ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో వెంట‌నే అత‌డిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. రెండు నెల‌ల పాటు దుబాయ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందిన ల‌తీఫ్ ఆ త‌ర్వాత స్వ‌దేశానికి వ‌చ్చేశాడు. భార‌త్‌కు వ‌చ్చిన త‌ర్వాత వెల్లూర్‌, తిరూర్ ఆస్ప‌త్రుల్లో అత‌డికి చికిత్స కొన‌సాగింది. కానీ ల‌తీఫ్ జీవితాంతం త‌న కాళ్ల‌పై నిల‌బ‌డ‌లేడ‌ని వైద్యులు తేల్చేశారు. వీల్‌చైర్‌కే ప‌రిమితం కావాల్సిందేనని చెప్పారు. 


అటు ఈ ఘ‌ట‌న‌పై దుబాయ్ కోర్టులో విచార‌ణ కొన‌సాగుతుండ‌గా.. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన డ్రైవ‌ర్ జ‌రిమానా చెల్లించి బ‌ట‌య‌కు వ‌చ్చేశాడు. ఈ విష‌యం తెలుసుకున్న ల‌తీఫ్‌... నోర్కా(ఎన్ఒఆర్‌కే) లీగ‌ల్ కన్స‌ల్టేంట్ అండ్ అడ్వొకేట్ డా. ఫెమిన్ ప‌నిక్క‌స్సేరి స‌హాయంతో వాహ‌న డ్రైవ‌ర్‌, య‌జ‌మాని, ఇన్సూరేన్స్ కంపెనీల‌పై దుబాయ్ కోర్టులో ఫిర్యాదు చేయించారు. దీంతో ఈ ఘ‌ట‌న‌పై నిజ‌నిజాలు తేలుసుకునేందుకు దుబాయి న్యాయ‌స్థానం ఓ వైద్యుడిని ల‌తీఫ్ చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రికి పంపించింది. ఇక్క‌డికి వ‌చ్చిన వైద్యుడు ల‌తీఫ్ ప‌రిస్థితి పరిశీలించి కోర్టుకు వివ‌రించారు. దాంతో న్యాయ‌స్థానం ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన డ్రైవ‌ర్‌, య‌జ‌మానితో పాటు ఇన్సూరేన్స్ కంపెనీ ల‌తీఫ్‌కు రూ. 4కోట్ల పరిహారం చెల్లించాల‌ని తీర్పునిచ్చింది. కాగా, ల‌తీఫ్‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు.    

Updated Date - 2020-04-07T19:14:59+05:30 IST