Advertisement
Advertisement
Abn logo
Advertisement

డీటాక్స్‌... జ్యూస్‌ క్లెన్స్‌... మంచివేనా?

ఆంధ్రజ్యోతి(23-07-2021)

ప్రశ్న: ఈ మధ్య డీటాక్స్‌... జ్యూస్‌ క్లెన్స్‌.. అనీ వింటున్నాను. వీటివల్ల ఉపయోగం ఉంటుందా? ఇలా బరువు తగ్గడం మంచిదేనా?


- రితిక, విజయనగరం


డాక్టర్ సమాధానం: మనం సాధారణంగా తినే ఆహారం కాకుండా ఒకటి నుండి మూడు రోజుల పాటు కేవలం పళ్ళు, కూరలను జ్యూస్‌ చేసి తీసుకోవడాన్నే డీటాక్స్‌, జ్యూస్‌ క్లెన్స్‌ అంటారు. ఇలా చేయడం వల్ల ఆ మూడు రోజుల్లో బరువు తగ్గినప్పటికీ, ఆ బరువు మళ్ళీ వెంటనే తిరిగి పెరుగుతారు. దీనికి కారణం, ఆ మూడు రోజులు అత్యంత తక్కువ కెలోరీలు తీసుకోవడం వల్ల మన శరీరంలోని గ్లైకోజెన్‌ అనే పదార్థం, దానితో పాటు శరీరంలో ఉన్న నీరు మాత్రమే తగ్గుతాయి తప్ప పెద్దగా కొవ్వు తగ్గదు. రెండు రోజుల తరువాత మామూలు ఆహారం తీసుకోగానే  గ్లైకోజెన్‌, నీరు తిరిగి వచ్చేస్తాయి. ఈ జ్యూస్‌ క్లెన్స్‌ పాటించేప్పుడు శరీరానికి ఆవసరమైన ప్రొటీన్లు కూడా అందవు. దీని వల్ల నీరసంగా అనిపించడం, ఎక్కువ ఆకలి వేయడం జరుగుతాయి. ఘనాహారం తీసుకోకుండా ఉండడం వల్ల జీర్ణాశయం పని తీరు సరిగా ఉండకపోవచ్చు. ఈ జ్యూస్‌లలో పీచుపదార్థాలు, శరీరానికి అవసరమైన ఆవశ్యక ఫాటీయాసిడ్లు ఉండవు. కాబట్టి ఎక్కువసార్లు జ్యూస్‌ తీసుకున్నప్పటికీ ఆకలిగానే అనిపిస్తుంది. ఇలా డీటాక్స్‌, జ్యూస్‌ క్లెన్స్‌ లాంటివి తాత్కాలికంగా బరువు సమస్యను తీర్చినట్టు అనిపించినప్పటికీ అవి మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను ఇవ్వవు కాబట్టి ఉపయోగం తక్కువ. బరువు సమస్యను అదుపులో ఉంచి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం మాత్రమే చక్కటి పరిష్కారం. మంచి మార్పులను మన జీవన విధానంలో భాగం చేసుకుంటే చాలు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutriful.com(పాఠకులు తమ సందేహాలను 

[email protected]కు పంపవచ్చు)

Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...