జూదం కేసులు ఐదు దాటితే జిల్లా బహిష్కరణ : డీఎస్పీ

ABN , First Publish Date - 2020-09-30T11:26:40+05:30 IST

జూదం కేసులు ఐదు దాటితే అలాంటి వారిని జిల్లా బహిష్కరణ చేస్తామని డీఎస్పీ నాగరాజు హెచ్చరించారు.

జూదం కేసులు ఐదు దాటితే  జిల్లా బహిష్కరణ : డీఎస్పీ

ముద్దనూరు సెప్టెంబరు 29: జూదం కేసులు ఐదు దాటితే అలాంటి వారిని జిల్లా బహిష్కరణ చేస్తామని డీఎస్పీ నాగరాజు హెచ్చరించారు. ముద్దనూరు మండలం ఉప్పలూరులో సోమవారం క్రికెట్‌ బెట్టింగ్‌లో ఐదుగురు పట్టుబడిన సంగతి విదితమే. అందులో భాగంగా మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ నాగరాజు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పేకాట, మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌ కాయడం తప్పన్నారు. యువత ఐపీఎల్‌ ఉచ్చులో పడి అప్పులపాలవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.


ఒక వ్యక్తిపై పేకాట, మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులు ఒకటి లేదా రెండు నమోదైతే బైండోవర్‌ చేస్తామని, 5 కేసుల వరకు నమోదైతే పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. అంతకన్నా ఎక్కువ నమోదైతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ, లేదా జిల్లా బహిష్కరణ చేస్తామన్నారు. ఉప్పలూరులో ఐదుగురు వ్యక్తులు సెల్‌ఫోన్‌లో ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు సంబంధించి బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1.50 లక్షలు నగదు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వారిని పట్టుకున్న సీఐ హరినాథ్‌, ఎస్‌ఐ శివప్రసాద్‌ను ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు.

Updated Date - 2020-09-30T11:26:40+05:30 IST