డీఎస్పీ, సీఐల బదిలీలపై కసరత్తు

ABN , First Publish Date - 2021-05-17T05:09:47+05:30 IST

జిల్లాలో త్వరలో డీఎస్పీలు, సీఐల బదిలీలు భారీగా జరగబోతున్నాయి. అందుకనుగుణ మైన కసరత్తుని ఇటు రాజకీయంగాను, అటు పోలీసు అధికారులు ముమ్మరం చేశారు.

డీఎస్పీ, సీఐల బదిలీలపై కసరత్తు

మంత్రిపై పెరిగిన రాజకీయ వత్తిళ్లు 

నేతల చుట్టూ తిరుగుతున్న పోలీసు అధికారులు 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలో త్వరలో డీఎస్పీలు, సీఐల బదిలీలు భారీగా జరగబోతున్నాయి. అందుకనుగుణ మైన కసరత్తుని ఇటు రాజకీయంగాను, అటు పోలీసు అధికారులు ముమ్మరం చేశారు. ఈ బదిలీల్లో కావాల్సిన అధికారులను వేయించుకునేందుకు ఇటు అధికారపార్టీ నాయకులు, అవసరమైన పోస్టింగ్‌ల కోసం కొందరు పోలీసు అధికారులు జిల్లాలో మంత్రి బాలినేని వద్దకు వచ్చి చర్చించటం ప్రారంభించారు. మరోవైపు డీఐజీ గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసి ఉండటంతో ఆయనతో నేరుగా కొంతమంది పోలీసు అధికారులకు పరిచయాలు ఉన్నాయి. దీంతో అక్కడ డీఐజీ, ఇక్కడ ఎస్పీల సిఫార్సులు పొందే ప్రయత్నాలకూ కొందరు శ్రీకారం పలికారు. బదిలీల విషయంలో కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. రెండేళ్లు పదవీకాలం పూర్తయిన వారందరితో పాటు సీఐలను కనీసం ప్రస్తుతం పనిచేసే నియోజకవర్గేతర ప్రాంతాలకు బదిలీ చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది. ఆ ప్రకారం ఒంగోలు, దర్శి డీఎస్పీల బదిలీలు ఖాయంగా జరగవచ్చని భావిస్తున్నారు. తాజాగా కందుకూరు డీఎస్పీ బదిలీ విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆయన కందుకూరులో బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి కానందున కొనసాగించాలని కూడా కొందరు కోరుతున్నట్లు సమాచారం. 

ఎక్కువగానే సీఐల బదిలీలు

సీఐలలో ఎక్కువమంది బదిలీలు జరగనున్నాయి. తెలిసిన సమాచారం మేరకు ప్రస్తుత పొదిలి సీఐ శ్రీరామ్‌ కందుకూరు సీఐగా, ఇటీవల గిద్దలూరు నుంచి రెవెన్యూ ఆఫీసుకి బదిలీ అయిన సుధాకర్‌ని పొదిలి సీఐగా బదిలీ చేయవచ్చని భావిస్తున్నారు. మార్కాపురం సీఐ రాఘవేంద్రను గుంటూరు జిల్లా తెనాలికి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్కాపురానికి బీపీనాయక్‌ ముందు వరుసలో ఉన్నారని సమాచారం. అద్దంకి సీఐని బదిలీ చేసే అవకాశం తొలుత కనిపించింది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఆయన వ్యవహారశైలిని మంత్రి తప్పు పట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆయన అక్కడ చేరి రెండేళ్లు పూర్తికాకపోవటం, ఇతరత్రా ఉన్న కొన్ని సమస్యలతో ప్రస్తుతానికి ఆయనను అక్కడే ఉంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇంకొల్లు సీఐ అల్తాఫ్‌ హుస్సేన్‌ని బదిలీ చేయాలని కొందరు వైసీపీ నాయకులు కోరుతుండగా కొందరు ఉంచాలని కోరుతున్నారు. తాజా పరిణామాల మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. సింగరాయకొండ సీఐ కూడా బదిలీల జాబితాలో ఉన్నట్లు తెలిసింది. 

అందరి దృష్టి ఒంగోలుపైనే 

కాగా ఒంగోలు డీఎస్పీ, నలుగురు సీఐల బదిలీల వ్యవహారంపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. డీఎస్పీకి రెండేళ్ల సమయం అయినందున బదిలీ కావచ్చని తెలిసింది. ఒంగోలు టూటౌన్‌ సీఐ కూడా రెండేళ్లు పూర్తయినందున అతన్ని బదిలీ చేయబోతున్నారు. అయితే ఒంగోలు వన్‌టౌన్‌, తాలూకా సీఐలు నియమితులై రెండేళ్లు పూర్తి కాలేదు. వారి విషయంలో మంత్రి బాలినేని అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా తాలూకా సీఐని బదిలీ చేసే యోచనలో ఉండటమే గాక ఆ విషయాన్ని బహిరంగంగా కూడా ఆయనను కొనసాగించాలని కోరుతున్న నాయకులకు చెప్పటం విశేషం. వన్‌టౌన్‌ సీఐని కొనసాగించాలని కొందరు, మార్చాలని మరికొందరు స్థానిక వైసీపీ నాయకులు మంత్రి వద్ద పట్టుబడుతున్నారు. రూరల్‌ సీఐ బదిలీ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. మంచి డిమాండ్‌ ఉండటంతో చాలామంది పోటీ పడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుత సీఐని బదిలీ చేస్తే మరో ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వాలని మంత్రి బాలినేనికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 20వ తేదీ తర్వాత బదిలీలు ఉండే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - 2021-05-17T05:09:47+05:30 IST