తలరాతలు మార్చేసిన డీఎస్సీ-98

ABN , First Publish Date - 2022-06-23T15:40:27+05:30 IST

డీఎస్సీ-98కి ఎంపికైనవారి జాబితా ప్రకటన పలువురి జీవితాలను మార్చేసింది. ఉద్యోగంపై ఆశలు వదులుకుని.. తమ తమ వృత్తుల్లో స్థిరపడినవారికి..

తలరాతలు మార్చేసిన డీఎస్సీ-98

ప్యాపిలి/పెద్దకడుబూరు, జూన్‌ 22: డీఎస్సీ-98కి ఎంపికైనవారి జాబితా ప్రకటన పలువురి జీవితాలను మార్చేసింది. ఉద్యోగంపై ఆశలు వదులుకుని.. తమ తమ వృత్తుల్లో స్థిరపడినవారికి ఇప్పుడు ఉద్యోగం వచ్చిందని తెలియడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 


ఆశ చంపుకుని.. సాగును నమ్ముకుని..!

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మామిళ్లపల్లికి చెందిన సింగరి ఎరుకులప్ప, రంగమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు. అందులో పెద్దవాడు శేషయ్య. పెద్దవాడికి ఉద్యోగం వస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటాడనే ఆశతో తల్లిదండ్రులు బీఈడీ చదివించారు. 1996లో డీఎస్సీ రాసినా ఉద్యోగం రాలేదు. 1998లో డీఎస్సీ వివాదాల్లో ఉండిపోయింది. ఇక ఉద్యోగంపై ఆశ వదిలేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు 59 ఏళ్ల వయసులో అతనికి ఉద్యోగం వచ్చింది. మూడేళ్లకు విరమణ చెందినా సంతోషమేనని శేషయ్య ఆనందంగా చెప్పాడు. 


కుల వృత్తే దిక్కని..

కర్నూలు జిల్లా పెద్దకడుబూరుకు చెందిన హనుమంతప్ప, ఈరమ్మలకు ఐదుగురు సంతానం. అందులో చివరివాడు రామన్న. హనుమంతప్ప కులవృత్తి చేసుకుంటూ రామన్నను బీఎడ్‌ చదివించాడు. 1996లో డీఎస్సీ క్వాలిఫై కాలేదు. 1998లో క్వాలిఫై అయినా.. ఉద్యోగం రాలేదు. దీంతో బార్బర్‌ షాపునే నమ్ముకుని జీవిస్తున్నాడు. వాయిద్యం మాస్టర్‌గా పేరుగాంచాడు. పిల్లలకు పాఠాలు చెప్పే అవకాశం రాకపోయినా ఎంతోమందికి వాయిద్యం నేర్పించి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు 56 యేళ్ల వయస్సులో ఆయనకు టీచర్‌ ఉద్యోగం రావడంతో తన ఆనందాన్ని గ్రామస్థులతో పంచుకున్నాడు.




వస్త్ర వ్యాపారంలో స్థిరపడి..

ప్యాపిలికి చెందిన ఇబ్రహీం 1998 డీఎస్సీ రాశాడు. వివాదాలతో ఫలితాలు నిలిచిపోవడంతో గార్మెంట్స్‌ దుకాణం పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇబ్రహీం వయస్సు 47 ఏళ్లు. ఉద్యోగం రావడంతో ఉపాధ్యాయులు, స్నేహితులు అతడిని అభినందించారు.





Updated Date - 2022-06-23T15:40:27+05:30 IST