శుష్కం, శూన్యం

ABN , First Publish Date - 2021-04-22T06:18:24+05:30 IST

మంగళవారం రాత్రి 8.45కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశప్రజలకు ఇచ్చిన సందేశానికి నిర్లిప్త స్పందనే లభించింది. ఆ ప్రసంగంలో ఒక ఆశ్వాసన...

శుష్కం, శూన్యం

మంగళవారం రాత్రి 8.45కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశప్రజలకు ఇచ్చిన సందేశానికి నిర్లిప్త స్పందనే లభించింది. ఆ ప్రసంగంలో ఒక ఆశ్వాసన కానీ, ఒక వివరణ కానీ, ఒక కార్యాచరణ కానీ ఏమీ లేదు. నిజానికి అందులో విషయమే లేదు. రెండో దఫా కొవిడ్ విజృంభణ తీవ్రంగా ఉన్న దశలో మొట్టమొదటిసారి ప్రసంగించనున్న ప్రధానమంత్రి ఏమి చెబుతారో, ఏ నిర్ణయాలను ప్రకటిస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. లాక్‌డౌన్‌ను నివారించాలన్న ఒక సానుకూల ప్రకటన తప్ప ఆ ప్రసంగంలో అంతా తాలూ తప్పే. ఈ మాత్రం దానికి రాత్రిపూట ఇంతగా ఆత్రుత పరచాలా అని జనం నీరసపడ్డారు. శుష్కవచనాలనే సుదీర్ఘంగా వల్లించకుండా, క్లుప్తంగా ముగించినందుకు కొందరు సంతోషించారు. పోయిన ఏడాది లాగా కొవ్వొత్తులు, గిన్నెలు గరిటెల శబ్దాలు వంటి ‘హోమ్ వర్క్’ ఇవ్వనందుకు కూడా కొం దరు ఊపిరి పీల్చుకున్నారు. కొవిడ్ ఆరంభదశలో ప్రధాని మాటకు ఉన్న విలువ, ఆయన అందించే నాయకత్వంపై ఏర్పడిన కొద్దోగొప్పో నమ్మకం ఈసారి ఆవిరైపోయినట్టు కనిపించింది.


భారతదేశంలో ఇప్పుడున్న కేంద్రప్రభుత్వం ప్రత్యేక తరహా కార్యాచరణ విధానం కలిగినది. ఇందులో మంత్రులకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అంతా ప్రధానమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తుంది. ప్రధానమంత్రే సమీక్షలు నిర్వహిస్తారు, ముఖ్యమంత్రులతో విడియో సమావేశాలు నిర్వహిస్తుంటారు. తన మనసులోని మాటను రేడియోద్వారాను, అప్పుడప్పుడు ఇట్లా అత్యవసర టెలివిజన్ సందేశాల ద్వారాను పంచుకుంటుంటారు. ప్రధాని గత వారాంతంలో నిర్వహించిన సమీక్ష దేశంలో ప్రాణవాయువు కొరత గురించి. ఇంత పెద్ద దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వైద్య అవసరాల కోసం ఎంత ప్రాణవాయువు కావలసి ఉంటుందో కేంద్ర ఆరోగ్యమంత్రి దగ్గర నుంచి దేశంలోని వైద్య ఆరోగ్య వ్యవస్థ అంతా లెక్క వేసుకుని, తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ మంత్రిత్వ శాఖ పరిధికి మించిన అనుమతులు, నిర్ణయాలు కావలసి ఉంటే ప్రధానమంత్రికి నివేదించాలి. మొదటి దఫా కొవిడ్‌ను అధిగమించామని తామే సంతృప్తిపడి, ప్రకటనలు చేసి నిశ్చింతగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగం, ఊహించని రీతిలో, తీవ్రతతో రెండో దఫా కొవిడ్ ముంచుకు వచ్చేసరికి చేతులు ఎత్తేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రాణవాయువు సరఫరా కోసం కావలసిన సిలిండర్ల గురించి, రాష్ట్రాల మధ్య రవాణాకు చెక్ పోస్టుల దగ్గర ఆటంకాలను నివారించడం గురించి ప్రధానమంత్రి  సమావేశం పెట్టి సమీక్షించవలసిన పరిస్థితి  ఏర్పడింది. ఇది  ఆపదలో ఉన్న ప్రజలకు ఎటువంటి సంకేతాలను పంపుతుంది? అనుభవజ్ఞులైన రాజనీతిజ్ఞులు కొవిడ్ నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి సలహాలు సూచనలు ఇస్తుంటే, వారిని రాజకీయంగా ఎద్దేవా చేస్తూ ప్రకటనలు జారీచేయడంలో కేంద్ర ఆరోగ్యమంత్రి నిమగ్నమై ఉన్నారు. ఇక కేంద్రంలోని ప్రభుత్వానికి, అధికారపార్టీకి చెందిన సమస్త బలగమూ ఎన్నికల ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. ఇక విపత్తు నివారణ చర్యలకు సమయమెక్కడ? 


గత ఏడాది లాగా ఇది వ్యాధికి నిదానం దొరకని కాలం కాదు. మన దగ్గర టీకాయుధాలున్నాయి అని అంటున్నారు  ప్రధాని. నిజమే. టీకా ఉత్పత్తిలో మన సామర్థ్యాన్ని ప్రపంచమంతా పొగిడింది. సముద్రాలకు ఆవలకు కూడా ప్రాణభిక్ష పెడుతున్న సంజీవని అని మన టీకాను పొగిడారు. సమస్య ముంచుకు వచ్చినప్పుడు అందరూ నిస్సహాయులే, కానీ, దాని పరిష్కారంలో భారత్ పెద్ద పాత్ర వహించబోతున్నదని మనమంతా గర్వించాము. ఏమైంది? టీకాను ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాము. టీకా తయారీకి లైసెన్సు ఇచ్చి  ఉత్పత్తికి ఆదేశించిన బ్రిటన్‌కు కూడా వాగ్దానం చేసిన డోసులను ఇవ్వలేని స్థితిలో పూణే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉన్నది. మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి కావాలని వారు నోరు తెరిచి అడిగేవరకు, ప్రభుత్వం ఏమి చేస్తున్నది? అడిగాక, ఎన్ని రోజులకు నిర్ణయం తీసుకున్నది? ఎప్పుడు ఆ డబ్బు అందుతుంది? సామర్థ్యం పెంచుకోవడానికి ఆ సంస్థకు ఎంత కాలం పడుతుంది? టీకాల కొరత అంశాన్ని మభ్యపరచడానికి కాబోలు, మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు దాటినవారందరికీ టీకాలు అందిస్తామని చెబుతున్నారు. పైగా, ప్రైవేటు ఆస్పత్రులలో, మార్కెట్ ధరలలో అందిస్తారట. ఆ కార్యక్రమం సృష్టించే సన్నివేశాలేమిటో చూడాలి. టీకాల ఉత్పత్తిలోనే కాదు, పంపిణీలోనూ మనమే గొప్ప అని ప్రభుత్వం చెబుతున్నది. మనం 84 రోజులలో 12 కోట్ల టీకాలు వేశాము. ఈ అంకెలను దేశాల జనాభాతో పోల్చి చూడాలి. మన దేశజనాభాలో అది పది శాతం కూడా కాదు. అమెరికా 82 రోజులకే 12 కోట్ల టీకాలు వేసింది. ఆ దేశజనాభాలో అది 30 శాతం. 


ఆక్సిజన్ కొరత తీవ్రమైన సమస్య. అది ఎప్పటికి తీరుతుందో తెలియదు. గత ఏడాది అనుమతి ఇచ్చిన ప్లాంట్లకు టెండర్ల ఖరారు ఏడాదికి పైగా పట్టింది. కొత్తగా ప్రకటిస్తున్న ప్లాంట్లు, ఎప్పుడు నిర్మించాలి, ఎప్పుడు ఉత్పత్తి ఆరంభించాలి? దేశపాలకుల అలక్ష్యం దీనితో తెలిసిపోతోంది. వైద్య ఆరోగ్య వ్యవస్థలో ఉన్న కొరతలన్నిటిని కరోనా నేపథ్యంలో భర్తీచేయవలసింది పోయి, నిర్లక్ష్యం వహించారు. అటువంటి స్థితి రాకూడదని కోరుకుంటాము కానీ, కేవలం ప్రాణవాయువు కొరత వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే ప్రమాదం పొంచి ఉన్నది. ఆక్సిజన్‌ను సమకూర్చుకోవడమే కాదు, దాన్ని దేశం నలుమూలలకు చేరవేయడం కూడా పెద్ద సవాల్‌గా ఉన్నది. 


ప్రధాని ఇవేవీ మాట్లాడలేదు. ఈ గండాన్ని ఎట్లా గట్టెక్కాలో చెప్పలేదు. కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పారు. కొన్నిటిని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. పిల్లలు, నవయువకులకు కొవిడ్ జాగ్రత్తల అమలును పర్యవేక్షించే బాధ్యత అప్పగించారు. తాను ప్రసంగం ముగించారు. ఆయన చెప్పారని కాదు కానీ, ప్రజలు తమ భవితవ్యాన్ని తామే పట్టించుకోవలసిన అగత్యం మాత్రం ఏర్పడింది. ఈ ఉపద్రవాన్ని అతి తక్కువ నష్టంతో అధిగమించడానికి  అధికారేతర రాజకీయ, సామాజిక సంస్థలు, ప్రజాసేవకులు కూడా ఒక కార్యాచరణ రూపొందించాలి. ప్రభుత్వాలను పర్యవేక్షించడానికి, ప్రజలకు మార్గదర్శనం చేయడానికి అది నేటి ప్రజాస్వామిక అవసరం.

Updated Date - 2021-04-22T06:18:24+05:30 IST