యథాతథంగా డీఆర్‌వో పోస్టులు

ABN , First Publish Date - 2020-09-20T08:09:31+05:30 IST

జిల్లా రెవెన్యూ అధికారుల(డీఆర్‌వో) పోస్టులను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోనే డీఆర్‌వోలు పనిచేస్తున్నారు.

యథాతథంగా డీఆర్‌వో పోస్టులు

27 ఖాళీలను గుర్తించి, పదోన్నతులు

25లోగా రెవెన్యూ పదోన్నతులు పూర్తి


హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):  జిల్లా రెవెన్యూ అధికారుల(డీఆర్‌వో) పోస్టులను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోనే డీఆర్‌వోలు పనిచేస్తున్నారు. గత ఫిబ్రవరిలో జాయింట్‌ కలెక్టర్‌ పోస్టుల పేర్లు మార్చుతున్నప్పుడే ఆ జిల్లా రెవెన్యూ అధికారుల పోస్టుల్లో పనిచేస్తున్న వారినందరినీ మార్చి ప్రభుత్వం అదనపు కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చింది. దాంతో ఈ పోస్టు ఉంటుందా?లేదా అనే మీమాంస కొనసాగింది.


తాజాగా రెవెన్యూ అధికారులందరికీ పదోన్నతులు కల్పించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో  27 జిల్లాల్లో ఖాళీగా ఉన్న 27 డీఆర్‌వో పోస్టులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 10 వరకు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు ఉండగా... అదనంగా 27 డీఆర్‌వో కలిపి, 37 మందికి స్పెషల్‌గ్రేడ్‌గా పదోన్నతి లభించనుంది.

మరోవైపు రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌, డిప్యూటీ కలెక్టర్లకు ఈనెల 25వ తేదీలోగా పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ధరణి వెబ్‌సైట్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్లు  ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఈలోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేస్తే శిక్షణ ఇవ్వడంపై స్పష్టత వస్తుందనే యోచనతో ఉంది.


రెవెన్యూశాఖలో అన్ని స్థాయిల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో అందుకు తగ్గట్లుగా యంత్రాంగం కసరత్తును ముమ్మరం చేసింది.

ఇందులో భాగంగా డిప్యూటీ తహసీల్దార్లు(నాయబ్‌ తహసీల్దార్లు) తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించడానికి వీలుగా జోన్‌-5(పూర్వ వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌)లో 152 మంది, జోన్‌-6 (పూర్వ మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌, నల్గొండ, హైదరాబాద్‌) జిల్లాల పరిధిలో 186 మందితో జాబితాను ప్రచురించింది.

మరోవైపు 37 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా, 36 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా, 179 మంది సీనియర్‌ అసిస్టెంట్లు తత్సమాన కేడర్‌కు డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఇదంతా 25 వ తేదీలోగా జరిగిపోనుంది. 


Updated Date - 2020-09-20T08:09:31+05:30 IST