మందుబాబుల ఆగడాలు

ABN , First Publish Date - 2022-06-29T05:57:08+05:30 IST

జిల్లాలోని పలు మండలాలు, మునిసిపాలిటీల్లో మందుబాబుల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

మందుబాబుల ఆగడాలు
సబ్బవరం మండలం మలునాయుడుపాలెంలోని ఒక లేఅవుట్‌లో ఖాళీ మద్యం సీసాలు

పట్టపగలు రోడ్లపై, జనవాసాల మధ్య మద్యపానం

రాత్రిపూట ఖాళీ స్థలాల్లో ఓపెన్‌ బార్లు

విద్యా సంస్థలు, క్రీడా మైదానాలనూ విడిచిపెట్టని వైనం

అటుగా వెళుతున్న వారితో గొడవలు

ఎక్కడపడితే అక్కడ కుప్పలుగా ఖాళీ సీసాలు

అనకాపల్లి, పాయకరావుపేట్లో గంజాయి ఆనవాళ్లు

నియంత్రించడంలో పోలీసులు విఫలం


అనకాపల్లి టౌన్‌/ ఎలమంచిలి/ పాయకరావుపేట/ సబ్బవరం, జూన్‌ 28:

జిల్లాలోని పలు మండలాలు, మునిసిపాలిటీల్లో మందుబాబుల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పట్టపగలు సైతం రహదారుల పక్కన, జనావాసాల నడుమ గల ఖాళీ స్థలాలు, నిరుపయోగంగా వున్న భవనాల్లో గుంపులుగా చేరి మద్యం సేవిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రాకపోకలు సాగించే వారితో గొడవలకు దిగుతూ దాడులకు తెగబడుతున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి స్థానికులు వెనకడుగు వేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదన్న నిబంధనలను పోలీసులు అమలుచేయడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డు, సత్యనారాయణమూర్తి కొండ పరిసరాలు, ఏలేరు కాలువకు ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశాలు, తుమ్మపాలకు సమీపంలోని శారదా నది ఒడ్డున, రైల్వే స్టేషన్‌ సమీపంలోని అన్న క్యాంటీన్‌ భవనం, ఇంకా పలుచోట్ల యువకులు పగలు, రాత్రి అన్న తేడా లేకుండా గుంపులు గుంపులుగా చేరి మద్యం సేవిస్తున్నారు.  బైపాస్‌రోడ్డు, గవరపాలెం రజక కాలనీ, మార్కెట్‌యార్డు సమీప ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నారు. కాగా అనకాపల్లిలో ఇటీవల కాలంలో గంజాయి అమ్మకాలు కూడా సాగుతున్నాయి. శారదానది ఒడ్డున, పట్టణ శివారుల్లోని కాలనీల వద్ద యువత గంజాయి సేవిస్తున్నారు. కొన్నిసార్లు వాళ్లలో వాళ్లే గొడవ పడి కొట్టుకుంటున్నారు. 

ఎలమంచిలి బస్టాండ్‌ సమీపంలోని కొన్ని పాన్‌ షాపులు,  రైల్వే స్టేషన్‌ రోడ్డులోని జడ్పీ హైస్కూలు చెంతన, వీధి రోడ్లలో మందుబాబులు బహిరంగంగానే మద్యం సేవిస్తున్నారు. రాజీవ్‌ క్రీడా మైదానం రాత్రిపూట మందుబాబులకు అడ్డాగా మారుతున్నది. మైదానంలో  పలుచోట్ల నిత్యం ఖాళీ మద్యం సీసాలు కనిపిస్తున్నాయని క్రీడాకారులు వాపోతున్నారు. ఎలమంచిలి పెంజెరువు సమీపంలో చీకటి పడిన తరువాత మందు బాబుల సందడి అధికంగా వుంటున్నదని స్థానికులు అంటున్నారు. దీంతో రాత్రిపూట ఇటువైపుగా రాకపోకలు సాగించాలంటే భయమేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సబ్బవరం మండలంలో రైవాడ కాలువ గట్లు, ఒమ్మివానిపాలెం నుంచి అమృతపురం వరకు రహదారి పక్కన, సబ్బవరం శివారు చినగొల్లలపాలెం సర్వీసు రోడ్డు (ఈ నెల 19న ఇక్కడ ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు), అసకపల్లి రెవెన్యూ పరిధిలో లా యూనివర్సిటీ వెనక వైపు ఖాళీ స్థలం, మలునాయుడుపాలెం రెవెన్యూ పరిధిలో ఒక ప్రైవేటు లే-అవుట్‌, ఆరిపాక శివారు లగిశెట్టిపాలెంలో  రెండు లే-అవుట్లు మందుబాబులకు ఆవాసాలుగా మారాయి. నిర్మానుష్యంగా వున్న ప్రాంతాల్లో పట్టపగలు కూడా మద్యం సేవిస్తున్నారు. ఖాళీ మద్యం సీసాలను ఎక్కడ పడితే అక్కడ పగలగొడుతుండడంతో అటుగా వెళ్లేవారి పాదాల్లో గాజుపెంకులు గుచ్చుకుంటున్నాయి.  

పాయకరావుపేట పట్టణంలో మద్యం, గంజాయి వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా యువకులు గంజాయి మత్తుకు అలవాటుపడిపోయారు. చీకటి పడిన తరువాత పట్టణంలోని పలు లేఅవుట్లలోని ఖాళీస్థలాలతోపాటు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణ, జాతీయ రహదారి అవతల ఉన్న మండల పరిషత్‌ కాంప్లెక్స్‌ ఆవరణ తదితర ప్రాంతాలను మందుబాబులు ఓపెన్‌ బార్లుగా మార్చేస్తున్నారు. ఇంకా శ్మశానవాటిక సమీపంలో ఉన్న కొబ్బరితోట, బృందావనంలోని మండల పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలలో మద్యం, గంజాయి సేవిస్తున్నారు వీరిలో 14-16 ఏళ్ల అబ్బాయిలు ఉండడం గమనార్హం. గంజాయి మత్తులో గొడవలకు దిగుతున్నారు. కాగా మద్యం, గంజాయికి అలవాటు పడిన ఆకతాయిలు తరచూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల బృందావనం పాఠశాలలో కంప్యూటర్లు, ట్యాబ్‌లు, ఫ్యాన్లు, విద్యుత్‌ సామగ్రిని చోరీ చేశారు. 


Updated Date - 2022-06-29T05:57:08+05:30 IST