అతను మద్యానికి బానిస.. రోజూ తాగేసి ఇంటికి వెళ్తుంటాడు.. ప్రతిరోజూ కుటుంబ సభ్యులతో గొడవపడుతుంటాడు.. సోమవారం రాత్రి కూడా అలాగే తాగేసి ఇంటికి వెళ్లాడు.. భార్యతో గొడవపడ్డాడు.. అనంతరం ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్టు ఎక్కేశాడు.. భయపడిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గంట పాటు కష్టపడి అతడిని కిందకు దింపారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన రామ్ సింగ్ అనే వ్యక్తి రోజు తాగి ఇంటికి వెళ్లి భార్యతో గొడవపడుతుండేవాడు. సోమవారం సాయంత్రం కూడా పూటుగా మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. పిల్లల ఎదురుగానే భార్యతో గొడవపడ్డాడు. అనంతరం ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ తాడు తీసుకుని ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్టు ఎక్కేశాడు. భయపడిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంతగా నచ్చ చెప్పినా అతను మాట వినలేదు. మద్యం మత్తులో చెట్టుపైనే ఉండిపోయాడు. ఊర్లోని యువకుల సహాయంతో పోలీసులు చెట్టు ఎక్కి రామ్ సింగ్‌ను కిందకు దించారు. అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు.