9 తర్వాత తనిఖీలేవి.. సామాన్యులపైనే పోలీసుల ప్రతాపమా..?

ABN , First Publish Date - 2021-03-04T17:06:17+05:30 IST

భాగ్యనగరంలో ట్రాఫిక్‌ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

9 తర్వాత తనిఖీలేవి.. సామాన్యులపైనే పోలీసుల ప్రతాపమా..?

  • హైదరాబాద్‌లో డ్రంకెన్‌ డ్రైవ్‌.. రోడ్డు బ్లాక్‌.. అవస్థలే!
  • రాత్రి 7 టు 9 వాహనదారులకు అవస్థలే 
  • బడాబాబులను వదిలేయడానికేనా..?
  • ప్రభుత్వాన్ని అడగండి : పోలీసుల నిర్లక్ష్యపు సమాధానం


భాగ్యనగరంలో ట్రాఫిక్‌ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకూ వాహనదారులు నరకం చూడాల్సిందే. మరీ ముఖ్యంగా రాత్రి 7 గంటల నుంచి  9 మధ్యలో విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటుంది. విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు ఆ సమయంలో చుక్కలు చూడాల్సిందే. సరిగ్గా అదే సమయంలో కొన్ని చోట్ల డ్రంకెన్‌ డ్రైవ్‌ పేరుతో ట్రాఫిక్‌ పోలీసులు రోడ్డు బ్లాక్‌ చేస్తున్నారు. మరింత ట్రాఫిక్‌ జామ్‌కు కారణమవుతున్నారు.


హైదరాబాద్‌ : డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల పేరుతో సాయంత్రం 7 గంటలకే నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు రోడ్లన్నీ బ్లాక్‌ చేస్తున్నారు. రోడ్డు మధ్యలో బారికేడ్లు పెడుతున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధుల్లో నిమగ్నమై అలిసిపోయిన ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయం, సందర్భం లేకుండా ఇష్టానుసారంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ చేపట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నిజమైన డ్రంకెన్లు తప్పించుకోవడానికేనా..?

తప్పతాగి అడ్డగోలుగా వాహనాలు నడిపేవారు రాత్రి పది తర్వాతే బార్లు, క్లబ్‌లు, పబ్‌లోంచి బయటకు వస్తారు. ప్రమాదాలు సృష్టిస్తారు. ఇప్పటి వరకు డ్రంకెన్‌ డ్రైవ్‌లో ప్రమాదాలు చేసిన వారిలో డబ్బున్న బాబులే ఎక్కువగా ఉన్నారు. డేటా బయటకు తీస్తే ఈ విషయం ట్రాఫిక్‌ పోలీసులకు అవగతం అవుతుంది. అర్ధరాత్రి డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తున్న సమయంలో సంపన్నుల, బడాబాబుల పిల్లలు,  రాజకీయ పలుకుబడి ఉన్నవారు పోలీసులపై తిరగబడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 7-9 గంటల మధ్యలో డ్రంకెన్‌ డ్రైవ్‌ చేపడుతూ వేలాది మంది ట్రాఫిక్‌లో నిలిచిపోయేలా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పోలీసులు.. ఎవరిని కాపాడటానికి ఇదంతా చేస్తున్నారని కొందరు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. 


నిరుపేదలను, రోజువారీ కూలీ పనులు చేసుకునే వారిని పట్టుకుని కేసులు కడితే డ్రంకెన్‌ డ్రైవ్‌ లక్ష్యం నెరవేరుతుందా..? వారిని కోర్టు బోనులో నిలబెట్టి రూ. 10వేల జరిమానా కట్టేలా చేయడం, వాహనం కోసం తిప్పుకోవడం ఎంత వరకు సమంజసం. రాత్రి 7 నుంచి 9 వరకే తనిఖీలు నిర్వహించి, అర్ధరాత్రి ఒంటి గంట, 2 దాకా పబ్బుల్లో, క్లబ్బుల్లో, పార్టీల్లో మద్యం తాగి, మత్తులో జోగుతూ అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తున్న వారిని భయబ్రాంతులకు గురి చేసే వారిని ఎవరు పట్టుకోవాలి, వారిపై ఎవరు కేసులు నమోదు చేయాలి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెద్దోళ్లను వదిలేయడానికే సాయంత్రం 7 - 9 తనిఖీలనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


పోలీసుల నిర్లక్ష్యపు సమాధానం

సగటు మనిషి విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే సమయంలో రోడ్లు బ్లాక్‌ చేసి డ్రైంకెన్‌ డ్రైవ్‌ చేపడుతుండడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మాకేం తెలియదు. మా ఇన్‌స్పెక్టర్‌ను అడగండి. లేదంటే ముఖ్యమంత్రిని అడగండి. అనవసరంగా మాతో వాదన పెట్టుకోవద్దు.’ అని వాహనదారులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-03-04T17:06:17+05:30 IST