తాగకపోతే అమ్మఒడి లేదా?: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-11-25T22:36:22+05:30 IST

ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం చేస్తానన్న సీఎం జగన్‌రెడ్డి.. ఇప్పుడు నాన్న మద్యం తాగకపోతే అమ్మకు అమ్మఒడి లేదంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవాచేశారు.

తాగకపోతే అమ్మఒడి లేదా?: చంద్రబాబు

నెల్లూరు: ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం చేస్తానన్న సీఎం జగన్‌రెడ్డి.. ఇప్పుడు నాన్న మద్యం తాగకపోతే అమ్మకు అమ్మఒడి లేదంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవాచేశారు. నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగుడుకి, సంక్షేమానికి లింకుపెట్టిన మహానుభావుడు జగన్‌రెడ్డి అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే వరదల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నారు. వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వడంలోనూ ప్రభుత్వం విఫలమైందని తప్పుబట్టారు. అందరు కష్టాల్లో ఉంటే జగన్‌రెడ్డి గాలిలో ఒక ట్రిప్‌ వేశారని, జగన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే చేస్తే వరద బాధితుల కష్టాలు కనిపిస్తాయా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ వాయిదా వేసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే ఏమౌతుంది? అని ప్రశ్నించారు. వరద బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్నా నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టారని, దీనివల్లే పెన్నా నది కట్టలు తెగిపోయి అనేక గ్రామాలు మునిగిపోయాయని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2021-11-25T22:36:22+05:30 IST