యమడ్రింకరులు

ABN , First Publish Date - 2022-05-29T06:10:56+05:30 IST

యమడ్రింకరులు

యమడ్రింకరులు

నగరంలో పెరుగుతున్న డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

వారంలో పోలీసులకు చిక్కిన 145 మంది 

యువకులే అధికం.. ప్రమాదాలకు కారణం


వయస్సు.. తప్పటడుగులు వేయిస్తోంది. ఆలోచనలు.. మత్తెక్కిస్తున్నాయి. హుషారు.. వేగాన్ని పెంచుతోంది. అతి.. ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రస్తుతం విజయవాడ నగరంలో కుర్రకారు పరిస్థితి ఇది. మత్తులో మునిగితేలుతున్న యువకులు ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే కాదు.. ఎదుటి వారినీ నెట్టేస్తున్నారు. ఇటీవల నగరంలో డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు పెరగడం, అందులో యువకులే అధికంగా ఉండటం భయాందోళన కలిగిస్తోంది. 


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : విజయవాడలో ఎనిమిది రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మొత్తం 145 మందిపై కేసులు నమోదయ్యాయి. వారిలో దాదాపు 50 మంది వరకు యువకులే. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిలో ఎక్కువగా 20 నుంచి 35 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. ఈ లెక్కలు చూసిన ట్రాఫిక్‌ పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తాగడానికి కూడా ట్రెండ్‌

నగరంలో పార్టీల ట్రెండ్‌ రోజురోజుకూ మారుతోంది. ఎవరికి వారు సరికొత్త పంథాల్లో పార్టీలకు వేదికలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంతకుముందు పార్టీలు చేసుకోవడానికి ఏదో ఒక రెస్టారెంట్‌కు వెళ్లేవారు. కొద్దిరోజుల పాటు అర్ధరాత్రి సమయంలో నగర నడిరోడ్లపై కేక్‌లు కట్‌ చేసి, డ్రింకులను పొంగించడం ట్రెండ్‌గా మలుచుకున్నారు. తాజాగా ప్రత్యేకంగా హోటళ్లు బుక్‌ చేసుకుని సంబరాలు చేసుకుంటున్నారు. కేకులతో పాటు మద్యం సేవిస్తున్నారు. ఆ మత్తులోనే హోటళ్ల నుంచి బయటకు అడుగు పెడుతున్నారు. వాహనాలను కూడా అదే మత్తులో నడుపుతున్నారు. ఇష్టానుసారంగా డ్రైవ్‌ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. 

ఇంటర్‌ నుంచే లిక్కర్‌

ఇంటర్‌లోకి అడుగు పెట్టగానే యువత ఒక హోదా వచ్చిందన్న భావనలోకి వెళ్తోంది. స్నేహితులతో కలిసి రహస్యంగా పార్టీలు జరుపుకొంటున్నారు. ఈ పార్టీల్లో బీరు, మందు తప్పనిసరి అయిపోయింది. ఇళ్లలో మాత్రం పార్టీలకు వెళ్తున్నట్టు చెబుతున్నారు. ఆ పార్టీలో ఏం జరుగుతుందన్న విషయం మాత్రం తల్లిదండ్రులకు తెలియట్లేదు. సింగిల్‌ పేరెంట్‌ ఉన్న యువకులు ఎక్కువగా ఈ వ్యసనానికి బానిసవుతున్నారు. పాఠశాల నుంచి కళాశాల స్థాయికి రాగానే యువకుల చేతుల్లోకి బైకులు వచ్చేస్తున్నాయి. ఒక గ్రూపులో ఇద్దరు, ముగ్గురికి బైకులుంటే చాలు ఎక్కడో ఒకచోట పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సందర్భమేదైనా పార్టీ అనేసరికి బీరు, మందును యువకులు కోరుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం మొగల్రాజపురంలో ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఇలాగే పార్టీలు చేసుకున్నారు. స్పోర్ట్స్‌ బైకుపై వేగంగా వెళ్లి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మత్తులో వాహనాలు నడిపి యువకులు వారి భవిష్యత్తుకు ఫుల్‌స్టాప్‌ పెట్టుకోవడంతో పాటు ఇతరులకు ప్రమాదాన్ని కొని తెచ్చిపెడుతున్నారని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో యువత తీరు చాలా ఆందోళనకరంగా ఉందని ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వ్యాఖ్యానించారు. ట్రాఫిక్‌ పోలీసులు ఈ ఎనిమిది రోజుల్లో నమోదు చేసిన కేసుల ద్వారా మొత్తం రూ.2 లక్షల అపరాధ రుసుము వసూలు చేశారు. 

Updated Date - 2022-05-29T06:10:56+05:30 IST