Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

డయాబెటిస్‌ను నియంత్రించే ములక్కాడల కూర

డయాబెటిస్‌ను నియంత్రించే ములక్కాడల కూర

ములక్కాడ సాధారణ కూరగాయ కాదు. ఆహార పదార్థంగా తీసుకోదగిన అద్భుత ఔషధ ద్రవ్యం. ఆహార ఔషధాల్లో ములక్కాడ ఎన్నదగినది కూడా!  


ములక్కాడ మొక్కని ‘శిగ్రు’ అంటారు. మోరింగ ఒలిఫెరా దీని వృక్షనామం. డ్రమ్ములు వాయించే కర్రల్లా ఉంటాయి కాబట్టి, వీటిని ‘డ్రమ్‌ స్టిక్స్‌’ అంటారు. హిమాలయ ప్రాంతాల్లో పుట్టి పెరిగి ప్రపంచం అంతా విస్తరించిన భారతీయ వృక్షం ఇది. ఋగ్వేదంలో కౌసిక సూత్రం శిగ్రు మొక్కని క్రిమిసంహారకంగా పేర్కొంది. ప్రాచీన రోమన్లు ములక్కాడ గింజల్లోంచి తీసిన నూనెని చర్మవ్యాధుల్లో వాడేవారు. మునగ ఆకుల్ని, కాడల్నీ యుద్ధవీరులకు శక్తిదాయకంగా భావించి వండిపెట్టేవారు. దీన్ని మిరాకిల్‌ మొక్కగా, దేవుడి కానుకగా ఆఫ్రికన్‌ జాతులవారు భావిస్తారు. షుగరువ్యాధి, బీపీ, కీళ్లవాతం వ్యాధులతోపాటు ఎయిడ్స్‌లాంటి క్షీణింపచేసే వ్యాధుల్లో ఇది ఔషధం కూడా!


ములక్కాడలు కొద్దిగా కారం, వగరు రుచులు కలిగి ఉంటాయి. తేలికగా అరుగుతాయి. తీక్షణంగా పనిచేస్తాయి. కానీ, కొంచెం వేడి చేస్తాయి. అందుకని అతిగా ములక్కాడలు తింటే బాగా చెమటలు పడతాయి. వాతాన్ని కఫాన్ని అదుపు చేస్తాయి. చింతపండు లేకుండా ములక్కాడల రసం (చారు) కాచుకుని రోజూ ఖాళీ కడుపున తాగితే బీపీ, కొలెస్టరాల్‌ షుగరువ్యాధి లాంటివి నెమ్మదిస్తాయి. స్త్రీ పురుషుల మధ్య ఆసక్తి పెరుగుతుంది. లివరు, స్ప్లీన్‌, పాంక్రియాజ్‌, గర్భాశయం లాంటి సున్నిత అవయవాలలో దోషాలపైన ములక్కాడలు, ములగ ఆకులూ ఔషధంగా పనిచేస్తాయి. క్షారగుణం కలిగినవి. కాబట్టి, ఎసిడిటీని నివారిస్తాయి. గడ్డల్ని వాపుల్ని కరిగిస్తాయి. తల్లిపాలు పెరిగేలా చేస్తాయి. థైరాయిడ్‌ సమస్యలున్నవారికి, ఆయాసం ఉబ్బసం ఉన్నవారికి మేలు చేస్తాయి. 


ములక్కాడలతో కూర చేసే విధానాన్ని నలుడు ఇలా వివరించాడు. 

లేతగానూ, పొడవుగానూ, మనోహరంగానూ ఉన్న ములక్కాడలను ఎంచుకోవాలి. ముక్కలుగా తరిగి పైన పీచు తీసేసి, నీళ్లతో కడిగి తుడిచి, కొద్దిగా నెయ్యి వేసిన భాండీలో కాసేపు వేయించాలి. ఆవాలు, మిరియాలు, కొబ్బరి, నువ్వులు వీటిని తగుపాళ్లలో తీసుకుని దోరగా వేయించి మెత్తగా నూరాలి. ఈ పొడిలో కొంచెం పాలు పోసి కొద్దిసేపు పొయ్యి మీద ఉంచి వడగట్టండి! ఈ పాలలో ఇందాక వేగించిన ములక్కాడల ముక్కలు వేసి ఉడికించండి! ఇప్పుడు ఓ భాండీ తీసుకుని కొద్దిగా నెయ్యి వేసి ఇంగువ తాలింపు పెట్టి, అందులో మినప వడియాల్నీ, అప్పడాల ముక్కల్ని దోరగా వేగించండి. ఈ ములక్కాడల ముక్కల్ని పాలతో సహా అందులో కలిపి పాలు ఇగిరేదాకా ఉడికించండి. దింపబోయే ముందు తగినంత ఉప్పు, మిరియాలపొడి కలపండి.  రాజుగారికి దీన్ని వడ్డన చేయబోయే ముందు ఈ కూరని ఓ వస్త్రంలో మూటగట్టి బాగా కాగుతున్న నేతిలో కొద్దిసేపు ఉంచి, వేడి మీద వడ్డిస్తే అమోఘంగా ఉంటుందని వివరించాడు నలుడు. 


మనకీ యుగంలో ఈ నేతి మూటలు అవసరం లేకపోయినా, పాలతో వండిన ములక్కాడల కూర ప్రత్యేకతని అర్థం చేసుకోవాలి! శనగపిండి, మసాలాలు దట్టించిన ములక్కాడల కూర ఇప్పటిరోజుల్లో మనకు బాగానే అలవాటు. ములక్కాడలు కొద్దిగా వేడిచేస్తాయి కాబట్టి, దీనిలో అరివీరభయంకరంగా చింతపండురసం, అల్లం వెల్లుల్లి మసాలాలను కలపకుండా ఈ కూరని తయారు చేశాడు నలుడు. 


మనం తినబోయే ఆహార పదార్థం పట్ల మనకు భక్తిభావం ఉండాలి. అప్పుడే దాన్ని ఆరోగ్యదాయకంగా వండుకోగలుగుతాం. మసాలాలు అనేవి మాంసంలో నీచు వాసన పోవటానికి మాత్రమే ఉద్దేశించినవి. ఎలాంటి ఇబ్బందికర వాసనలు లేనప్పుడు ఆ కూరలో మసాలాలు వేయనవసరం లేదని నలుడి సూచన. అందుకే ఈ ములక్కాడల కూరలో మసాలాలను చేర్చలేదు. బాగా వగరు చేదు రుచులు ఉన్న పదార్థాలను మరో మార్గంలో ఆ చేదుని తొలగించటం సాధ్యం కానప్పుడే చింతపండు లాంటివి కలపవలసి ఉంటుంది. అనవసరంగా అల్లం వెల్లుల్లి, చింతపండు రసాలను పోసి ఏదీ వండనవసరం లేదని నలుడి పాఠం. 


నలుడు చెప్పిన పద్ధతిలో వండిన ములక్కాడల కూర జీర్ణశక్తిని వృద్ధి చేస్తుందని, వాతదోషాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుందని, లైంగిక శక్తిని పెంచుతుందని, శరీరానికి మంచి రంగునీ, కాంతినీ ఇస్తుందనీ, మధుమేహం, మూత్రపిండాల వ్యాధుల్ని తగ్గించే ఔషధంగా పని చేస్తుందనీ, కంటి చూపు మెరుగుపరుస్తుందనీ, పురుష జీవకణాలను పెంపు చేస్తుందనీ, రుచినిస్తుందని, శరీరంలో మాంస ధాతువుని వృద్ధి చేస్తుందనీ ఈ కూరకు గల ప్రయోజనాన్ని వివరించాడు నలుడు. అప్పడాలు, వడియాలతో ఈ కూరని వండటం వలన ఈ కూరకు గల లైంగికశక్తిని పెంచే స్వభావం మరింత పెరుగుతుంది. అలా కాకుండా కేవలం కారపు మసాలాలు పోసి వండితే లైంగికశక్తి హరిస్తుంది. 


‘ములక్కాడల పరమాన్నం’ పేరుతో కోనసీమలో ఇంచుమించు ఇలాంటి వంటకాన్నే తయారు చేస్తుంటారు. కొద్దిగా బియ్యాన్ని నానబెట్టి మెత్తగా రుబ్బిన పిండిని, తురిమిన కొబ్బరినీ, అలాగే పైన చెప్పిన పద్ధతిలో ఉడికించిన ములక్కాడల ముక్కల్నీ, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు కలిపి, ఉడుకుతూ ఉండగా బెల్లం లేదా పంచదార కలిపి సన్నసెగన వండుతారు. ఒక ముద్దగా దగ్గరకు వచ్చిన తరువాత ఇంగువ తాలింపు పెడతారు. ఒకవిధంగా ఇది తీపి కూర. తీపి కలిపి వండితే స్నాక్స్‌లాగా తినటానికి వీలుగా ఉంటుంది. తీపి కలపకుండా వండితే అన్నంలోకి బావుంటుంది. 


పాలతో ములక్కాడల కూర అనేది ఆరోగ్యసూత్రం. పాలతో వండితే పాలు విరుగుతాయి కాబట్టి, కొబ్బరిపాలతో వండితే మరింత రుచిగా ఉంటుంది. పాకశాస్త్ర ప్రావీణ్యంకొద్దీ ఇలాంటి మార్పులు చేసుకునే అనుమతి ఇచ్చాడు నలుడు.

సోయా కట్‌లెట్స్‌సోయా కట్‌లెట్స్‌పనీర్‌ కట్లెట్‌పనీర్‌ కట్లెట్‌క్యాప్సికమ్‌- బ్రొకోలి సబ్జీక్యాప్సికమ్‌- బ్రొకోలి సబ్జీదహీ తడ్కాదహీ తడ్కాబెండకాయ పెరుగు కర్రీబెండకాయ పెరుగు కర్రీఅక్రూత్‌ కీ గలౌటీఅక్రూత్‌ కీ గలౌటీపానకం పానకం వడపప్పువడపప్పుపెసరపప్పు లడ్డుపెసరపప్పు లడ్డుబిస్కెట్లుబిస్కెట్లు
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.