డ్రమ్ము.. సొమ్ము!

ABN , First Publish Date - 2022-01-24T05:15:10+05:30 IST

డ్రమ్ము.. సొమ్ము!

డ్రమ్ము.. సొమ్ము!

- ఎక్సైజ్‌ సిబ్బందికి కాసులు కురిపిస్తున్న డ్రమ్ములు

- దాడుల్లో పట్టుబడుతున్న సారా తయారీ సామగ్రి పక్కదారి

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

బెల్లం తయారీలో ఉపయోగించే డ్రమ్ములివి. ఇవే ఇప్పుడు ఎక్సైజ్‌, సెబీ సిబ్బందికి కాసులు కురిపిస్తున్నాయి. సాధారణంగా తనిఖీలు, దాడుల సమయంలో పట్టుబడిన బెల్లం ఊట, సారాను ధ్వంసం చేయాలి. తయారీ సామగ్రిని పూర్తిగా తగులబెట్టాలి. కానీ సిబ్బంది కొందరు వింత నాటకానికి తెరతీశారు. దాడుల్లో పట్టుబడిన డ్రమ్ములను దహనం చేసినట్టు రికార్డుల్లో చూపి.. ఇలా ఎంచక్కా వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

 

జిల్లాలో సారా ఏరులై పారుతోంది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో సారా తయారీ శిబిరాలు వెలుస్తున్నాయి. వీటికి ముకుతాడు పడకపోగా.. సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని కొందరు ఎక్సైజ్‌, సెబీ సిబ్బంది సొమ్ము చేసుకోవడం నివ్వెరపరుస్తోంది. జిల్లాలో సీతంపేట, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి, మందస, కంచిలి, ఇచ్ఛాపురం ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో సారా తయారీ శిబిరాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను తెరపైకి తెచ్చింది. ఎక్సైజ్‌ శాఖకు కేవలం మద్యం విక్రయాల బాధ్యతను అప్పగించింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకు మద్యం, సారా, ఇసుక అక్రమ రవాణా నియంత్రణ బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇటీవల స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోతో పాటు పోలీస్‌ శాఖ అధికారులు సారా తయారీదారులపై దాడులు చేస్తున్నారు.  దీంతో పెద్దఎత్తున బెల్లం ఊటలు, సారా పట్టుబడుతోంది. ఈ నిల్వలను ధ్వంసం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వీటితో పాటు సారా తయారీకి వినియోగించే ప్లాస్టిక్‌ డ్రమ్ములను సైతం దగ్ధం చేయాలి. కానీ కొందరు సిబ్బంది ఈ డ్రమ్ములను సంరక్షిస్తున్నారు. దాడుల సమయంలో రోజుకు సగటున పదుల సంఖ్యలో డ్రమ్ములను స్వాధీనం చేసుకుంటున్నారు. రికార్డుల్లో మాత్రం దగ్ధం చేసినట్టు చూపుతున్నారు.  అనధికారికంగా వ్యాపారులకు అమ్ముకొంటున్నారు. ఒక్కో డ్రమ్మును రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సీతంపేట, మెళియాపుట్టి మండల కేంద్రాల్లో వీటి విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వ్యాపారులు వచ్చి తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనిపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏఎస్పీ శ్రీనివాసరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా స్వాధీనం చేసుకున్న సామగ్రికి విధిగా లెక్కలు చూపాలన్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. నిబంధనలు అతిక్రమించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2022-01-24T05:15:10+05:30 IST