Hyderabad లో మత్తుకు యువత చిత్తు.. నగరమే అడ్డా.. టార్గెట్ వీళ్లే..!

ABN , First Publish Date - 2022-02-28T16:10:00+05:30 IST

భాగ్యనగరం డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోందా? ఆదిలోనే తుంచేయాల్సిన మత్తు దందాను సరైన వ్యవస్థలు లేకపోవటంతో..

Hyderabad లో మత్తుకు యువత చిత్తు.. నగరమే అడ్డా.. టార్గెట్ వీళ్లే..!

  • పోలీసులకు చిక్కకుండా అమ్మకాలు


హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : భాగ్యనగరం డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోందా? ఆదిలోనే తుంచేయాల్సిన మత్తు దందాను సరైన వ్యవస్థలు లేకపోవటంతో ఇంతవరకూ తీసుకొచ్చారా..? అంటే అవుననే అంటున్నారు. 2000-01 సమయంలో పార్టీ కల్చర్‌ ట్రెండ్‌కు నల్లమందు, హుక్కా తోడయ్యాయి. తర్వాత అది హెరాయిన్‌, కొకైన్‌ వరకూ దారితీశాయి. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్‌ లభిస్తున్నాయి. ఒకప్పుడు గంజాయి అంటే కొందరు మాత్రమే తీసుకునే వారనే భావన ఉండేది. ఇప్పడు క్లాస్‌, మాస్‌, యూత్‌, స్టూడెంట్స్‌ వరకూ చేరింది. తాజాగా పోలీసుల కన్నెర్రతో డ్రగ్స్‌ మూలాలు బయటపడుతున్నాయి. మధ్య, దిగువ తరగతి యువతే టార్గెట్‌గా ఎండీఎంఏ వంటి డ్రగ్స్‌ విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడవుతోంది. 


మత్తుకు అలవాటు పడిన యువత తర్వాత దశలో స్మగ్లర్లుగా మారుతున్నారు. కరోనా కాలంలో ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి దూరమైన వారు గంజాయి రవాణా చేస్తూ పట్టుపడుతున్నారు. 2021లో మూ డు పోలీసు కమిషనరేట్ల పరిధిలో అక్షరాలా తొమ్మిది వేల కిలోల గంజాయి పట్టుబడిందని ఓ అంచనా. ఇక ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి హైదరాబాద్‌ దాటితే  ఎగబడి కొనేందుకు అటు కర్ణాటక, మహారాష్ట్ర ముఠాలు రెడీగా ఉన్నాయి. అవసరమైతే పదిరెట్లు ఇచ్చి సరకు తీసుకుంటామని పోటీపడే వ్యాపారులు ముంబై, బెంగళూరుల్లో కోకొల్లలు.


బస్తీలోన్లూ అమ్మకాలు.. 

గతంలో డ్రగ్స్‌ అంటే బంజారాహిల్స్‌తోపాటు మాదాపూర్‌లోని పబ్‌లు గుర్తుకు వస్తాయి. డ్రగ్స్‌ వ్యాపారులు సైతం ఈ ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకున్నారు. పబ్‌లు, కాఫీ షాపుల్లో యువతను పరిచయం చేసుకుని మత్తు పదార్థాలను అలవాటు చేస్తున్నారు. ఇందుకు ఈవెంట్‌ మేనేజర్‌లు కూడా తగిన సహకారం అందిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, డ్రగ్స్‌ కేవలం ధనవంతులుండే ప్రాంతాలకే పరిమితమనే వాదనను పోలీసులు కొట్టి పడేస్తున్నారు. డ్రగ్స్‌ దందా పేద, మధ్య తరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో కూడా విస్తరిస్తోందని అంటున్నారు. 


ఇటీవల డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడిన వారిలో బస్తీల్లోనూ విక్రయిస్తున్న వారు అధికంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గంజాయి.. దొరకపోతే హషీష్‌ అయిల్‌ లేదా ఎండీఎంఏ ఇలా పదార్థాలు వేరైనా మత్తుకు అలవాటు పడుతున్నారని ఓ సీనియర్‌ పోలీసు అధికారి చెబుతున్నారు. తక్కువ ధరకు దొరకుతుండడం, రెండు మూడు బీర్లు.. మద్యం తాగే వారు కొంచెం మోతాదులో ఎండీఎంఏ తీసుకుంటే సరిపోతుందని ఏజెంట్లు చెప్పి వారికి మత్తు అలవాటు చేస్తున్నారని అంటున్నారు.


పోలీసుల కళ్లుగప్పి..

పబ్‌లు, కాఫీ షాపుల వద్ద డ్రగ్స్‌ అమ్మేవారిపై పోలీసులు దృష్టి సారించడంతో విక్రయదారులు రూటు మార్చారు. మధ్య తరగతి వారిని టార్గెట్‌ చేసి మధ్య శ్రేణి బార్లు, మద్యం పర్మిట్‌ రూంలు.. చివరికి కల్లు కాంపౌండ్‌ల వద్ద వ్యాపారం చేస్తున్నారు. ఆయా ప్రాంతాలలో హెరాయిన్‌, చరస్‌ లాంటి ఖరీదైన డ్రగ్స్‌ కాకుండా తక్కువ ధరకు దొరికే ఎండీఎంఏను అధికంగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. గత వారం జూబ్లీహిల్స్‌లో ఎండీఎంఏ విక్రయిస్తూ ముగ్గురు యువకులు దొరికారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. అంతకు ముందుకు శివారు ప్రాంతాల్లో నాలుగు కేసుల్లో పోలీసులు ఎంఈఎంఏను సీజ్‌ చేశారు. దీన్ని బట్టి డ్రగ్స్‌ ఏజెంట్లు బస్తీలను ఎంచుకున్నట్టు అర్థం అవుతోంది.


నాలుగంచెలుగా వ్యాపారం 

డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ట్రై కమిషనరేట్‌ పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. అయితే, వారి కళ్లుగప్పి వ్యాపారం విస్తరించాలనే కోణంలో వ్యాపారులు నాలుగు అంచెల్లో డ్రగ్స్‌ సరఫరా చేస్తూ తమ పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ పరిచయం కూడా లేని వారిని అమ్మకందారులుగా మార్చుకుంటున్నారు. మత్తుకు బానిసైన వారిని, ఉద్యోగం పోయి ఇబ్బందుల్లో ఉన్నవారిని, డిప్రెషన్‌ ఉన్న వారిని ఎంచుకొని  వారికి మత్తు అలవాటు చేసి.. చివరికి వారినే అమ్మకందారులుగా మారుస్తున్నారు.

Updated Date - 2022-02-28T16:10:00+05:30 IST