డ్రగ్స్‌.. గోవా టు సిటీ

ABN , First Publish Date - 2022-04-19T18:00:33+05:30 IST

ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొలిక్కి వస్తోంది. పబ్‌లో లభించిన డ్రగ్స్‌తో అభిషేక్‌, అనిల్‌కు సంబంధాలున్నట్లు పోలీసులు

డ్రగ్స్‌.. గోవా టు సిటీ

ఫుడింగ్‌ అండ్‌ మింక్‌కు ఎలా చేరాయి?

అభిషేక్‌, అనిల్‌లకు డ్రగ్స్‌తో సంబంధాలు

విచారణలో కీలక అంశాలను రాబట్టిన పోలీసులు


హైదరాబాద్‌ సిటీ: ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొలిక్కి వస్తోంది.  పబ్‌లో లభించిన డ్రగ్స్‌తో అభిషేక్‌, అనిల్‌కు సంబంధాలున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో మేనేజర్‌ సహా నలుగురు పబ్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అర్జున్‌, కిరణ్‌రాజ్‌ల కోసం గాలిస్తున్నారు. కిరణ్‌రాజ్‌ యూఎ్‌సలో ఉన్నట్లు గుర్తించారు. అర్జున్‌ను త్వరలోనే పట్టుకుంటామని బంజారాహిల్స్‌ పోలీసులు చెబుతున్నారు. రిమాండ్‌లో ఉన్న అభిషేక్‌, అనిల్‌కుమార్‌లను ఈనెల 14న కస్టడీలోకి తీసుకుని నాలుగు రోజుల పాటు విచారించారు. విచారణలో ఎన్నో విషయాలను రాబట్టినట్లు సమాచారం. నాలుగు రోజులు.. 40 గంటల పాటు వారిని విచారించినట్లు కోర్టుకు సమర్పించిన కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నట్లు తెలిసింది. 


పలు అంశాలపై విచారణ

కస్టడీ విచారణలో ప్రధానంగా పబ్‌లోకి ఎంత మేర డ్రగ్స్‌ తీసుకొచ్చారు, ఎవరెవరికి సరఫరా చేశారనే విషయాలను కూడా పోలీసులు రాబట్టినప్పటికీ వివరాలు బయటకు వెల్లడించలేదు. అయితే డ్రగ్స్‌ విక్రేతలు ఎవరినీ తాను సంప్రదించలేదని, డ్రగ్స్‌ ఎలా వచ్చాయో తనకు తెలియదని అభిషేక్‌ పోలీసులకు సమాధానమిచ్చినట్లు తెలిసింది. దీంతో అనిల్‌కుమార్‌ను కూడా ఇదే విషయమై ప్రశ్నించిన పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. పబ్‌లో లభించిన డ్రగ్స్‌ కొకైన్‌ అని నిర్ధారణ కావడంతో దర్యాప్తులో ట్విస్ట్‌ పెరిగింది. సరఫరాదారుల వెనక ఉన్న వారి వివరాలు సేకరించినట్లు తెలిసింది. కొకైన్‌ ఎక్కడెక్కడి నుంచి గోవాకు చేరింది.. గోవా నుంచి హైదరాబాద్‌కు, ఆ తర్వాత పబ్‌కు ఎలా చేరిందనే విషయాన్ని గుర్తించే ప్రయత్నాలు చేశారు. ఎంత డ్రగ్స్‌ వచ్చింది, ఆ రోజు రాత్రి ఎవరెవరు ఎంత తాగారనే అంశాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. విచారణలో రాబట్టిన విషయాలను కోర్టుకు సమర్పించినప్పటికీ, మరో రెండు రోజుల్లో పూర్తి విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఆ పబ్‌లో జరిగిన వివిధ పార్టీల్లో డ్రగ్స్‌ వినియోగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ దిశలో కూడా పోలీసుల విచారణ సాగింది.


‘పోలీసుల తనిఖీలు ఉండవు. 24 గంటలూ మద్యం, ప్రత్యేక ఆర్డర్‌పై డ్రగ్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి’ అని పబ్‌ నిర్వాహకులు ప్రచారం చేశారనే అంశాలు వెలుగులోకి రావడంతో దానిపై పోలీసులు కస్టడీలో ఆరా తీశారు. నమ్మకస్తులైన సభ్యులతో క్రియేట్‌ చేసిన వాట్సాప్‌ గ్రూప్‌ సమాచారాన్నీ సేకరించారు. మేనేజర్‌ అనిల్‌, నిర్వాహకుడు అభిషేక్‌ల ఫోన్‌లను కూడా పోలీసులు పరిశీలించి కీలక డేటాను సేకరించినట్లు తెలిసింది. కస్టడీ ముగిసిన తర్వాత పబ్‌ నిందితులను తిరిగి రిమాండ్‌కు తరలించగా, వారి బెయిల్‌ కోసం తిరిగి ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలిసింది. 


రెండు సార్లు విదేశాలకు..

గతేడాది కాలంలో కుటుంబీకులతో కలిసి ఫుట్‌బాల్‌, ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూడటానికి రెండు సార్లు విదేశాలకు వెళ్లి వచ్చానని అభిషేక్‌ పోలీసులకు వెల్లడించాడు. పబ్‌లో ప్రవేశం నిమిత్తం ఎన్నో ఫోన్‌లు వస్తుంటాయని, అందరినీ అనుమతించడం సాధ్యం కాదని, హై ప్రొఫైల్స్‌ ఉన్న వారి కోసం మాత్రమే వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశానని పోలీసులకు వెల్లడించాడు. అభిషేక్‌కు సంబంధించి మూడేళ్ల కాల్‌ డేటాను పోలీసులు పరిశీలించారు. ఏడు నెలలుగా పబ్‌ను లీజుకు తీసుకుని నడుపుతున్నట్లు పోలీసులకు వివరించాడు. వయసు, ధ్రువీకరణ పత్రాలు చూసి అనుమతి ఇచ్చినప్పటికీ, తప్పుడు పత్రాలు తీసుకొస్తే తామేమీ చేయలేమని పేర్కొన్నట్లు తెలిసింది. 

Updated Date - 2022-04-19T18:00:33+05:30 IST