బెజవాడ-చెన్నై.. మత్తు మార్గం

ABN , First Publish Date - 2022-05-05T06:16:31+05:30 IST

బెజవాడ-చెన్నై మధ్య కొత్తగా ‘మత్తు’ మార్గం ఏర్పడిందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది.

బెజవాడ-చెన్నై.. మత్తు మార్గం

మొన్న హెరాయిన్‌.. నిన్న ట్రైడాల్‌.. నేడు ఎపిడ్రిన్‌..

మూడింటిలోనూ చెన్నైతో బెజవాడ లింక్‌లు


బెజవాడ-చెన్నై మధ్య కొత్తగా ‘మత్తు’ మార్గం ఏర్పడిందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ప్రైవేటు పోర్టుల ద్వారా హెరాయిన్‌ సముద్రాలు దాటి వచ్చిపడుతోంది. దాని చిరునామా విజయవాడగా గుర్తించినా, లింకు చెన్నైతోనే ఉన్నట్టు తేలింది. ఆ తరువాత యువతను మత్తులో ముంచుతున్న మరికొన్ని బలమైన లింక్‌లు ఈ ప్రాంతాల మధ్య వెలుగు చూస్తున్నాయి. చెన్నైలో మత్తులో జోగుతున్న యువతకు బెజవాడ నుంచే ట్రైడాల్‌ మందు బిళ్లలు సరఫరా అవుతున్నట్టు కొద్దికాలం క్రితం గుర్తించారు. తాజాగా ఇప్పుడు  ఎపిడ్రిన్‌ పొడిని పట్టుచీరల్లో పెట్టి విజయవాడ నుంచి విదేశాలకు పార్సిల్‌ చేసిన ఘటనలోనూ చెన్నై లింకు ఉన్నట్టు స్పష్టమయింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) :  యువతను మత్తులో ముంచుతున్న కొత్త లింక్‌లు బలపడుతున్నాయి. బెజవాడ మందుల షాపుల నుంచి ‘మత్తు’ బిళ్లలు తమిళ తంబీల చేతుల్లోకి వెళ్తున్నాయి. అక్కడ పొడిగా మారిన బిళ్లల మందు ఇక్కడి నుంచి పార్సిల్‌ అవుతోంది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రెండు వేల కిలోల హెరాయిన్‌తో పట్టుబడిన కంటైనర్‌ బెజవాడ చిరునామా చూపింది. సత్యనారాయణపురం చిరునామాతో సోలార్‌ పలకల కంపెనీని రిజిస్టర్‌ చేసుకుని, చెన్నై నుంచి వ్యాపార కలాపాలు నడుపుతున్న కుటుంబం ఈ కేసులో అరెస్టయింది. 


‘ట్రైడాల్‌’ బంధం

కొద్ది నెలల క్రితం ట్రైడాల్‌ మందు బిళ్లల సరఫరా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో బెజవాడతో చెన్నై లింక్‌లు బయటపడ్డాయి. చెన్నైలో ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థుల వద్ద ట్రైడాల్‌ మందు బిళ్లలను గుర్తించిన అక్కడి పోలీసులు వీటిని విక్రయిస్తున్న ముఠాలోని వ్యక్తులకు సంకెళ్లు వేసి విచారించగా, బెజవాడతో లింకు దొరికింది. ఈ మందు బిళ్లలను విజయవాడలో తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు ఆ ముఠా వెల్లడించింది. ఈ బిళ్లల్లో మత్తు లక్షణాలు ఉండడంతో కిక్‌ కోసం యువత వీటిని వాడేస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన ఔషధ నియంత్రణ మండలి అధికారులు విజయవాడలోని మూడు మెడికల్‌ షాపుల నుంచి బిల్లులు లేకుండా ఈ మందులను తమిళనాడుకు తరలిస్తున్నట్టు గుర్తించారు. 


ఇప్పుడిక ఎపిడ్రిన్‌

తాజాగా వెలుగు చూసిన ఎపిడ్రిన్‌ వ్యవహారంతో విజయవాడ, చెన్నైల మధ్య ఒక బలమైన డ్రగ్‌ లింక్‌ ఏర్పడినట్టు స్పష్టమయింది. పోలీసు, నిఘా వర్గాలు అదేమీ లేదని చెబుతున్నప్పటికీ వ్యవహారం చాప కింద నీరులా సాగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. వరుసగా వెలుగుచూస్తున్న మత్తు మందుల సరఫరా దీనికి ఉదాహరణ. చెన్నైకి చెందిన యువకుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కొండవీటి గోపీసాయి ఆధార్‌కార్డును మార్ఫింగ్‌ చేసి ఎపిడ్రిన్‌ పొడిని పట్టుచీరల్లో పెట్టి ఆస్ట్రేలియాకు పార్సిల్‌ చేసిన విషయం తెలిసిందే. స్టిక్కరింగ్‌లో పొరపాటు కారణంగా ఈ పార్సిల్‌ కెనడాకు, అక్కడి నుంచి బెంగళూరుకు వచ్చి కస్టమ్స్‌ అధికారుల కళ్లల్లో పడింది.  ఈ మొత్తం వ్యవహారం వెనుక చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఉన్నట్టు దర్యాప్తు బృందాలు నిర్ధారణకు వచ్చాయి. అయితే ఆ వ్యక్తి తెలుగువాడా?, తమిళుడా? అనేది అతడు దొరికితే గానీ తెలియదు. 


పచ్చళ్లతో ప్రారంభించి..

జనవరి 31వ తేదీన పట్టుచీరలను పార్సిల్‌ చేయడానికి ముందు ఆ వ్యక్తి మూడు, నాలుగుసార్లు ఆస్ట్రేలియాకు పచ్చళ్లు పార్సిల్‌ చేశాడని డీఎస్‌టీ కొరియర్‌ సర్వీసెస్‌ ఉద్యోగి గుత్తుల తేజ కస్టమ్స్‌ అధికారులకు వివరించాడు. ఆ వ్యక్తి నిజంగా ఊరగాయల్నే పార్సిల్‌ చేశాడా? లేక అందులోనూ ఎపిడ్రిన్‌ ఛాయలు ఉన్నాయా? అనేది మున్ముందు తేలుతుంది. బెంగళూరులో కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేసిన తేజకు సంబంధించిన డాక్యుమెంట్లు విజయవాడ పోలీసులకు అందాయి. 


ఆస్ట్రేలియా పార్సిల్‌ కోసం పదేపదే ఆరా

‘ఆస్ట్రేలియాకు పంపిన పార్సిల్‌ ఇంకా అందలేదు. ఎందుకు ఆలస్యమైంది?’ అంటూ ఎపిడ్రిన్‌ కేసులో కస్టమ్స్‌ అధికారులకు చిక్కిన గుత్తుల తేజను నిందితుడు పదేపదే ఆరా తీశాడు. జనవరి 31వ తేదీన భారతీనగర్‌లోని డీఎస్‌టీ కొరియర్‌ సర్వీసెస్‌ నుంచి పట్టుచీరల్లో ఎపిడ్రిన్‌ పెట్టి పార్సిల్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ పార్సిల్‌ అందలేదని ఆస్ట్రేలియాలో ఉన్న వ్యక్తి నిందితుడికి ఫోన్‌ చేయడంతో, చెన్నైలో ఉన్న నిందితుడు పలుమార్లు తేజకు ఫోన్‌ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్‌ కాల్స్‌  ఆధారంగానే నిందితుడు చెన్నైలో ఉన్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అదే సమయంలో తేజ కస్టమ్స్‌ అధికారుల చేతికి చిక్కాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నిందితుడు ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేశాడు. ప్రస్తుతం రెండు, మూడు బృందాలు నిందితుడి కోసం చెన్నైలో గాలిస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో నిందితుడు ఉపయోగించిన ఫోన్‌ నెంబర్‌ కీలకంగా మారింది. 

Read more