మామూళ్ల ‘మత్తు’..!

ABN , First Publish Date - 2022-04-04T08:15:07+05:30 IST

డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి’’ అని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించినా..

మామూళ్ల ‘మత్తు’..!

  • డ్రగ్స్‌ కట్టడిలో ఎక్సైజ్‌, పోలీసు శాఖలు విఫలం!
  • పబ్‌ల నిర్వాహకులతో దోస్తీ.. తనిఖీలకు దూరం
  • రంగంలో టాస్క్‌ఫోర్స్‌.. రాడిసన్‌ బ్లూపై దాడి
  • ఆదాయంపైనే ఎక్సైజ్‌ శాఖ ప్రధాన దృష్టి
  • స్వయానా మంత్రి చెప్పినా పబ్‌లలో తనిఖీలు నిల్‌
  • సీఎం ఆదేశించినా జాడ లేని ప్రత్యేక విభాగం
  • హైకోర్టు చెప్పినా ఈడీకి వివరాలివ్వని ఎక్సైజ్‌ శాఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ‘‘డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి’’ అని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించినా.. మత్తు పదర్థాల వినియోగాన్ని కట్టడి చేయడంలో పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు విఫలమవుతున్నాయి. ఏదైనా సంఘటన వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రం ఒకట్రెండ్రోజులు హడావుడి చేస్తూ.. ఆ తర్వాత తాపీగా తప్పుకొంటున్నాయి. ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఆదాయంపైనే దృష్టిసారిస్తుండడం.. పోలీసు శాఖలో కొందరు పబ్‌లు, క్లబ్‌ల నిర్వాహకులతో అంటకాగుతుండడంతో డ్రగ్స్‌పై తనిఖీల ఊసే ఉండడం లేదు. ఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని రాడిసన్‌-బ్లూ పబ్‌ వ్యవహారంలోనూ అదే జరిగింది. ఎలైట్‌ బార్‌కు లైసెన్స్‌ ఇచ్చిన ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలే చేయలేదు. సానిక పోలీసులు పబ్‌ యాజమాన్యంతో దోస్తీ కారణంగా అర్ధరాత్రి దాటినా హంగామాను ఆపలేదు. చివరికి పెట్రోలింగ్‌ సిబ్బంది కూడా నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించారు. చివరకు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ ఆధ్వర్యంలో పనిచేసే టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించాయి. అక్కడ జరుగుతున్న పార్టీలో 5 గ్రాముల కొకైన్‌ను కనుగొన్నాయి. స్థానిక పోలీసులకు ఈ వ్యవహారం తెలిసీ.. స్పందించలేదని నిర్ధారణ కావడంతో.. బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శివచంద్రపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఏసీపీ సుదర్శన్‌కు చార్జ్‌మెమో దాఖలైంది.



ఆదాయంపైనే ఎక్సైజ్‌ దృష్టి!

నార్కోటిక్స్‌ కట్టడిలో కీలకంగా వ్యవహారించాల్సిన ఎక్సైజ్‌ శాఖ ఆదాయంపైనే దృష్టి పెట్టింది. వైన్స్‌, బార్లకు లైసెన్సులివ్వడం, ఫీజు వసూలు చేయడం వరకే పరిమితమవుతోంది. సాధారణ, ఎలైట్‌ బార్లకు ఎక్సైజ్‌శాఖ లైసెన్సులిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,172 బార్లుండగా.. వాటిల్లో ఎలైట్‌ బార్ల వాటా 89. స్టార్‌ హోటళ్లు, బడా పబ్‌లలో ఎలైట్‌ బార్లే ఉంటాయి. సాధారణ బార్ల మాదిరిగా ఎలైట్‌ బార్లకు వేలాలు ఉండవు. సాధారణ బార్ల కంటే రెండింతలు ఎక్కువ లైసెన్స్‌ ఫీజు ఉంటుంది. దాంతో.. దరఖాస్తు చేయగానే, లైసెన్స్‌ ఫీజు వసూలు చేసి, అనుమతులు ఇస్తుంటారు. ఎలైట్‌ బార్లలో 24 గంటల పాటు మద్యానికి అనుమతి ఉంటుంది. అయితే.. ఆయా హోటళ్లలో బసచేసే వారికే 24 గంటలు మద్యం సరఫరా చేయాలి. బయటి వ్యక్తులను అనుమతించకూడదు. రాడిసన్‌ బ్లూలో బయటి నుంచి వచ్చిన వారే ఎక్కువ. వారందరికీ మద్యం అందజేశారు. ఎలైట్‌ బార్లలో జరిగే ఈ తంతును ఎక్సైజ్‌ పోలీసులు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు సాధారణ బార్లను తనిఖీ చేసినా.. వీటి జోలికి వెళ్లడం లేదు. ఇటీవలి సమీక్షలో పబ్‌లలో డ్రగ్స్‌ వినియోగంపై తరచూ తనిఖీలు చేయాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఆదేశించినా.. ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క తనిఖీ కూడ జరగలేదు. దీన్నిబట్టి పబ్‌లు, ఎలైట్‌బార్ల యాజమాన్యాలతో ఎక్సైజ్‌ అధికారులు మైత్రీబంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది.



ప్రత్యేక విభాగం ఊసే లేదు!

రాష్ట్రంలో డ్రగ్స్‌ కట్టడికి మెరికెల్లాంటి 1,000 మంది పోలీసు, ఎక్సైజు సిబ్బందితో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని మూణ్నెల్ల క్రితం సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మాత్రమే ఈ తరహా విభాగం ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్త ప్రత్యేక విభాగానికి సంబంధించి సీఎం కేసీఆర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి ఎలాంటి ప్రతిపాదనలను సమర్పించలేదని తెలిసింది.



దర్యాప్తులోనూ జాప్యమే!

కేసుల దర్యాప్తులోనూ పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు విఫలమవుతున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు దర్యాప్తులో ఎక్సైజ్‌ అధికారుల తీరుపైనా విమర్శలు వచ్చాయి. టాలీవుడ్‌ సెలబ్రిటీలను తప్పించే ప్రయత్నం చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. విషయం హైకోర్టుకు చేరింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. కేసు వివరాలను, ఆధారాలను ఈడీకి ఇవ్వాలని ఎక్సైజ్‌ అధికారులకు సూచించింది. అయినా.. ఎక్సైజ్‌ శాఖ పట్టించుకోలేదు. చార్జ్‌షీట్లు, కేసు వివరాలు మినహా.. ఆధారాలను అందజేయలేదు. హైకోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ నాలుగుసార్లు ఈడీ లేఖలు పంపినా ఎక్సైజ్‌శాఖ స్పందించలేదు. మూడు నెలల క్రితం నైజీరియాకు చెందిన టోనీతో సహా 13 మందిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశంలోని డ్రగ్‌ నెట్‌వర్క్‌క్‌ టోనీయే బాస్‌ అని, అతడి కనుసన్నల్లోనే అంతా జరుగుతుందని దర్యాప్తులో బయటకు వచ్చిందని పోలీసులు చెప్పారు. ఆ కేసును ప్రస్తుతం పోలీసులు పక్కకు పెట్టేశారు.

Updated Date - 2022-04-04T08:15:07+05:30 IST