టోనీ.. ఎవరిదో తొలి బోణీ..!

ABN , First Publish Date - 2022-01-29T16:11:26+05:30 IST

డ్రగ్స్‌ కేసులో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నిందితుల్లో సంపన్నులు ఉండడంతో పక్కా ఆధారాలు సంపాదిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్‌ కేసు...

టోనీ.. ఎవరిదో తొలి బోణీ..!

నేటి నుంచి విచారణ.. ఎవరి పేర్లు బయటికి వస్తాయో..

డ్రగ్స్‌ కేసులో ఆసక్తికర పరిణామాలు 

సీఎం ప్రకటనతో ఉత్సాహంగా విచారణాధికారులు


హైదరాబాద్‌ సిటీ: డ్రగ్స్‌ కేసులో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నిందితుల్లో సంపన్నులు ఉండడంతో పక్కా ఆధారాలు సంపాదిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్‌ కేసు నుంచి, జైలు నుంచి వాళ్లు బయట పడటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రగ్స్‌ ప్రధాన సరఫరాదారుడు టోనీని శనివారం నుంచి ఫిబ్రవరి 2 వరకు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. శనివారం జైలు నుంచి నేరుగా పంజాగుట్ట పీఎ్‌సకు తరలించి విచారించనున్నారు. విచారణలో టోనీ ఎవరి పేర్లు బయటపెడతాడో అనేది ఆసక్తిగా మారింది.


చాలా మంది పెద్దలు

కోర్టు అనుమతితో పోలీసులు ఐదు రోజుల పాటు టోనీని విచారించనున్నారు. విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని డీసీపీ చెప్పారు. చిక్కిన ఏడుగురు మాత్రమే కాకుండా చాలామంది పెద్దలు ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారెవరు అనేది టోనీ విచారణలో వెల్లడయ్యే అవకాశముంది. ఇప్పటికే గుర్తించిన మరో నలుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాల ద్వారా పోలీసులు గాలిస్తున్నారు. టోనీతో పాటు రిమాండ్‌లో ఉన్న బడాబాబులను కూడా పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు. 


ఎన్ని మలుపులో..?

డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు.. నైజీరియన్‌ కింగ్‌పిన్‌ టోనీని కస్టడీలోకి విచారించిన తర్వాత ఈ కేసు పలు మలుపులు తిరిగే అవకాశముంది. ఇప్పటికే మరో ఐదుగురు వ్యాపారవేత్తలను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారు హైదరాబాద్‌లో బడా పారిశ్రామిక వేత్తలుగా కొనసాగుతూ టోనీ నుంచి కొన్నేళ్లుగా డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ వ్యాపారవేత్తల పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. వ్యాపారులతో పాటు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు కూడా ఈ దందాలో ఉన్నట్లు సమాచారం. టోనీని పూర్తిస్థాయిలో విచారిస్తేనే ఆయా వివరాలు బయటకు వచ్చే అవకాశముంది. పేర్లు బయటికి వస్తే కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.


టోనీ నోరు విప్పితే..

ప్రధాన నిందితుడు టోనీ పోలీస్‌ కస్టడీలో వెల్లడించే విషయాలతో రాష్ట్రంలో కలకలం రేగుతుందని అఽధికారులే చెప్పుకోవడం విశేషం. ఇప్పటికే కొందరు సంపన్నులను జైలుకు పంపిన అధికారులకు సీఎం ఆదేశాలు బలమిచ్చినట్లు కనిపిస్తున్నాయి. డ్రగ్స్‌ వ్యవహారంలో ఎంతటి వారైనా ‘తగ్గేదేలే’ అని స్వయానా సీఎం హామీ ఇవ్వడంతో పోలీసులు మంచి ఊపులో ఉన్నారు. టోనీ నోరు విప్పితే చాలని అధికారులు భావిస్తున్నారు. టోనీని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటున్నారనే సమాచారంతో డ్రగ్స్‌తో లింకై ఉన్న సంపన్నులు, సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే, గత అనుభవాల దృష్ట్యా చివరి క్షణంలో అర్ధాంతరంగా దర్యాప్తు ఆగిపోతే పరిస్థితి ఏంటనే అనుమానాలు కూడా కొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-01-29T16:11:26+05:30 IST