డ్రగ్స్‌ కేసులో ముందుకు సాగేదెలా..!

ABN , First Publish Date - 2022-04-17T12:56:21+05:30 IST

బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూలోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసు దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే మారింది. నిందితులు సహకరించకపోవడంతో

డ్రగ్స్‌ కేసులో ముందుకు సాగేదెలా..!

సహకరించని నిందితులు

నేటితో ముగియనున్న కస్టడీ

పరారీలోనే ఇంకా ఇద్దరు


హైదరాబాద్/బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూలోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసు దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే మారింది. నిందితులు సహకరించకపోవడంతో ఈ కేసును కొలిక్కి తీసుకురావడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. పబ్‌పై దాడులు, నిందితుల అరెస్టు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ  అవి కేసుకు బలాన్ని ఇచ్చేలా లేకపోవడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఈ నెల 3న ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ పై దాడి జరిగిన తర్వాత నిర్వాహకుడు అభిషేక్‌, మేనేజర్‌ అనిల్‌ను అరెస్టు చేసిన పోలీసులు డెస్క్‌ మీద ఉన్న ఐదు మిల్లిగ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా పబ్‌లో భాగస్వాములుగా ఉన్న కిరణ్‌రాజ్‌, వీరమాచినేని అర్జున్‌ పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పదిరోజులు పూర్తవుతున్నా ఇంకా వారి ఆచూకీ దొరకలేదు. మరోపక్క రిమాండ్‌లో ఉన్న నిందితులను కోర్టు అనుమతితో నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదని విచారణాధికారులు భావించారు. కానీ, మూడు రోజులపాటు సాగిన విచారణలో ఎటువంటి కీలక అంశాలు వెలుగులోకి రాలేదు. కస్టడీకి మరోరోజు మాత్రమే మిగిలి ఉంది. కనీసం చివరి రోజైనా ఈ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయా? అన్నది ఆసక్తిగా మారింది.


ప్రశ్నలే అధికం..

ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ పై దాడి కలకలం సృష్టించింది. కేసు నమోదు అయినప్పటి నుంచి పలు ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించడంలో చూపించిన వేగం అందుకు తగ్గ సాక్ష్యాలను సంపాదించడంలో చూపించలేదని ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. పబ్‌లో డ్రగ్‌ పార్టీ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పబ్‌లోని మొదటి అంతస్తులోని బాత్‌రూం వద్ద డ్రగ్స్‌ వినియోగం జరిగినట్టు కొన్ని ప్లాస్టిక్‌ కవర్లు దొరికాయి. ఈ డ్రగ్స్‌ పబ్‌కు ఎలా వచ్చాయి అనేది మాత్రం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. పబ్‌పై దాడి జరిగిన సమయంలో పోలీసులు సీసీ కెమెరాలను బంద్‌ చేయించారు. ఇప్పుడు ఇదే పెద్ద తప్పిదంగా మారింది. 


పార్టీకి వచ్చిన వారే డ్రగ్స్‌ తెచ్చుకొని ఉంటారని నిందితులు పోలీసులకు చెబుతున్నారు. పోలీసులను చూసి వారు డ్రగ్స్‌ను డెస్క్‌ మీదకు విసిరేసి ఉంటారని అంటున్నారు. అయితే, డ్రగ్స్‌ విసిరింది ఎవరా అనే దానిపై స్పష్టత రావాలంటే సీసీ కెమెరాలు పనిచేస్తేనే సాధ్యం అయ్యేదనేది కొందరు అధికారులు చెబుతున్నారు. పబ్‌లో పనిచేసే సిబ్బందిలో ఎవరైన డ్రగ్స్‌ తెచ్చి అమ్మినా ఆశ్చర్యపోనవసరం లేదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. కానీ, సిబ్బందిని ఇప్పటి వరకు పోలీసులు ప్రశ్నించలేదు. కేసు ముందుకు వెళ్లడానికి కావాల్సిన ముఖ్యమైన ప్రశ్నలకే ఇంత వరకు జవాబు లభించలేదు.

Updated Date - 2022-04-17T12:56:21+05:30 IST