మరో మరక

ABN , First Publish Date - 2022-05-02T06:06:05+05:30 IST

మరో మరక

మరో మరక

బెజవాడను వీడని వరుస డ్రగ్‌ కేసులు

2020లో ఎండీఎంఏ పేరిట కలకలం

2021లో సత్యనారాయణపురం చిరునామాతో హెరాయిన్‌

తాజాగా డీఎస్‌టీ కొరియర్‌ ద్వారా ఎపిడ్రిన్‌ డ్రగ్‌ సరఫరా

బెంగళూరులో నగర కొరియర్‌ బాయ్‌ అరెస్టు

తెరవెనుక సూత్రధారులపై పోలీసుల కన్ను


2020లో సూడాన్‌ దేశానికి చెందిన మహ్మద్‌ గహేల్‌ రసూల్‌, టాంజానియా దేశానికి చెందిన యోనా లిస్వా షబానీతో పాటు కామయ్యతోపు గ్రామానికి చెందిన కోనేరు అర్జున్‌ మాదకద్రవ్యాలతో పట్టుబడ్డారు. వారి నుంచి 17 గ్రాముల ఎండీఎంఏ (మెథలైన్‌ డయాక్సీ మెథాంఫేటమిన్‌) డ్రగ్‌, 15 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రసూల్‌, షబానీలు వడ్డేశ్వరంలో ఉన్న యూనివర్సిటీలో ఉన్నత విద్య నిమిత్తం వచ్చారు. వారిద్దరి పాస్‌ పోర్టులను పోలీసులు సీజ్‌ చేశారు. కేసు కోర్టు విచారణలో ఉంది. 

గత ఏడాది సత్యనారాయణపురంలోని చిరునామాతో సోలార్‌ ప్లేట్స్‌ వ్యాపారం చేసే వ్యాపారి పేరున ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి హెరాయిన్‌ కంటైనర్‌ ముంద్రా పోర్టుకు వచ్చింది. అక్కడి అధికారులు దాన్ని సీజ్‌ చేసి, ఇక్కడ తనిఖీలు చేపట్టడంతో నగరం పేరు దేశస్థాయిలో మార్మోగింది. విజయవాడలో ఎలాంటి మాదకద్రవ్యాలు లేవని పోలీసులు చెప్పినా చిరునామా విజయవాడలో ఉండటం కలకలం రేపింది. 

తాజాగా భారతీనగర్‌ కేంద్రంగా నడుస్తున్న డీఎస్‌టీ (డొమెస్టిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కొరియర్స్‌) నుంచి కెనడాకు వెళ్లిన ఎపిడ్రిన్‌ డ్రగ్‌ను బెంగళూరులో కస్టమ్స్‌ అధికారులు పట్టుకోవడం కలకలం రేపింది.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఈ ఘటనల వెనుక నిజానిజాలేమో గానీ, విజయవాడను మాత్రం డ్రగ్స్‌ కేసులు వీడిపోవట్లేదు. తాజాగా 4 కిలోల ఎపిడ్రిన్‌ కొరియర్‌ ద్వారా వెళ్లడం, బెంగళూరు కస్టమ్స్‌ అధికారులు శనివారం రాత్రి ఓ యువకుడిని అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది.

అనుమానాలెన్నో.. 

కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన గుత్తుల తేజ ఇక్కడ డీఎస్‌టీ కొరియర్‌లో పనిచేస్తున్నాడని పోలీసులు చెప్పారు. అసలు ఈ కొరియర్‌ను ఎవరు ఫ్రాంచైజీ తీసుకున్నారో తెలియలేదు. ఇక్కడ బుక్‌ అయిన కొరియర్లన్నీ హైదరాబాద్‌లో ఉంటున్న వరల్డ్‌ ఫస్ట్‌ కొరియర్‌కు పంపుతారు. అక్కడి నుంచి ఆయా దేశాలకు పంపుతారు. తేజ.. డీఎస్‌టీ కొరియర్‌లో రూ.13వేల వేతనానికి పనిచేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఒక రేకుల షెడ్‌ వంటి ఇంట్లోని గదిలో కొరియర్‌ బాక్సులను పెట్టి నడుపుతున్నారు. ఈ కొరియర్‌ రోజూ పనిచేయట్లేదని స్థానికుల కథనాన్ని బట్టి తెలుస్తోంది. తేజ కొన్ని కవర్లు గానీ, బాక్సులు గానీ తీసుకెళ్లడానికి వారం, పది రోజులకు ఒకసారి వస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. కొరియర్‌ ముసుగులో ఎపిడ్రిన్‌ పంపినట్టు ఇప్పుడు తేలింది. ఇంతకుముందు ఇలా చేశాడా, లేదా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కొండవీడు గోపీసాయి అడగగానే తేజ తన ఆధార్‌కార్డు, చిరునామా ఇచ్చాడని, దాని ప్రకారం బెంగళూరు కస్టమ్స్‌ అధికారులు అతడ్ని అరెస్టు చేశారని పోలీసులు చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఎంత అన్నది తేలాలి. కొరియర్‌ బుక్‌ చేయడం ద్వారా పరిచయమైన వ్యక్తికి తన ఆధార్‌కార్డును తేజ ఎందుకు ఇచ్చాడన్న సందేహం కలుగుతోంది. గోపీసాయి నుంచి తేజకు కమీషన్లు ఏమైనా ముట్టాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే వాస్తవమైతే ఎపిడ్రిన్‌ను ఎగుమతి చేయడానికి ఇద్దరూ కలిసి కొరియర్‌ మార్గాన్ని ఎంచుకున్నారని తేలింది. ఆస్ట్రేలియాకు బుక్‌ చేసిన కొరియర్‌ కెనడాకు ఎందుకు వెళ్లిందో తెలియట్లేదు. స్టిక్కరింగ్‌ తప్పుగా ఉండడం వల్ల జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కొరియర్‌ వెళ్లడం, తిరిగి రావడం ఇలా ఒకే పార్శిల్‌పై మూడు నాలుగు స్టాంపులు ఉండటంతో కస్టమ్స్‌ అధికారులు దీనిపై కన్నేశారు. తెరిచి చూస్తే తెల్లని ఎపిడ్రిన్‌ పొడి 4.496 కిలోలు కనిపించింది. 

Updated Date - 2022-05-02T06:06:05+05:30 IST