మా పిల్లలకు సంబంధం లేదు

ABN , First Publish Date - 2022-04-04T08:24:00+05:30 IST

బంజారాహిల్స్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో జరిగిన రేవ్‌ పార్టీలో ప్రముఖుల పిల్లలు ఉన్నారని మీడియాలో ..

మా పిల్లలకు సంబంధం లేదు

‘డ్రగ్స్‌’పై ప్రముఖుల స్పందన

నిహారిక విషయంలో ఏ తప్పూ లేదు: నాగబాబు

ఏ పరీక్షకైనా సిద్ధం: రాహుల్‌  


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): బంజారాహిల్స్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో జరిగిన రేవ్‌ పార్టీలో ప్రముఖుల పిల్లలు ఉన్నారని మీడియాలో ప్రచారం కావడంతో కొందరు ప్రముఖులు స్పందించారు. పబ్‌లో తమ పిల్లలు లేరని, వారికి డ్రగ్స్‌ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం ప్రముఖ సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక పోలీ్‌సస్టేషన్‌ నుంచి బయటకు వెళుతూ కనిపించారు. అయితే రేవ్‌ పార్టీకి తన కుమార్తె నిహారిక వెళ్లిన విషయాన్ని నాగబాబు అంగీకరిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. పరిమిత సమయాన్ని మించి పబ్‌ నడిపినందువల్లే పోలీసులు పబ్‌పై చర్యలు తీసుకున్నారని ఆయన చెప్పారు. నిహారిక విషయంలో ఎటువంటి తప్పూ లేదని పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు.


ఏ పరీక్షకైనా సిద్ధం: రాహుల్‌ సిప్లిగంజ్‌  

ఓ పుట్టినరోజు వేడుకలో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి తాను ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌కు వెళ్లానని గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కి తెలిపారు. పబ్‌ నుంచి తాను బయటకు వచ్చేటప్పుడు సోదాలు జరిగాయని, పోలీసులు తనను కౌన్సెలింగ్‌ చేసి వివరాలు తీసుకున్నారని చెప్పారు. డ్రగ్స్‌ తో తనకు సంబంధం లేదని, ఏ టెస్ట్‌ చేయించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు వెళ్తానని అన్నారు. 150 మందిలో ఒకరిద్దరు చేసిన తప్పు వల్ల అందరూ ఇబ్బంది పడ్డామన్నారు.  


మాపై అసత్య ప్రచారం: అంజన్‌కుమార్‌

హోటల్‌ రాడిసన్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో పాల్గొనేందుకే తన కుమారుడు వెళ్లాడని, అయితే డ్రగ్స్‌ పార్టీకి, తన కుమారుడికి సంబంధం లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. కావాలనే తన  కుమారుడిపై అభాండాలు వేస్తున్నారన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. 


నా కుమార్తెపై ఆరోపణలు అవాస్తవం: రేణుక 

ఫుడింగ్‌ అండ్‌ మింక్‌  పబ్‌పై పోలీసుల సోదాలకు సంబంధించి తన కుమార్తె తేజస్వినీ చౌదరిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. పోలీసులు తమ సోదాల్లో భాగంగా తేజస్వినిని అదుపులో తీసుకుని ప్రశ్నించినట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. తన కుమార్తె పుడింగ్‌ అండ్‌ మింక్‌ల యజమాని కాదని, వాటి స్థాపనలోనూ ఆమెకు భాగం లేదని చెప్పారు.  


కేటీఆర్‌ కనుసన్నల్లోనే పబ్బులు: మహేశ్‌ గౌడ్‌

మంత్రి కేటీఆర్‌ కనుసన్నల్లోనే హైదరాబాద్‌లో పబ్బులు నడుస్తున్నాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ అన్నారు. ఆయన అండతోనే డ్రగ్స్‌ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతోందన్నారు. మంత్రి కేటీఆర్‌ అదేపనిగా గోవా ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. ఆదివారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారన్న అనుమానం ప్రజల్లో ఉందని, దాన్ని నివృత్తి చేసేందుకు ఆయన నమూనాలు ఇవ్వాలన్నారు.


బంజారాహిల్స్‌ ఠాణా కిటకిట

బంజారాహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌ ఆదివారం జనజాతరగా మారింది. రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ సేవించారనే అనుమానంతో 148 మంది అనుమానితులను పోలీసులను అదుపులోకి తీసుకొని శనివారం రాత్రి 2 గంటలకు ఠాణాకు తరలించారు. వారిచ్చిన సమాచారంతో అనుమానితుల స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీడియా ప్రతినిధులు పోలీ్‌సస్టేషన్‌ వద్దకు భారీగా చేరుకున్నారు. పబ్‌ నుంచి తీసుకువచ్చిన వారిని స్టేషన్‌ లోపలే ఉంచి విచారించారు. అదుపులోకి తీసుకున్న వారి వివరాలు సేకరించి పంపించి వేశారు.

Updated Date - 2022-04-04T08:24:00+05:30 IST