Abn logo
Sep 20 2021 @ 23:59PM

ఈఎ్‌సఐలో మందులు ఖాళీ

ఈఎ్‌సఐ ప్రాంతీయ కార్యాలయం

250 రకాల మందులు రావాల్సి ఉంటే...

వచ్చింది 50 రకాల మందులే

ఇండెంట్‌ పంపినా..సరఫరా చేయని కాంట్రాక్ట్‌ కంపెనీలు


కడప(ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 20: ఈఎ్‌సఐ ఆస్పత్రులలో మందుల కొరత ఏర్పడింది. ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో మందులు సరఫరా చేయమని కంపెనీలు తెగేసి చెప్తున్నాయి. దీంతో అవసరమైన మందులు అందక కార్మికులు, ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. వ్యాధులు నయం చేసుకునేందుకు బయట మార్కెట్‌లో మందులు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, రైల్వేకోడూరులలో ఈఎ్‌సఐ డిస్పెన్సరీ ఆస్పత్రులు ఉండగా ముద్దనూరులో ప్యానెల్‌ క్లినిక్‌ ఉంది. ఇక్కడ రోజూ సుమారు 500లకు పైగా కార్మికులు వైద్య సేవల కోసం వస్తుంటారు. జిల్లాలో మొత్తం 19,868 మంది కార్మికులు ఉన్నారు. ఒక్కో కుటుంబంలో నలుగురు సభ్యులను కలుపుకుంటే మొత్తం సభ్యుల సంఖ్య సుమారు లక్ష చేరుకుంటుంది. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆయా సంస్థలు తమ ఈఎ్‌సఐ వాటాను చెల్లిస్తాయి. దీంతో కార్మికుల కుటుంబ సభ్యులకు ఈఎ్‌సఐ డిస్పెన్సరీ, ప్యానెల్‌ క్లినిక్‌లో వైద్య సేవలు అందిస్తుంటారు. కడప కేంద్రంగానే కడప, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురాలకు చెందిన ఈఎ్‌సఐ జాయింట్‌ ప్రాంతీయ కార్యాలయం ఉంది. 28 డిస్పెన్సరీలు ఆదోని, తిరుపతిలో ఆస్పత్రులు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఉన్నాయి. వైద్యుల లెక్క ప్రకారం ఆస్పత్రులు, డిస్పెన ్సరీలకు ఒక్కో దానికి రోజుకు 100 నుంచి 150 మంది ఈఎ్‌సఐ కార్డు కలిగిన కార్మికులు చికిత్స కోసం వస్తుంటారు. డిస్పెన్సరీలకు అవసరమైన మందుల ఇండెంట్‌ను కడప జేడీ కార్యాలయం నుంచే విజయవాడ కార్యాలయానికి పంపిస్తుంటారు. ఏఏ మందులు అవసరమో వాటిని అక్కడి నుంచి డిస్పెన్సరీలకు సరఫరా చేస్తారు.


మందుల కొరత 

ప్రభుత్వం మందులు సరఫరా చేసే కంపెనీలకు బకాయిలు చెల్లించడం లేదు. దీంతో కంపెనీలు ఈఎ్‌సఐ ఆస్పత్రులకు అవసరమైన మందులను సరఫరా చేయడం లేదు. మూడు నెలలకు ఓ సారి ఆస్పత్రులకు అవసరమైన మందుల ఇండెంట్‌ను జేడీ ద్వారా విజయవాడలోని డైరెక్టర్‌కు పంపిస్తుంటారు. 250 రకాల మందులను డాక్టర్లు ఇండెంట్‌ పెడుతుంటారు. దీర్ఘకాలిక వ్యాధుల మందులతో పాటు బీపీ, షుగర్‌, లివర్‌ , కిడ్నీ, గుండె సంబంధిత తదితర వ్యాధులకు సంబంధించి మందులు తెప్పిస్తుంటారు. అయితే ప్రభుత్వం కంపెనీలకు పాత బకాయిలు ఇవ్వకపోవడంతో మందుల సరఫరా నిలిచిపోయింది. 250 రకాల మందులకు గాను ఇప్పుడు కేవలం 50 రకాలు మాత్రమే వస్తున్నాయి. 


కార్మికులకు భారంగా..

చాలా మంది కార్మికులు అరకొర జీతాలు, సంపాదనతోనే కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఏదైనా జబ్బుచేస్తే ఈఎ్‌సఐ కార్డుతో చికిత్స చేయించుకోవచ్చనే భరోసా కార్మిక కుటుంబాలకు ఉంటుంది. కార్మికులతో పాటు పిల్లలు, తల్లిదండ్రులకు ఉపయోగంగా ఉండేది. అయితే ఈఎ్‌సఐ డిస్పెన్సరీలో కూడా మందులు కొరత ఉండడం కార్మికులను కలవరపాటుకు గురిచేస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మందులు ఇంజెక్షన్ల కోసం సుమారు రూ.2 నుంచి రూ.3 వేల విలువ చేసే మందులను ఉపయోగిస్తుంటారు. వీరు క్రమం తప్పకుండా రోజూ మందులు వేసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈఎ్‌సఐలో మందుల కొరతద కారణంగా బయట మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిరావడం కార్మికుల కుటుంబాలకు భారంగా మారుతోంది. 


త్వరలోనే మందుల కొరత తీరుతుంది

- రవికుమార్‌, జాయింట్‌ డైరెక్టర్‌, ఈఎ్‌సఐ ప్రాంతీయ కార్యాలయం 

ఈఎ్‌సఐ ఆస్పత్రుల్లో, డిస్పెన్సరీల్లో త్వరలోనే మందుల కొరత తీరుతుంది. బకాయిల కారణంగా కొన్ని కంపెనీలు మందుల సరఫరా చేయలేదు. ఇటీవలనే డైరెక్టర్‌ కంపెనీలకు డబ్బులు చెల్లించారు. దీంతో త్వరలోనే అవసరమైన మందులు అందుబాటులోకి వస్తాయి.