డ్రగ్గాంధ్రప్రదేశ్‌!

ABN , First Publish Date - 2022-05-04T08:29:03+05:30 IST

డ్రగ్గాంధ్రప్రదేశ్‌!

డ్రగ్గాంధ్రప్రదేశ్‌!

మత్తుకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారుతున్న రాష్ట్రం

రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోన్న మత్తు వ్యాపారం

అఫ్ఘాన్‌ నుంచి వేల టన్నులు విజయవాడకు బుకింగ్‌

ఆస్ట్రేలియా పంపిన పార్శిల్‌ బెజవాడ నుంచే ఎగుమతి

హైదరాబాద్‌, గోవా నుంచి విశాఖకు ఎండీఎంఏ సరఫరా

చెన్నై పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్‌ మూలాలు ఒంగోలులో


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

స్వర్ణాంధ్రప్రదేశ్‌..నవ్యాంధ్రప్రదేశ్‌గా పిలిపించుకున్న ఏపీ ఇప్పుడు డ్రగ్గాంధ్ర, మత్తాంధ్రగా అపఖ్యాతిని మూటగట్టుకుంటోంది. మత్తుకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారుతోంది. డ్రగ్స్‌ సరఫరా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. పొరుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లో డ్రగ్స్‌ పట్టుబడితే ఏపీలోని ఏదో ఒక ప్రాంతంతో లింకు వెలుగులోకి వస్తోంది. విశాఖపట్నంలో 2019లో జరిగిన ఒక రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ వినియోగం బయటికి వచ్చింది. ఆ తర్వాత విజయవాడ, తిరుపతి, గుంటూరు, కాకినాడ, ఒంగోలులో పట్టుబడ్డ డ్రగ్స్‌ కేసు ల్లో పొరుగు రాష్ట్రాలతో లింకులు బయట పడ్డా యి. విశాఖలో ఇటీవల తరచూ డ్రగ్స్‌ పట్టుబడుతుండగా విజయవాడలోనూ మత్తు మాఫియా విస్తరిస్తోంది. అఫ్ఘానిస్థాన్‌ వంటి దేశాల నుంచి కంటైనర్ల ద్వారా వేల కోట్ల రూపాయల డ్రగ్స్‌ బుక్‌ చేయడంతో గతేడాది విజయవాడ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ముంద్రా పోర్టులో సీజైన టన్నుల కొద్దీ మత్తు పౌడర్‌ విజయవాడలోని సత్యానారాయణపురం అడ్రస్‌ నుంచి బుక్‌ చేయడమే అందుకు కారణం. అదే సమయంలో దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా విశాఖ మన్యం నుంచి వస్తున్నట్లు ఆయా ప్రాంతాల పోలీసులు మీడియాకు వెల్లడించడం రాష్ట్ర ప్రభ మసకబారేలా చేసింది. మార్చి రెండో వారంలో చెన్నై పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 70 లక్షల విలువైన డ్రగ్స్‌ సీజ్‌ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకున్న మహమ్మద్‌ ఏపీలోని ఒంగోలు ప్రాం తంలో విక్రయించేందుకు 230 గ్రామలు ఎండీఎంఏ తీసుకెళ్లినట్లు పసిగట్టారు. ఒంగోలు పారిశ్రామిక ప్రాంతంలో రమేశ్‌ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ఆ డ్రగ్స్‌ ఉన్నట్లు తెలుసుకుని చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వెంకటరెడ్డి అనే కెమిస్ట్‌ పాత్ర బయటపడటంతో అరెస్టు చేయగా మలేసియా, సింగపూర్‌తో వ్యాపార సంబంధాలున్నట్లు వెలుగులోకి వచ్చింది. విశాఖలో ఏప్రిల్‌ 14న ముగ్గురు విద్యార్థుల నుంచి 53గ్రాములు ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసి గ్రాము రూ.2 వేల నుంచి రూ.5వేల వరకూ విశాఖలోని విద్యార్థులకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. దానికి వారంరోజుల ముందు అచ్యుతాపురంలోని ఒక రిసార్ట్‌ లో పోలీసులు సోదాలు చేపట్టి నలుగురు యువకులను అదుపులోకి తీసుకు ప్రశ్నించగా ఎండీఎంఏ వ్యవహారం బయట పడి ంది. గోవాలో ఉంటున్న జాన్సన్‌, జోయ, నీరజ్‌ ద్వారా విశాఖకు డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్లు తేలింది. జనవరి 31న విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ ప్రాంతంలో ఒక కారులో 18 ప్యాకెట్లలో ఎండీఎంఏ లభించింది. స్థానికులైన హేమంత్‌ కుమార్‌, పృథ్వీరాజ్‌, హైదరాబాద్‌కు చెందిన గంటా మాలవ్య, గీతాంజలి అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. తమకు గీతాంజలి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు హేమంత్‌ వెల్లడించాడు.


ఐదో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌.. 

దేశంలో మత్తు బారి న పడిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ఐదో స్థానంలో ఉన్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ తెలిపారు. మత్తు ప్రభావంతో ప్రాణాలు కోల్పోతున్న యువతలో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, తమిళనాడు తర్వాత మన రాష్ట్రమే ఉన్నట్లు గతేడాది కేంద్ర హోంశాఖ విడుదల చేసిన జాతీయ నేర గణాంకాల్లో స్పష్టమైంది.


ఆంధ్రా విద్యార్థుల పాత్ర వెలుగులోకి..

ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో పట్టుబడుతున్న డ్రగ్స్‌ కేసుల్లో మన రాష్ట్రానికి చెందిన విద్యార్థుల పాత్ర వెలుగులోకి వస్తూనే ఉంది. విశాఖపట్నానికి హైదారాబాద్‌ యువతి ఖరీదైన కారులో డ్రగ్స్‌ సరఫరా చేసినా.. ఒంగోలు పారిశ్రామిక ప్రాంతంలో గుట్టును చెన్నై పోలీసులు ఛేదించినా.. గోవా స్మగ్లర్‌ జాన్సన్‌ అయినా.. బెంగళూరులో బయటపడ్డ మరో వ్యవహారమైనా ఏపీ విద్యార్థుల పేరు బయట పడుతూనే ఉంది. తాజాగా విజయవాడలో వెలుగులోకొచ్చిన నాలుగున్నర కిలోల డ్రగ్స్‌ వ్యవహారంలోనూ సత్తెనపల్లికి చెందిన వ్యక్తి పాత్ర బయటికి రావడం వెనుక సూత్రధారులెవరనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. 


ఆదేశాలకు.. అమలుకు పొంతనేదీ.?

రాష్ట్రంలో మత్తుపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్‌ ఇటీవల హోంశాఖ సమీక్షలో ఆదేశించడంతో పోలీసు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) చర్యలు మొదలయ్యాయి. గంజాయి భారీగా సీజ్‌ చేసిన పోలీసులు విశాఖ జిల్లాలో తగుల బెట్టారు. ఇదే ఊపుతో డ్రగ్స్‌ కట్టడికి సెబ్‌ శ్రమిస్తుందని, ఎంతవరకూ ఈ మత్తు వ్యాపించిందో తేలుస్తుందని అనుకున్నారు. అయితే ఎస్‌పీవోలను తొలగించడం నుంచి వాహనాల విత్‌ డ్రా, జిల్లాల అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉంచిన వైసీపీ ప్రభుత్వం కమిషనర్‌ పోస్టు సైతం భర్తీ చేయక పోవడంతో అంతా నీరుగారి పోయింది. 

Read more