మందుల అమ్మకాల్లో నిబంధనలకు నీళ్లు

ABN , First Publish Date - 2022-05-21T06:50:07+05:30 IST

ఫోర్ట్విన్‌, బట్రామ్‌, నైట్రోసన్‌, క్లానోజెఫామ్‌, డైజీఫామ్‌, జోల్ఫి డామ్‌...ఇవన్నీ మత్తు కలిగించే ఇంజక్షన్లు, టాబ్లెట్లు.

మందుల అమ్మకాల్లో నిబంధనలకు నీళ్లు

నగరంలో ఇష్టానుసారంగా అమ్మకం

ప్రిస్కిప్షన్‌ లేకుండానే  మత్తును కలిగించే మందులను

ఇచ్చేస్తున్న మెడికల్‌ షాపుల నిర్వాహకులు

కొన్ని రకాల ఇంజక్షన్లు, టాబ్లెట్లు వినియోగిస్తున్న యువత

దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం

దృష్టి సారించని ఔషధ నియంత్రణ అధికారులు 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 


ఫోర్ట్విన్‌, బట్రామ్‌, నైట్రోసన్‌, క్లానోజెఫామ్‌, డైజీఫామ్‌, జోల్ఫి డామ్‌...ఇవన్నీ మత్తు కలిగించే ఇంజక్షన్లు, టాబ్లెట్లు.  వీటి విక్రయంలో మందుల దుకాణాల యజమానులు కొన్ని నిబంధనలు పాటించాలి. వైద్యుడు ప్రిస్కిప్షన్‌ ఉంటేనే అమ్మాలి. కానీ నగరంలోని కొంతమంది నిర్వాహకులు ఎటువంటి ప్రిస్కిప్షన్‌ లేకపోయినా ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తున్నారు. 

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొద్దిరోజుల కిందట భీమిలిలో నిర్వహించిన దాడుల్లో ఓ వ్యక్తి వద్ద 200 ఫోర్ట్విన్‌ యాంపిల్స్‌ లభ్యమయ్యాయి. ఆపరేషన్ల సమయంలో మత్తు కోసం ఉపయోగించే ఈ ఇంజక్షన్లను అడ్డదారిలో యువతకు విక్రయిస్తున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. సాధారణంగా ఈ టాబ్లెట్లు, ఇంజక్షన్లను కొన్నిరకాల నొప్పులు, మానసిక సమస్యలతో బాధపడే వారికి చికిత్సలో భాగంగా వినియోగిస్తుంటారు. అయితే, వ్యసనాలకు బానిసలైన కొందరు వీటిని మత్తు కోసం వాడుతున్నారు.


వైద్యుడి ప్రిస్కిప్షన్‌ తప్పనిసరి

మత్తు కలిగించే ఇంజక్షన్లు, టాబ్లెట్లు విక్రయించాలంటే మెడికల్‌ స్టోర్స్‌ నిర్వాహకులు కొన్ని నిబంధనలను పాటించాలి. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో రిజిస్టర్‌ అయిన వైద్యుడు ప్రిస్కిప్షన్‌ ఉంటేనే అమ్మాలి. ఈ మందులను ఎవరికి విక్రయించినదీ, వైద్యుడి ప్రిస్కిప్షన్‌ను తప్పనిసరిగా భద్రపరచాలి. అలాగే హోల్‌సేలర్స్‌ ఎన్ని మందులు కొనుగోలు చేసిందీ, ఎంత విక్రయించిందీ వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని చట్టం చెబుతోంది. ఒకవేళ ఎవరైనా అనధికారికంగా విక్రయించినట్టు తేలితే ఔషధ నియంత్రణ పరిపాలన అధికారులు చర్యలు తీసుకోవచ్చు. మెడికల్‌ స్టోర్‌ లైసెన్స్‌ రద్దు చేయడంతోపాటు క్రిమినల్‌ కేసు నమోదు చేసి జరిమానా విధించవచ్చు. అయితే, నగరంలోని పలు ప్రాంతాల్లోని మెడికల్‌ స్టోర్స్‌ నిబంధనలకు విరుద్ధంగా వీటి విక్రయాలు సాగిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. 


‘మత్తు’ కేంద్రాలుగా ఆ ప్రాంతాలు 

నగరంలోని కంచరపాలెం, అల్లిపురం, రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో కొంతమంది యువకులు యథేచ్ఛగా మత్తు మందులను విక్రయిస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. నగరంలోని కొన్ని మెడికల్‌ స్టోర్స్‌ నుంచి కొనుగోలు చేయడంతోపాటు ఒడిశా, ఛత్తీసగఢ్‌ నుంచి ఆయా మందులను తక్కువకు కొనుగోలు చేసి తీసుకువచ్చి ఇక్కడ యువతకు విక్రయిస్తున్నారు. మెడికల్‌ స్టోర్స్‌లో పనిచేసే కొంతమంది సిబ్బందే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. 


దీర్ఘకాలంలో ఇబ్బందులు

మానసిక రోగులకు, కేన్సర్‌ బాధితులకు, కొన్ని నొప్పులతో బాధపడే వాళ్లకి ఈ మందులను వినియోగిస్తారు. అది కూడా కొద్దికాలంపాటు మాత్రమే వాడాల్సి ఉంటుంది. అయితే, ఎటువంటి ఇబ్బందులు లేని యువత మత్తు కోసం, సరదా కోసం వీటిని వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మొదట్లో ఈ మందులు వినియోగించే వాళ్లు క్రమేణా గంజాయి, ఆల్కహాల్‌, మత్తు పదార్థాల వంటి వాటికి అలవాటుపడే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  


రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలి

- చంద్రశేఖర్‌, అదనపు సంచాలకులు, ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం

మత్తు కలిగించే ఇంజక్షన్లు, టాబ్లెట్లను ఇష్టానుసారంగా విక్రయించడానికి వీలులేదు. ఈ మేరకు మెడికల్‌ స్టోర్స్‌ నిర్వాహకులకు నిబంధనలు తెలియజేశాం. తప్పనిసరిగా వాటికి సంబంధించిన రికార్డులను నిర్వహించాలి. హోల్‌సేలర్స్‌ నుంచి ఆయా మందులు ఎంత కొనుగోలు చేసిందీ, ఎంత విక్రయించిందీ, ఎవరెవరికి విక్రయించిందీ, ఏ వైద్యుడు రాసిందీ వంటి వివరాలను భద్రపరచాలి. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా మెడికల్‌ స్టోర్స్‌లో ఈ తరహా మందులు విక్రయాలు సాగించినట్టు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయవచ్చు. 

Updated Date - 2022-05-21T06:50:07+05:30 IST