రక్తనిధి కేంద్రాలపై ఔషధ శాఖ దాడులు

ABN , First Publish Date - 2020-02-20T07:44:31+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా అధీకృత బ్లడ్‌ బ్యాంక్‌లపై ఔషధ తనిఖీ నియంత్రణ శాఖ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏపీ స్టేట్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌, ఐపీఎస్‌ అధికారి క్రిపానంద

రక్తనిధి కేంద్రాలపై ఔషధ శాఖ దాడులు

గుంటూరు (మెడికల్‌), ఫిబ్రవరి 19 : రాష్ట్రవ్యాప్తంగా అధీకృత బ్లడ్‌ బ్యాంక్‌లపై ఔషధ తనిఖీ నియంత్రణ శాఖ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏపీ స్టేట్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌, ఐపీఎస్‌ అధికారి క్రిపానంద త్రిపాఠి ఉజేలా ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో బ్లడ్‌ బ్యాంక్‌లపై డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఆకస్మికదాడులు నిర్వహించారు. ఆయా బ్లడ్‌ బ్యాంకుల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. పలుచోట్ల రక్తనిధి కేంద్రాల్లో వైద్యాధికారులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు అందుబాట్లో లేరు. కొన్ని కేంద్రాల్లో వైద్య పరికరాలు, సిబ్బందికి సంబంధించిన సరైన రికార్డులు లేవు. కొన్ని బ్లడ్‌బ్యాంక్‌ల్లో ఏసీలు పని చేయకపోవడాన్ని అధికారులు గమనించారు. రక్తదాతలు, బ్లడ్‌ బ్యాగ్‌ల పంపిణీకి సంబంధించిన రికార్డులు కూడా సంతృప్తికరంగా నిర్వహించడం లేదు. ఈ దాడుల్లో పలు బ్లడ్‌బ్యాంక్‌ల్లో వెల్లడైన వాస్తవ పరిస్థితులు, నాసిరకంగా ఉన్న నిర్వహణ చూసి ఔషధ తనిఖీ నియంత్రణ శాఖాదికారులు ఆశ్చర్యపోయారు. బ్లడ్‌ బ్యాంక్‌ల్లో కొన్ని యూనిట్లను క్వాలిటీ కంట్రోల్‌ పరీక్షలకు పంపాల్సి ఉంటుంది. ఇది ఎవరూ పాటించడం లేదని ఈ తనిఖీల్లో వెల్లడైంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ జనరల్‌ త్రిపాఠి ఉజేలా మాట్లాడుతూ గత 26 రోజులుగా ఆరు దఫాలుగా రాష్ట్రంలో మొత్తం 179 అధీకృత బ్లడ్‌ బ్యాంకుల్లో తనిఖీలు చేసినట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించినట్లయిందన్నారు. అత్యధిక బ్లడ్‌ బ్యాంకుల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించి వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆయా బ్లడ్‌బ్యాంక్‌ల నుంచి తగిన వివరణ అందిన తర్వాత వాటిని పరిశీలించి శాఖాపరంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన బ్లడ్‌ బ్యాంక్‌లు తగిన నిర్దేశిత నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందేనని డీజీ ఉజేలా స్పష్టం చేశారు. 

Updated Date - 2020-02-20T07:44:31+05:30 IST