విధుల్లోకి తీసుకోవాలంటూ.. డీఆర్పీల న్యాయపోరాటం

ABN , First Publish Date - 2021-10-15T06:55:07+05:30 IST

న్యాయంగా విధులనుంచి తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ శ్శాట్‌ డీఆర్పీల న్యాయపోరాట కమిటీ తమ ఆందోళనను కొనసాగిస్తోంది.

విధుల్లోకి తీసుకోవాలంటూ.. డీఆర్పీల న్యాయపోరాటం
మంగళగిరి అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న డీఆర్పీలు

 మంగళగిరి, అక్టోబరు 14: అన్యాయంగా విధులనుంచి తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ శ్శాట్‌ డీఆర్పీల న్యాయపోరాట కమిటీ తమ ఆందోళనను కొనసాగిస్తోంది. ఏపీ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో సొసైటీ ఫర్‌ సోషల్‌ ఆడిట్‌ ఎకౌంటబిలిటీ అండ్‌ ట్రాన్స్‌ఫరెన్స్‌ (శ్శాట్‌)లో డిస్ట్రిక్ట్‌ రిసోర్స్‌ పర్సన్‌లుగా పరీక్ష ద్వారా కొందరు అభ్యర్థులు పదేళ్ల క్రితం ఎంపికై నెలకు రూ.5,500 వేతనంపై పని చేస్తున్నారు. ప్రస్తుత కాలానికి వీరి భత్యం రూ.15వేలకు చేరింది. వీరిలో ఏడు జిల్లాలకు చెందిన 24 మంది ఉద్యోగులను ఏడాది కిందట తొలగించారు. తమను అక్రమంగా విధులనుంచి తొలగించారంటూ డీఆర్పీలు ఈ ఏడాది జూన్‌ 29న గోరంట్లలోని ఏపీ శ్శాట్‌ కార్యాలయం ఎదుట దళిత, ప్రజాసంఘాల సహకారంతో పోరాట దీక్ష చేయడంతో జూలై 27న ఇద్దరు డైరెక్టర్లు వీరికి రీఇన్‌స్టేట్‌మెంట్‌ ఉత్తర్వులను ఇచ్చారు. ఈ ఉత్తర్వులనైతే ఇచ్చారు కానీ వారిని ఇంతవరకు విధుల్లోకి తీసుకోలేదు. దీంతో బాధిత ఉద్యోగులు గత కొన్ని మాసాలుగా ప్రజాప్రతినిఽధులందరి చుట్టూ తిరుగుతూ తమకు న్యాయం చేయాలని వేడుకుంటూ వచ్చారు. రీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చి సుమారు 70 రోజులు కావొస్తున్నా విధుల్లోకి తీసుకోకుండా తాత్సారం చేయడం పట్ల బాఽధితులు ఆందోళన వ్యక్తం చేస్తూ మళ్లీ పోరాటబాట పట్టారు. తమను వెంటనే తిరిగి విఽదుల్లోకి తీసుకోవాలని కోరుతూ జిల్లాలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలను చేపట్టారు. డీఆర్పీల ఆందోళనపై టీడీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కూడ స్పందించారు. తొలగించిన ఏపీ శ్శాట్‌ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆయన గురువారం ముఖ్యమంత్రి జగన్‌కు లేఖను రాశారు. అలాగే వారికి రావల్సిన జీతాల తాలూకు బకాయిలను కూడ చెల్లించాలని ఆలేఖలో డిమాండ్‌ చేశారు. గతంలో ప్రతిపక్షనేతగా వున్నపుడు పాదయాత్ర చేస్తూ మీరిచ్చిన హమీలను మీకు గుర్తు చేసేందుకు ఇలా లేఖలు రాయాల్సిరావడం విచారకరమని లోకేశ్‌ సీఎంని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీగోడు విన్నానంటిరి.. మీ మాటలు నమ్మి ఓట్లేసిన ఉద్యోగులను మీరు సీఎం కాగానే మరిచిపోయారు.. వారికిచ్చిన హామీలన్నింటిని గాలికొదిలేశారు. మీ బులుగు కార్యకర్తలను కొలువుల్లో కూర్చోబెట్టేందుకు మీనేతలు పోస్టులను అమ్ముకోవడం వలన ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్ని అన్యాయంగా తొలగించివేశారు. మీ ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన నెలల తరబడి జీతాలురాక వేలాది ఉద్యోగుల కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. మీ నిర్వాకం కారణంగా ఉద్యోగాలను కోల్పోయిన డీఆర్పీలను వెంటనే తిరిగి విఽధుల్లోకి తీసుకుని వారి కుటుంబాలను ఆదుకోవాలని లోకేశ్‌ సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

 

Updated Date - 2021-10-15T06:55:07+05:30 IST