ముంచేసిన వాన..!

ABN , First Publish Date - 2021-05-13T05:15:13+05:30 IST

జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లో అకాల వర్షాల ప్రభావం అధికంగా ఉంది. తొలకరికి ముందు కురుస్తున్న ఈ వర్షాల్లో ఈదురుగాలుల తీవ్రత అధికంగా

ముంచేసిన వాన..!
రాజుపాళెం మండలంలో వర్షానికి తడిసిన వరి ధాన్యం

కల్లాల్లోనే తడిసిపోయిన వరిధాన్యం

కుప్పకూలిన అరటి.. రాలిన మామిడి

నువ్వుల పంటకు భారీనష్టం 

దెబ్బతిన్న కూరగాయల పంటలు

బి.మఠం మండలంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి


మట్టిని నమ్మి సేద్యం చేస్తున్న అన్నదాతకు అన్నీ కష్టాలే. ప్రకృతి విపత్తులు కష్టజీవులను ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ఓ పక్క పండించిన పంటకు కరోనా కారణంగా రవాణా లేక ధర లేదు. వచ్చినకాడికి అమ్మేద్దామని పంట కోతకు సిద్ధమవుతున్న తరుణంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అపార నష్టం జరిగింది. వరిధాన్యం కల్లాల్లోనే తడిసి ముద్దయింది. అరటి చెట్లు కూలిపోయాయి. మామిడి కాయలు రాలిపోయాయి. పట్టలపై ఆరబోసిన నువ్వులు తడిసి రంగుమారాయి. మొత్తంగా అకాల వర్షం కష్టజీవులను ముంచేసింది. బి.మఠం మండలంలో పిడుగు పాటుకు ఓ మహిళ మృతిచెందింది.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లో అకాల వర్షాల ప్రభావం అధికంగా ఉంది. తొలకరికి ముందు కురుస్తున్న ఈ వర్షాల్లో ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో రబీ కింద సాగు చేసిన వివిధ పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో సరాసరి 3 వేల ఎకరాలకు పైగా వరి, 400 ఎకరాల్లో అరటి, 300 ఎకరాలకు పైగా నువ్వుల పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. రాయచోటి నియోజకవర్గంలో సాగులో ఉన్న టమోటా భారీగా దెబ్బతింది. పక్వానికి వచ్చిన మామిడి కాయలు గాలులకు రాలిపోయి రైతులు నష్టపోయారు. ఉద్యానపంటలు, వ్యవసాయ పంటల రూపంలో రూ.5 కోట్లకు పైగా నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.


తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

కరోనా కట్టడి నేపధ్యంలో పలు రాషా్ట్రల్లో లాక్‌డౌన, మన రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులో ఉంది. వ్యవసాయ పంటల రవాణాకు ఆంక్షల సడలింపు ఉన్నా రవాణా అస్తవ్యస్తంగా మారింది. దీంతో వరి, నువ్వులు తదితర ఉత్పత్తుల ధరలు పతనమయ్యాయి. వారం క్రితం పుట్టి ధాన్యం రూ.10వేలకు పైగా పలికితే ప్రస్తుతం నాణ్యతను బట్టి రూ.6 వేల నుంచి రూ.7 వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. అంటే.. 78 కిలోల బస్తా రూ.950 మించి కొనడం లేదని రైతులు అంటున్నారు. ఇలాంటి తరుణంలో వర్షాలకు జమ్మలమడుగు, రాజుపాలెం, ప్రొద్దుటూరు మండలాల్లో కేసీ, కుందూ నదుల కింద సాగు చేసిన ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యం రంగుమారుతుందని, దీనిని కొనేవారే ఉండరని రైతులు అంటున్నారు. ఈ పరిస్థితిలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర క్వింటా రూ.1850లకు కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అదే క్రమంలో దువ్వూరు మండలంలో నువ్వులు కోతకోసి పట్టలపై ఆరబెట్టారు. రేపో.. మాపో కల్లం చేద్దామనుకుంటే రాత్రికి రాత్రే కురిసిన భారీవర్షం తడిపేసింది.


వివిధ మండలాల్లో నష్టం ఇలా..

- రాజుపాలెం మండలంలో కుందూ నది ఆధారంగా 300ఎకరాల్లో వరిసాగు చేశారు. కొందరు రైతులు వరి కోత కోసి రోడ్లపై ధాన్యం ఆరబోశారు. మరికొందరు కోతకు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే వర్షం రూపంలో ప్రకృతి రైతులను నష్టాల్లోకి నెట్టేసింది. కల్లంలోనే ధాన్యం తడిసి ఎకరాకు రెండు మూడు బస్తాలు కోల్పోయారు. 

- ప్రొద్దుటూరు మండలంలో కేసీ కాలువ, బోరు బావుల కింద 1900-2000 ఎకరాల్లో వరిసాగు చేశారు. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. కల్లంలోనే ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ మండలంలో ప్రస్తుతం 78 కిలోల బస్తా ధాన్యం రూ.900-950లకు మించి కొనుగోలు చేయడం లేదు. 

- జమ్మలమడుగు మండలంలో బోరుబావుల కింద రబీ పంటగా 2వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. ఇప్పటికే కొందరు రైతులు కోతకోసి మార్కెట్‌కు తరలించారు. కొందరు కోతకు సిద్ధమవుతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల భారీ వర్షాలకు 400ఎకరాల్లో కోత దశలో ఉన్న ధాన్యం నేలకొరిగింది. 

- లింగాల మండలంలో అరటి ఎక్కువగా సాగు చేస్తున్నారు. 60-70 ఎకరాల్లో అరటి చెట్లు గాలులు, వర్షాలకు కుప్పకూలిపోయాయి. రూ.70లక్షలకు పైగా నష్టం జరిగి ఉంటుందని ఉద్యానవన శాఖాధికారుల ప్రాథమిక అంచనా.

- దువ్వూరు మండలంలో రబీ పంటగా నువ్వులు సాగు చేస్తున్నారు. 300ఎకరాల్లో సాగు చేశారు. ఎండలు అధికంగా ఉండటంతో పంట కోసి పట్టలపై ఆరబెట్టారు. రాత్రికి రాత్రే కురిసిన వర్షాలు మొత్తం పంటను తడిపి ముద్దచేసింది. నువ్వులు బస్తా రూ.8వేలు రూ.9వేలు పలుకుతోంది. వర్షానికి తడవడంతో రూ.4వేలు - రూ.5వేలకు మించి కొనేవారు ముందుకు రారని భారీగా నష్టపోయామని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


పిడుగుపాటుకు మహిళ

బి.మఠం మండలం మల్లేపల్లె గ్రామంలో ఇంటిలో పడుకొని ఉన్న ఓబుగారి లక్ష్మి(36) పిడుగుపాటుకు మృత్యువాత పడ్డారు. భారీ ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షాలకు పిడుగు పడింది. అదే మండలంలో ములుగుడుపాడు మండలంలో పిడుగు పడి రెండు గేదెలు మృతి చెందాయి.


రూ.1.25 లక్షలు నష్టపోయా

- కొల్లు శ్రీనివాసులు, నువ్వుల రైతు, దువ్వూరు

అరటి తొలగించి రబీ పంటగా నువ్వులు సాగు చేశాను. పంట ఏపుగా పెరుగుతుంటే ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25వేలు పెట్టుబడి పెట్టాను. పంట బాగా పెరిగింది. ఎకరాకు 8బస్తాల దిగుబడి వస్తుందని ఆశించాను. పంట కోసి ఎండకు ఆరబెట్టాను. రేపో.. మాపో కల్లం చేద్దామనుకుంటుండగా రాత్రి కురిసిన పెద్దవానకు తడిసిపోయింది. తడిసిన పంటను క్వింటా రూ.3వేల నుంచి 5వేలకు మించి కొనుగోలు చేయరు. దీంతో నేను రూ.1.25లక్షలకు పైగా నష్టపోయాను. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.


ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

- కొండారెడ్డి, టంగుటూరు గ్రామం, రాజుపాలెం మండలం

కుందూ నది ఆధారంగా ఆరు ఎకరాల్లో వరి సాగుచేశాను. సోమవారమే... వరికోత యంత్రం ద్వారా పంటను కోసి నూర్పిడి చేసి ధాన్యం రోడ్డుపై ఆరబోసాను. ఒకటి రెండు రోజుల్లో మార్కెట్‌కు తీసుకెళ్లాల్సి ఉంది. రాత్రి కురిసిన వర్షాలకు పూర్తిగా ధాన్యం తడిసిపోయింది. 12 బస్తాల ధాన్యం కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యం రంగు మారుతుంది. రంగుమారిన ధాన్యాన్ని కొనేవారు ముందుకు రావడం లేదు. ప్రభుత్వమే మద్దతు ధర క్వింటా రూ.1850లకు కొనుగోలు చేసి ఆదుకోవాలి.



Updated Date - 2021-05-13T05:15:13+05:30 IST